Indian Railways Festive Rush: పండుగ సీజన్ వచ్చిందంటే రైళ్లలో ప్రయాణికుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోతుంది. ముఖ్యంగా దసరా, దీపావళి సమయంలో సొంతూళ్లకు వెళ్లేవారితో రిజర్వేషన్ టికెట్లకు భారీ డిమాండ్ ఉంటుంది. ఈ రద్దీని కొంతవరకు తగ్గించేందుకు తూర్పు తీర రైల్వే (ECoR) కీలక నిర్ణయం తీసుకుంది. పలు సుదూర, ఇంటర్ సిటీ రైళ్లకు తాత్కాలికంగా అదనపు కోచ్‌లను యాడ్ చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో ఆయా మార్గాల్లో ప్రయాణించే వారికి మరిన్ని బెర్త్ లు, సీట్లు అందుబాటులోకి రానున్నాయి.
భువనేశ్వర్ నుంచి బెంగళూరు వెళ్లే ప్రశాంతి ఎక్స్ ప్రెస్ కు అదనపు బోగీలు అందుబాటులోకి రానున్నాయి. రైలు నంబర్ 18463 భువనేశ్వర్–KSR బెంగళూరు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌కు అక్టోబర్ 1 నుంచి 31 వరకు ఒక థర్డ్ ఏసీ కోచ్‌ను అదనంగా జత చేయనున్నారు. తిరుగు ప్రయాణంలో 18464 KSR బెంగళూరు–భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్ ప్రెస్‌కు కూడా అదనపు కోచ్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
12819 భువనేశ్వర్–ఆనంద్ విహార్ టెర్మినల్ ఒడిశా సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్‌కు అక్టోబర్ 3 నుంచి 31 వరకు ఒక థర్డ్ ఏసీ కోచ్‌ను పెంచనున్నారు. తిరుగు ప్రయాణంలో 12820 ఆనంద్ విహార్ టెర్మినల్–భువనేశ్వర్ రైలుకూ అదనపు కోచ్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. అలాగే, 22879 భువనేశ్వర్–తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, 22880 తిరుపతి–భువనేశ్వర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లకు కూడా థర్డ్ ఏసీ కోచ్‌ను తాత్కాలికంగా యాడ్ చేయనున్నారు.
భువనేశ్వర్–జగదల్‌పూర్ మార్గంలో ప్రయాణించే వారికి కూడా అదనపు సౌకర్యం కల్పించారు. 18447 భువనేశ్వర్–జగదల్‌పూర్ హిరాఖండ్ ఎక్స్ ప్రెస్, 18448 జగదల్ పూర్–భువనేశ్వర్ హిరాఖండ్ ఎక్స్ ప్రెస్ లకు ఒక్కో థర్డ్ ఏసీ కోచ్‌ను అదనంగా యాడ్ చేయనున్నారు. పండుగ సమయంలో ఈ మార్గంలో ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే తెలిపింది.
సంబల్‌పూర్–రాయగడ–సంబల్‌పూర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు కూడా అదనపు కోచ్ అందుబాటులోకి రానుంది. 18301/18302 ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ లో రెండు దిశల్లోనూ ఒక ఏసీ చైర్ కార్ కోచ్‌ను తాత్కాలికంగా పెంచనున్నారు. అదేవిధంగా 18417 పూరీ–గుణుపూర్, 18418 గుణుపూర్–పూరీ ఎక్స్ ప్రెస్‌లకు కూడా ఏసీ చైర్ కార్ కోచ్‌ను అదనంగా జత చేయనున్నారు.
అన్ని రైళ్లలోనూ కేవలం ఏసీ కోచ్‌లనే పెంచడం లేదు. 20832 సంబల్‌పూర్–షాలిమార్ మహిమా గోసాయిన్ ఎక్స్ ప్రెస్, 20831 షాలిమార్–సంబల్ పూర్ ఎక్స్ ప్రెస్ లకు అదనంగా స్లీపర్ క్లాస్ కోచ్‌లను అందించనున్నారు. అలాగే 12893 భువనేశ్వర్–పూర్ణకాటక్ ఇంటర్ సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, 12894 పూర్ణకాటక్–భువనేశ్వర్ ఎక్స్ ప్రెస్‌లకు రెండు జనరల్ (UR) కోచ్‌లను అదనంగా జత చేయనున్నారు. శ్రీ గంగానగర్–పూరీ మార్గంలోని 20471/20472 సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లకు కూడా నిర్ణీత తేదీల్లో థర్డ్ ఏసీ కోచ్‌ను పెంచనున్నారు.
Read Also: రైలు టికెట్ ఉంటే సరిపోదు.. అక్టోబర్ 1 నుంచి ఈ రూల్స్ పాటించాల్సిందే!