Hydrogen Train: పొగ లేకుండా, శబ్దం లేకుండా, గాలి కాలుష్యం లేకుండా గంటల తరబడి దూసుకుపోయే రైలు ఊహించండి.. అది కల కాదు, భారత్‌లో వాస్తవం కానుంది. అత్యాధునిక హైడ్రోజన్ టెక్నాలజీతో నడిచే ఈ రైలు కేవలం రవాణా సాధనం కాదు, భవిష్యత్ పచ్చ రైల్వే విప్లవానికి నాంది.
ఇండియా పచ్చదనం వైపు మరో పెద్ద అడుగు వేయబోతోంది. దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలు త్వరలో రోడ్లెక్కనుంది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియా వేదిక ‘X’ ఎక్స్ వేదికగా ఈ రైలు ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. ఇది ఇండియన్ రైల్వే చరిత్రలో పచ్చ రవాణా దిశగా ఒక కీలక మలుపుగా భావిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే, భారతదేశం జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, చైనా వంటి హైడ్రోజన్ రైలు టెక్నాలజీని అమలు చేసిన కొన్ని దేశాల ప్రత్యేక జాబితాలో చేరనుంది. మొదటి కమర్షియల్ సర్వీస్ హరియాణాలోని జింద్ – సోనిపత్ మార్గంలో నడపడానికి సిద్ధమవుతోంది. ఈ మార్గంలో హైడ్రోజన్ రైలు ప్రయాణం, పచ్చటి రవాణా సాధనాల పట్ల భారత ఉత్సాహాన్ని, భవిష్యత్ సిద్ధతను ప్రతిబింబించే మైలురాయిగా నిలుస్తుంది.
ఇండియన్ రైల్వే సమాచారం ప్రకారం, ఈ కొత్త హైడ్రోజన్ ఫ్యూయల్ రైలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, పొడవైన రైళ్లలో ఒకటిగా రూపుదిద్దుకుంటోంది. సుమారు 2,600 మంది ప్రయాణికులను ఒకేసారి తీసుకువెళ్లే సామర్థ్యం దీని ప్రత్యేకత. ఇటీవల చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో మొదటి హైడ్రోజన్ ఫ్యూయల్ రైలు కోచ్ విజయవంతంగా ట్రయల్ రన్ పూర్తి చేసింది.
గత జూలైలో కూడా మంత్రి వైష్ణవ్ ఈ ట్రయల్స్ వీడియోను సోషల్ మీడియాలో పంచుతూ, ఫ్యూచర్ రెడీ, సస్టైనబుల్ ఇండియా కోసం భారత కృతనిశ్చయాన్ని హైలైట్ చేశారు. ఆయన అప్పుడే, 1,200 హార్స్ పవర్ సామర్థ్యం గల హైడ్రోజన్ రైలును భారత్ తయారు చేస్తోంది. దీని ద్వారా హైడ్రోజన్ ట్రైన్ టెక్నాలజీలో భారత్ నాయకత్వం వహించే దేశాలలో ఒకటిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి 35 హైడ్రోజన్ రైళ్ల కోసం ‘హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్’ ప్రాజెక్ట్ కింద ప్రణాళికలను వెల్లడించారు. ప్రతి రైలుకు సుమారు రూ. 80 కోట్లు ఖర్చు అవుతుందని, దీనికి తోడు హెరిటేజ్, కొండ మార్గాల కోసం అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు అదనంగా రూ. 70 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
ఇందులో భాగంగా, డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (DEMU) రేక్‌ను హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్‌తో రిఫిట్ చేసే పైలట్ ప్రాజెక్ట్ అమలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు అనుగుణంగా హైడ్రోజన్ ఉత్పత్తి, నిల్వ, సరఫరా కోసం ఒక హైబ్రిడ్ ప్లాంట్‌ను కూడా నిర్మిస్తున్నారు. అంతేకాకుండా, ట్రాక్ మెయింటెనెన్స్ కోసం ఒక్కోటి రూ. 10 కోట్లు విలువైన 5 హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఆధారిత టవర్ కార్లను అభివృద్ధి చేస్తున్నారు.
Also Read: Realme P4 5G: గేమింగ్ ప్రేమికుల కలల ఫోన్ వచ్చేస్తోంది.. దీని ఫీచర్స్ ఒక్కొక్కటి అదుర్స్..!
హరియాణా మార్గంలో నడిచే ఈ రైలుకు జింద్‌లోని 1 మెగావాట్ సామర్థ్యం గల పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రేన్ (PEM) ఎలక్ట్రోలైజర్ ద్వారా హైడ్రోజన్ సరఫరా చేయబడుతుంది. ఈ ఎలక్ట్రోలైజర్‌ను గ్రీన్H ఎలక్ట్రోలిసిస్ అనే సంస్థ ఏర్పాటు చేస్తోంది. ఇది నిరంతరం నడుస్తూ రోజుకు సుమారు 430 కిలోల హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తుంది. రైలుకు అవసరమైన ఇంధనం వేగంగా అందించేందుకు జింద్‌లోనే 3,000 కిలోల నిల్వ సామర్థ్యం గల హైడ్రోజన్ స్టోరేజ్ ఫెసిలిటీ, హైడ్రోజన్ కంప్రెసర్, రెండు హైడ్రోజన్ డిస్పెన్సర్లు, ఇంటిగ్రేటెడ్ ప్రీ-కూలర్‌తో రిఫ్యూయెలింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
హైడ్రోజన్ రైళ్లు పర్యావరణహితమైన రవాణా సాధనాలు కావడం వల్ల, డీజిల్ లేదా బొగ్గు ఆధారిత ఇంధనాలపై ఆధారపడకుండానే ట్రైన్ సర్వీసులను నడపడం సాధ్యమవుతుంది. ఇవి గాలి కాలుష్యం, కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తాయి. ఈ టెక్నాలజీ అమలులోకి రావడం వల్ల, ముఖ్యంగా పర్వతప్రాంతాలు, పర్యాటక మార్గాలు, హెరిటేజ్ రూట్లలో శబ్దం, పొగ, కాలుష్యం లేకుండా రైళ్లు నడపడం సాధ్యమవుతుంది. భారతదేశం ఈ విభాగంలో ముందడుగు వేయడం పర్యావరణ పరిరక్షణ, సాంకేతిక ఆవిష్కరణ, గ్రీన్ ఎనర్జీ వినియోగం వైపు కీలక మైలురాయిగా భావించబడుతోంది.
మొత్తం మీద, భారత్‌లో హైడ్రోజన్ రైలు ప్రాజెక్ట్ విజయవంతమైతే, అది కేవలం పర్యావరణహిత రవాణాకు మాత్రమే కాకుండా, రైల్వే రంగంలో ఒక విప్లవాత్మక మార్పుకు నాంది అవుతుంది. ఈ సాంకేతికతతో భవిష్యత్‌లో మరిన్ని రైళ్లను దేశంలోని వివిధ ప్రాంతాల్లో నడిపే అవకాశం ఉంది. జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు ఇప్పటికే ఈ సాంకేతికతను విజయవంతంగా అమలు చేశాయి. ఇప్పుడు ఆ జాబితాలో భారత్ కూడా చోటు దక్కించుకోవడం, సుస్థిరమైన రవాణా వ్యవస్థల వైపు పయనంలో ఒక గొప్ప విజయంగా నిలుస్తుంది.
Bharat's First Hydrogen Train! 🇮🇳
Coming soon… pic.twitter.com/Mtq72zd1Dd— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 12, 2025