Indian Railways: రైల్వే టికెట్ బుకింగ్ వ్యవస్థ మరింత ఈజీగా మారబోతోంది. భారతీయ రైల్వే ఆధునిక సాంకేతికతతో కూడిన కొత్త ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS)ని తీసుకువస్తోంది. ఈ వ్యవస్థ డిసెంబర్ 2025 నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రస్తుత టికెట్ బుకింగ్ వ్యవస్థతో పోల్చితే ఐదు రెట్లు వేగంగా పని చేయనుంది.
కొత్త రిజర్వేషన్ వ్యవస్థ ప్రత్యేకతలు
⦿ ప్రస్తుత టికెట్ బుకింగ్ వ్యవస్థలో నిమిషానికి 32,000 టికెట్లు బుక్ అవుతుండగా, కొత్త వ్యవస్థతో 1.5 లక్షల టికెట్లు బుక్ అవుతాయి.
⦿ నిమిషానికి విచారణ సామర్థ్యం 4 లక్షల నుంచి 40 లక్షలకు పెరగనుంది.
⦿ ప్రస్తుతం పరిమిత భాషల్లో ఇంటర్ ఫేస్ అందుబాటులో ఉండగా, ఇకపై పలు భాషలతో అందుబాటులోకి రానుంది.
⦿ సీట్ల ఎంపిక, ఛార్జీల క్యాలెండర్ అందుబాటులో ఉంటుంది.
⦿ దివ్యాంగులు, విద్యార్థులు, రోగులకు ప్రత్యేక సౌకర్యాలు అందించనుంది.
⦿ ముందస్తు చార్టింగ్ సౌకర్యం పెరిగి ప్రయాణ అనిశ్చితి తగ్గుతుంది.
అందుబాటులోకి ముందస్తు చార్టింగ్
రైల్వేలు ఇప్పుడు సుదూర రైళ్లకు ముందుగానే చార్టింగ్ ను ప్రిపేర్ చేయబోతోంది. మధ్యాహ్నం 2 గంటలకు ముందు బయలుదేరే రైళ్లకు, ముందు రోజు రాత్రి 9 గంటల నాటికి చార్ట్ తయారు చేయబడుతుంది. వెయిటింగ్ లిస్ట్ లోని ప్రయాణీకులకు సకాలంలో సమాచారం అందించడం ద్వారా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ప్రస్తుత రైల్వే వ్యవస్థపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండకుండా దశల వారీగా ఈ పథకాన్ని అమలు చేయాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదేశించారు.
తత్కాల్ బుకింగ్ కోసం కొత్త నిబంధనలు
అటు జూలై 1 నుంచి IRCTC తత్కాల్ టికెట్ల బుకింగ్ కు సంబంధించి కొత్త నిబంధలను అందుబాటులోకి రానున్నాయి.
1.ఆధార్ లేదంటే ప్రభుత్వ గుర్తింపు కార్డు ప్రామాణీకరణ తప్పనిసరి.
2.ఈ గుర్తింపు కార్డు డిజిలాకర్ కు లింక్ చేయబడుతుంది.
3.జూలై చివరి నాటికి OTP ఆధారిత ధృవీకరణ కూడా తప్పనిసరి చేయబడుతుంది.
4.భద్రత, పారదర్శకతను నిర్ధారించడంతో పాటు టికెట్ల దుర్వినియోగాన్ని నివారిస్తుంది.
Read Also: ఏపీ నుంచి యూపీకి వెళ్లేందుకు మూడేళ్లు.. దేశంలోనే అత్యంత ఆలస్యమైన రైలు ఇదే!
స్మార్ట్ గా టికెట్ బుకింగ్ వ్యవస్థ
కొత్త టికెట్ బుకింగ్ వ్యవస్థకు సంబంధించి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక విషయాలు వెల్లడించారు. టికెటింగ్ వ్యవస్థను సజావుగా, అందుబాటులోకి తీసుకురావడమే రైల్వే లక్ష్యమన్నారు. కొత్త విధానంతో ప్రయాణీకుల అనుభవం పూర్తిగా మారుతుందన్నారు. వేగవంతమైన సేవ, మరిన్ని ఎంపికలు, ఇబ్బంది లేని టికెట్ బుకింగ్ అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు.
Read Also: ఈ రైలు పొడవు 3.5 కి.మీలు.. ఎన్ని కోచ్ లు ఉంటాయో తెలుసా?