5 Mysterious Railway Stations in India: రైల్వే స్టేషన్ అంటే సాధారణంగా ప్రయాణికుల రద్దీ, రైళ్ల రాకపోకలతో సందడిగా కనిపించే ప్రదేశం. కానీ, దేశంలో కొన్ని రైల్వే స్టేషన్ల పేరు చేప్తేనే జనాల వెన్నులో వణుకుపుడుతుంది. దానికి కారణం.. భయానక కథలు ప్రచారంలో ఉండటం. రాత్రి వేళల్లో అక్కడ వింత శబ్దాలు వినిపిస్తాయని, నీడలు కనిపిస్తాయని, ఆత్మలు సంచరిస్తుంటాయని స్థానికులు చెప్తుంటారు. అందుకే ఇవి హాంటెడ్ రైల్వే స్టేషన్లుగా గుర్తింపు పొందాయి.
పశ్చిమ బెంగాల్‌లోని పురులియా జిల్లాలో ఉన్న బెగన్‌కొడార్ రైల్వే స్టేషన్ ఈ లిస్టులో ఎక్కువగా వినిపించే పేరు. ఇక్కడ రాత్రిపూట తెల్లటి చీరలో ఓ మహిళ కనిపిస్తుందని స్థానికులు చెబుతుంటారు. రైలు పట్టాల దగ్గర ఆమె ఉంటుందని, రైలు వెళ్లే సమయంలో కూడా ఆమెను చూసినట్లు కొందరు చెప్పిన కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ భయానక ప్రచారం కారణంగా స్టేషన్ దాదాపు 42 సంవత్సరాల పాటు మూసివేశారు. అనంతరం మళ్లీ రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. అయితే, ఇక్కడ దెయ్యం ఉందనే వాదనకు నిర్ధారిత ఆధారాలు లేవు.
హిమాచల్ ప్రదేశ్‌లోని బరోగ్ రైల్వే స్టేషన్ సమీపంలోని టన్నెల్ నంబర్ 33 కూడా ఒక విషాద కథతో ముడిపడి ఉంది. ఈ సొరంగం నిర్మాణంలో పనిచేసిన బ్రిటిష్ ఇంజనీర్ కల్నల్ బరోగ్ పేరు దీనికి వచ్చింది. నిర్మాణ సమయంలో ఎదురైన సమస్యలతో ఆయన తీవ్ర నిరాశకు గురై మరణించారని చెప్తుంటారు. అనంతరం ఆయన ఆత్మ సొరంగం, స్టేషన్ పరిసరాల్లో తిరుగుతుందని స్థానికంగా ప్రచారం మొదలైంది. దీంతో బరోగ్ పేరు రైల్వే చరిత్రతో పాటు రహస్య కథల్లోనూ వినిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు రైల్వే స్టేషన్‌కు కూడా ఓ విషాద ఘటనను ముడిపెట్టి కథలు ప్రచారంలో ఉన్నాయి. CRPF జవాన్ హరి సింగ్ విధుల్లో ఉండగా జరిగిన గొడవలో తీవ్రంగా గాయపడి మరణించారని, అనంతరం ఆయన ఆత్మ స్టేషన్‌లో సంచరిస్తోందనే నమ్మకం ఏర్పడిందని కథనాలు చెబుతున్నాయి. ఈ కథ స్థానికంగా ఆసక్తిని కలిగించినప్పటికీ.. ఆత్మ సంచరిస్తోందనే విషయాన్ని నిర్ధారించే ఆధారాలు లేవు.
ఉత్తరప్రదేశ్‌లోని నైని రైల్వే స్టేషన్ సమీపంలో గతంలో జైలు ఉండేది. స్వాతంత్ర్య సమరయోధులను అక్కడ హింసించి చంపేవారని, వారి ఆత్మలే స్టేషన్ పరిసరాల్లో సంచరిస్తున్నాయని స్థానికంగా ఓ నమ్మకం ఉంది. చరిత్రలో నైని జైలుకు ఉన్న ప్రాధాన్యం కారణంగా ఈ ప్రాంతానికి ఎన్నో కథలు ముడిపడ్డాయి. వాటిలో ఆత్మల కథ కూడా ఒకటిగా ప్రచారంలోకి వచ్చింది.
కోల్‌కతాలోని రవీంద్ర సరోబర్ మెట్రో స్టేషన్ కూడా ఇలాంటి కథలతో ప్రాచుర్యంలోకి వచ్చింది. రాత్రివేళల్లో పట్టాలపై వింత నీడలు కనిపిస్తాయని, అసాధారణ ఘటనలు ఎదురవుతాయని స్థానికులు చెబుతుంటారు. అయితే ఇలాంటి వాటికి వెలుతురు, నీడలు, శబ్దాల ప్రతిధ్వని లాంటి సహజ కారణాలు కూడా ఉండొచ్చు నిపుణులు చెప్తుంటారు. అయినప్పటికీ ఈ కథలు సోషల్ మీడియాలో, ప్రయాణ కథనాల్లో విస్తృతంగా ప్రచారం పొందుతున్నాయి.
Read Also: నవ్వులు.. ఏడుపులు.. వింత ఆకారాలు.. డుమాస్ బీచ్ కథ వింటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే!