Air India Safety Demo: విమానంలో కూర్చున్న తర్వాత సాధారణంగా ప్రయాణికుల దృష్టి టేకాఫ్ పైనే ఉంటుంది. అయితే, విమానం గాల్లోకి ఎగరడానికి ముందు జరిగే సేఫ్టీ డెమో కూడా ప్రయాణంలో ఒక ప్రత్యేక అనుభూతిగా మారుతోంది. సీటుబెల్ట్ ఎలా పెట్టుకోవాలి? ఆక్సిజన్ మాస్క్ ఎలా ఉపయోగించాలి? అత్యవసర సమయంలో ఏం చేయాలి? లాంటి ముఖ్యమైన భద్రతా సూచనలను సాధారణంగా సిబ్బంది ప్రయాణికులకు వివరిస్తారు. అయితే, భారతీయ విమానయాన సంస్థలు ఈ సాధారణ భద్రతా అనౌన్స్ మెంట్లను సరికొత్తగా తీసుకొచ్చాయి. ఓ వైపు ఫన్నీగా, మరోవైపు భారతీయ కళలు, సంస్కృతిని పరిచయం చేసే విధంగా సేఫ్టీ బ్రీఫింగ్ ను ఆసక్తికరంగా అందిస్తున్నారు.
భారతీయ విమాన ప్రయాణాల్లో అప్పుడప్పుడు పైలట్లే స్వయంగా సేఫ్టీ అనౌన్స్ మెంట్స్ చేయడం వైరల్ అవుతోంది. ముఖ్యంగా స్పైస్ జెట్ కు చెందిన కొందరు పైలట్లు సాధారణ సూచనలను హిందీ కవిత్వం, షాయరీ, హాస్యంతో చెప్పిన సందర్భాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. కెప్టెన్ మోహిత్ టియోటియాలాంటి పైలట్లు ప్రయాణికులను ఆకట్టుకునేలా అనౌన్స్ మెంట్లు చేస్తుంటారు. సాధారణంగా వినిపించే అధికారిక ప్రకటనలకు బదులుగా, సరదా పదాలతో భద్రతా సూచనలు ఇవ్వడంతో ప్రయాణికులు ఫుల్ ఫిదా అయ్యారు.
తాజాగా భద్రతా ప్రదర్శనకు సాంస్కృతిక రూపాన్ని అందించేలా రూపొందించిన వీడియో ఎయిర్ ఇండియా ‘సేఫ్టీ ముద్ర’. ఇందులో విమాన భద్రతా సూచనలను భారతీయ నృత్య సంప్రదాయాలతో లింక్ చేసి చూపించారు. భరతనాట్యం, కథక్, కథకళి, బిహు లాంటి భారతీయ శాస్త్రీయ, జానపద కళారూపాల హావభావాలను ఉపయోగిస్తూ సీటుబెల్ట్, ఆక్సిజన్ మాస్క్, అత్యవసర పరిస్థితుల్లో పాటించాల్సిన నియమాలను చూపించారు. దీంతో ప్రయాణికులకు భద్రతా సూచనలు చెప్పడమే కాకుండా భారతీయ కళా వైభవాన్ని కూడా పరిచయం చేసే ప్రయత్నం జరిగింది.
విమానంలో సేఫ్టీ డెమో చాలా ముఖ్యమైనది. అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ప్రయాణికులు గందరగోళానికి గురికాకుండా ముందుగానే కొన్ని కీలక విషయాలు తెలుసుకోవాలి. అందుకే ప్రతి ప్రయాణికుడు ఈ సూచనలను శ్రద్ధగా గమనించాలని విమానయాన సంస్థలు చెబుతుంటాయి. సాధారణ ప్రకటనల కంటే వినోదాత్మకంగా, విజువల్ పరంగా ఆకట్టుకునే విధంగా రూపొందించిన వీడియోలు ప్రయాణికుల దృష్టిని ఎక్కువగా ఆకట్టుకునే అవకాశం ఉంటుంది.
భారతీయ విమానయాన రంగంలో ఇలాంటి క్రియేటివ్ ప్రయోగాలు మరో విషయాన్ని కూడా చూపిస్తున్నాయి. భద్రతా నిబంధనలు అందరికీ ఒకేలా ఉన్నప్పటికీ వాటిని ప్రయాణికులకు ఎలా అందించాలనే విషయంలో కొత్త ఆలోచనలు వస్తున్నాయి. ఒకవైపు పైలట్ షాయరీతో ప్రయాణికులను నవ్విస్తుంటే.. మరోవైపు భారతీయ నృత్య భంగిమలతో సేఫ్టీ సూచనలు అందిస్తున్నారు. దీంతో విమానం గాల్లోకి ఎగరడానికి ముందే ప్రయాణికులకు ఒక ప్రత్యేకమైన అవగాహన లభిస్తోంది.
Read Also: హైదరాబాద్‌లోనే జపాన్ ఫీలింగ్, మచ్చా తాగుతూ.. అనిమే చూస్తూ.. ఎంజాయ్ చేసేయండి!