Underground Missile City Qeshm Island: ఖేష్మ్ ద్వీపం. ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా యుద్ధానికి ముందు చాలా మందికి ఈ పేరు పెద్దగా తెలియదు. తాజాగా అమెరికా ఈ ద్వీపాన్ని టార్గెట్ చేసి శక్తివంతమైన బాంబులు వేయడంతో, యుద్ధంలో ఇప్పుడు వ్యూహాత్మక కేంద్ర బిందువుగా మారింది. అసాధారణమైన సహజ నిర్మాణాల కారణంగా బహిరంగ భౌగోళిక మ్యూజియంగా ప్రసిద్ధి చెందిన ఖేష్మ్ ద్వీపాన్ని.. హోర్ముజ్ జలసంధిని నియంత్రించడానికి ఇరాన్ శక్తివంతమైన భూగర్భ క్షిపణి నగరంగా మార్చేసింది. పర్షియన్ గల్ఫ్ లో అతిపెద్ద ఖేష్మ్ ద్వీపం ఇరాన్ ఆయుధాల ఆయువు పట్టుగా కొనసాగుతోంది.
అమెరికా ఇప్పుడు ఖేష్మ్ ద్వీపాన్ని ధ్వంసం చేసే పని మొదలుపెట్టింది. మార్చి 7న ద్వీపంలోని డీశాలినేషన్ ప్లాంట్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా వైమానిక దాడులు చేసింది. ఈ దాడి తర్వాత ద్వీపంలోని 30 గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్.. బహ్రెయిన్ లోని అమెరికా బలగాలపై దాడులు చేసింది.
ఇరాన్ సైనిక కేంద్రంగా మారకముందు, ఖేష్మ్ అద్భుతమైన జీవావరణం, పురాతన ప్రదేశాలకు ప్రసిద్ధి చెందింది.
⦿ ఖేష్మ్ జియోపార్క్: ఈ ప్రాంతాన్ని2006లో యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఇది భూభాగ రూపాంతరానికి కారణమయ్యే క్రమక్షయాన్ని కలిగి ఉంది.
⦿ నమక్ దాన్ ఉప్పు గుహ: ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఉప్పు గుహలలో ఇది ఒకటి. 6 కి.మీ.కు పైగా పొడవు ఉంటుంది. ఇది వందల మిలియన్ల సంవత్సరాల నాటి స్ఫటికాకార నిర్మాణాలకు నిలయంగా కొనసాగుతోంది.
⦿ నక్షత్రాల లోయ: వేల సంవత్సరాల గాలి, నీటి ప్రవాహంతో ఈ లోయ చెక్కబడింది. రాతి స్తంభాల వలయం.. కారణంగా పడిపోయిన నక్షత్రంలా కనిపిస్తుంది.
⦿ హరా మడ అడవి: వలస పక్షులకు ముఖ్యమైన సంతానోత్పత్తి కేంద్రంగా కొనసాగుతోంది. స్థానిక పర్యాటకానికి ఒక ప్రధాన కేంద్రంగా గుర్తింపు తెచ్చుకుంది.
⦿ బంగారం బావులు: లాఫ్ట్ లో వర్షపు నీటిని సేకరించడానికి సుమారు 2,000 సంవత్సరాల క్రితం ఈ 366 బావులను తవ్వారు. అక్కడ బంగారు నిల్వలు ఉన్నాయి.
ఖేష్మ్ లో ఉన్న సహజ నిర్మాణాలను ఇరాన్ ప్రభుత్వం తమ సైనిక అవసరాలకు అనుగుణంగా మలుచుకునే ప్రయత్నం చేసింది. క్షిపణి కోటగా మార్చుకుంది. సున్నపురాయి, ఉప్పులో లోతుగా తవ్విన సొరంగాల నెట్ వర్క్ లు, నౌకా విధ్వంసక క్రూయిజ్ క్షిపణులు, సుదూర బాలిస్టిక్ యూనిట్లకు నిలయాలుగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ ద్వీపం భూగరంలో పలు ప్రాంతాను భూకంప నిరోధక కాంక్రీటుతో నిర్మించింది ఇరాన్. క్షిపణి ప్రయోగాలకు అవసరమైన వెంటిలేషన్, అత్యవసర విద్యుత్, రైలు వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఇంధన రవాణా మార్గమైన హోర్ముజ్ జలసంధిలో ఈ ద్వీపం ఒక బిరడాలా పని చేస్తుంది. ఈ ప్రాంతం నుంచి ఇరాన్ హోర్ముజ్ ను కంట్రోల్ చేస్తుంది.
సైనిక విశ్లేషకులు ఖేష్మ్ ద్వీరంలోని భూగర్భ ప్రాంతాల్లో అనేక కీలక ఆయుధ వ్యవస్థలు ఉన్నట్లు చెప్తున్నారు.
⦿ నౌకా విధ్వంసక క్రూయిజ్ క్షిపణులు: హోర్ముజ్ జలసంధిలోని నౌకాదళ నౌకలను లక్ష్యంగా చేసుకోవడానికి వీటిని రూపొందించారు. ఇక్కడ 1000 కిలో మీటర్ల పరిధిని కలిగి ఉండే గడా 380, HY-2 సిల్క్ వార్మ్ క్షిపణులు ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
⦿ బాలిస్టిక్ క్షిపణులు: ఖేష్మ్ భూగర్భంలో ఘన, ద్రవ ఇంధన బాలిస్టిక్ క్షిపణులకు చెందిన నిల్వ ఉన్నట్లు తెలుస్తోంది. భూగర్భం నుంచి ప్రయోగించే 800 కిలో మీటర్ల పరిధి కలిగిన ఖియామ్-1 క్షిపణులు, అధిక వేగం కలిగిన ఖైబర్ షెకాన్ మిసైల్, మిగ్ రేంజ్ మిసైల్స్ ఘదర్, ఇమాద్ ఉన్నాయి. కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించే ఆయుధాలు బోలెడు ఉన్నట్లు తెలుస్తోంది.
బందర్ అబ్బాస్ ఓడరేవుకు కేవలం 22 కిలోమీటర్ల దక్షిణాన ఉన్న ఖేష్మ్, క్లారెన్స్ జలసంధిపై ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ ద్వీపాన్ని భూగర్భ క్షిపణి నగరంగా అభివర్ణిస్తున్నారు. ఇందులో వేగవంతమైన అటాక్ బోట్స్ నెట్ వర్క్ ను కలిగి ఉంది. ప్రస్తుతం హోర్ముజ్ జలసంధి మీదుగా వెళ్లే ఇరాన్ వ్యతిరేక దేశాల నౌకలపై ఇక్కడి నుంచే దాడులు జరిగాయి. చిన్న ఐఆర్‌జిసి పడవలు దక్షిణ తీరప్రాంతం నుంచి వేగంగా దూసుకువెళ్లి, జలసంధిలోని 200 అడుగుల లోతు ఉన్న జలాల్లో సముద్ర మైన్లను అమర్చుతున్నట్లు అల్ జజీరా లాంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి.
హోర్ముజ్ జలసంధి పూర్తి దిగ్బంధనానికి బదులుగా, నౌకాయానానికి రాజకీయ గ్రీన్ లైట్ వ్యవస్థను అమలు చేయడానికి ఇరాన్ ఈ ద్వీపాన్ని ఉపయోగిస్తోంది. సురక్షిత ప్రయాణం కోరుకునే నౌకలు ఇప్పుడు లారాక్, ఖేష్మ్ ద్వీపాల మధ్య ఆగే ఒక నిర్దిష్ట మార్గాన్ని అనుసరించాల్సి ఉంటుంది. ఈ దారి మళ్లింపు ఒక ధృవీకరణ ప్రక్రియగా పనిచేస్తుంది. దీని ప్రకారం భారత్, టర్కీ, పాకిస్తాన్ లాంటి దేశాల నుంచి వచ్చే నౌకలు ప్రయాణించడానికి టెహ్రాన్ అనుమతి ఇస్తుంది. ఈ జలసంధి అధికారికంగా మూసివేయబడనప్పటికీ, రవాణా అనేది ఇరాన్ తో మంచి సంబంధాలు ఉన్న దేశాలకే సాధ్యం అవుతోంది. అయితే, ఈ ద్వీపాన్ని నాశనం చేయడం ద్వారా హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ పెత్తనం లేకుండా చేయాలని అమెరికా భావిస్తోంది. అందుకే, ఈ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోంది.
Read Also: యుద్ధ సమయంలో సంపన్నులు తలదాచుకొనే దేశాలివే.. ఈ ప్రాంతాలు అంత సేఫా?