Metro Like Seating In Hyderabad Buses: ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీని పెంచేందుకు తెలంగాణ ఆర్టీసీ ఎప్పటికప్పడు కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నది. తక్కువ ధరలకే అన్ని బస్సుల్లో ప్రయాణించేలా పాసులు అందుబాటులోకి తేగా, తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ పరిధిలో నడిచే ఎంపిక చేసిన నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులలో సీటింగ్ విషయంలో పలు మార్పులు చేయబోతోంది. హైదరాబాద్ మెట్రో రైల్లో ఉన్నట్లుగా కొత్త సీటింగ్ డిజైన్ ను తీసుకురాబోతోంది. ఈ తరహా సీట్లతో బస్సులో స్థలాన్ని ఆప్టిమైజ్ చేయడంతో పాటు ప్రయాణీకుల రద్దీకి అనుకూలంగా రూపొందించబోతోంది.
‘మహాలక్ష్మి’తో పెరిగిన మహిళా ప్రయాణీకుల సంఖ్య
తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం తీసుకొచ్చిన ‘మహాలక్ష్మి’ ఉచిత ప్రయాణ పథకం సూపర్ డూపర్ సక్సెస్ అయ్యింది. ఈ నిర్ణయంతో మహిళలు పెద్ద సంఖ్యల్లో బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఈ పథకం అమల్లోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు 100 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్యను పెంచేందుకు తెలంగాణ సర్కారు కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నది.అందులో భాగంగానే కొత్త సీట్లను ఏర్పాటు చేయబోతున్నది.
ఇప్పటికే గ్రిల్స్ స్థానంలో సీట్ల ఏర్పాటు
బస్సుల్లో కొత్త సీట్లకు సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా.. TGRTC గతంలో కొన్ని బస్సుల్లో మగ, ఆడ ప్రయాణీకులను వేరు చేసే గ్రిల్స్ ను తొలగించడం ప్రారంభించింది. బస్సులో ప్రయాణీకుల సామర్థ్యాన్ని పెంచే ఉద్దేశంతో ఈ గ్రిల్స్ స్థానంలో అదనపు సీట్లను ఏర్పాటు చేశారు. పల్లె వెలుగు, డీలక్స్ ఎక్స్ ప్రెస్ బస్సుల్లో గ్రిల్స్ తొలగించి, వాటి స్థానంలో కొత్త సీట్లను ఏర్పాటు అమర్చారు. గ్రిల్స్ కారణంగా ప్రయాణీకుల సంఖ్య తగ్గకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, హైదరాబాద్ రీజియన్ అంతటా బస్సుల్లో మెట్రో తరహా సీటింగ్‌ను పెడుతున్నారు. ‘మహాలక్ష్మి’ పథకం ప్రారంభించినప్పటి నుంచి రోజూ 18 నుంచి 20 లక్షల మంది మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు.
హైదరాబాద్ బస్సుల్లో మెట్రో తరహాలో సీటింగ్
హైదరాబాద్ సిటీ బస్సులు సాధారణంగా రద్దీగానే ఉంటాయి. అధిక రద్దీ సమయంలో ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, తాజాగా తీసుకొచ్చే కొత్త తరహా సీటింగ్ లో కొన్ని సీట్లను తొలగిస్తారు. మిగతా వాటిని బస్సు నలువైపులా అమర్చుతారు. ఈ విధానం కారణంగా బస్సు మధ్యలో ఖాళీ ప్రదేశం ఉంటుంది. ప్రయాణీకులు నిలబడేందుకు ఎక్కువగా స్థలం ఉంటుంది. కొత్త సీటింగ్ కాన్ఫిగరేషన్ ప్రస్తుతం రద్దీగా ఉండే రూట్లలో టెస్ట్ చేస్తున్నారు. ఈ బస్సులకు ప్రయాణీకుల నుంచి పాజిటివ్ స్పందన లభిస్తే.. ఈ సీటింగ్ వ్యవస్థను నెమ్మదిగా అన్ని బస్సుల్లో విస్తరించనున్నారు. బస్సులలో తీసుకొస్తున్న కొత్త సీటింగ్ విధానం కారణంగా హైదరాబాద్ లో పెరుగుతున్న అధిక డిమాండ్ కు అనుకూలంగా ఉండనుంది. అంతేకాదు, ప్రయాణికులందరికీ మరింత సౌకర్యవంతమైన, సమర్థవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయని TGRTC అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: ప్రయాణీకులకు అదిరిపోయే ఆఫర్, ఈ పాస్ ఉంటే అన్ని బస్సులో జర్నీ చెయ్యొచ్చు తెలుసా?