Indian Railways: భారతీయ రైల్వే దేశ వ్యాప్తంగా రైల్వే కనెక్టివిటీని పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా కాశ్మీర్ ప్రజలు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న మాతా వైష్ణోదేవి కత్రా రైల్వే మార్గం పూర్తయ్యింది. శ్రీనగర్ తో దేశంలోని అన్ని ప్రాతాలను కనెక్ట్ చేసే ఈ రైల్వే లైన్ వేసవి సెలవులలో ప్రారంభం అవుతుందని అందరూ భావించారు. నిజానికి గత నెలలోనే ప్రారంభం కావాల్సి ఉన్నా, వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రధాని మోడీ జమ్మూకాశ్మీర్ పర్యటన రద్దైంది. ఫలితంగా ఈ రైల్వే లైన్ ప్రారంభం కాలేదు. పహల్గామ్ ఉగ్రదాడి, భారత ఆర్మీ ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ పరిస్థితులలో కత్రా-శ్రీనగర్ రైల్వే లైన్ ప్రారంభం ఎప్పుడు అనేది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది.
23 ఏండ్ల తర్వాత రైల్వే లైన్ పూర్తి
వాస్తవానికి కత్రా-శ్రీనగర్ రైల్వే లైన్ కు పునాది పడి 23 ఏండ్లు గడిచింది. తాజాగా ఈ మార్గం పూర్తయ్యింది. కాశ్మీర్ ను దేశంలో అన్ని ప్రధాన నగరాలకు ఈ రైల్వే లైన్ కనెక్టివిటీని అందించనుంది. ఈ రైల్వే మార్గం పూర్తయితే, టూరిస్టుల సంఖ్య పెరిగే.. కాశ్మీర్ పర్యాటకంగా, ఆర్థికంగా బలోపేతం అయ్యే అవకాశం ఉందని అందరూ భావించారు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా చీనాబ్ నది మీద నిర్మించిన ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెన భారతీయ ఇంజనీరింగ్ అద్భుతానికి నిదర్శనంగా నిలిచింది. గడ్డకట్టే ఉష్ణోగ్రతలలో కూడా అత్యంత సౌకర్యవంతంగా నడిచేలా రూపొందించిన ప్రత్యేక వందే భారత్ రైలు ఇప్పటికే ఈ మార్గంలో విజయవంతమైన ట్రయల్ రన్‌లను నిర్వహించింది. పెరిగిన డిమాండ్ కు అనుగుణంగా పలు రైళ్లను పొడిగించాలని ఇండియన్ రైల్వే భావించింది.
Read Also: మీ ఆప్తులు జమ్ము కశ్మీర్ లో చిక్కుకున్నారా? ఇవిగో స్పెషల్ ట్రైన్స్!
May 9,2025 13:51 pm
ఇప్పట్లో ప్రారంభం సాధ్యం అయ్యేనా?
ఏప్రిల్ 19న కత్రా- శ్రీనగర్ రైల్వే లైన్ ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించాల్సి ఉన్నా, అనుకోని కారణాలతో వాయిదా పడింది. ఆ తర్వాత ప్రారంభం ఎప్పుడు అనే విషయంపై అధికారులు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం కాశ్మీర్ లో ఉన్న టెన్షన్ వాతావరణం నేపథ్యంలో ఆ విషయం గురించి ఎవరూ ఆలోచించడం లేదు. అదే సమయంలో ఈ రైల్వే లైన్ లో కీలకమైన చీనాబ్, అంజిఖాడ్ వంతెనలపై భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ బ్రిడ్జిల మీద శత్రువులు దాడులు చేసే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరిలతో భారీగా బలగాలను మోహరించారు. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ (USBRL) 2002లో జాతీయ ప్రాజెక్టుగా మొదలయ్యింది.272 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న USBRL.. ఉధంపూర్ నుంచి బారాముల్లా వరకు విస్తరించి ఉంటుంది. ఈ ఏడాది ప్రారంభంలో ఈ రైల్వే లైన్ నిర్మాణం పూర్తి అయ్యింది. ఈ మార్గంలో సరికొత్త వందేభారత్ రైలును అందుబాటులోకి తీసుకురావాలని రైల్వేశాఖ భావించింది. ఈ రైల్వే మార్గం కాశ్మీర్ లోయను దేశంలోని ఇతర ప్రాంతాలతో కనెక్ట్ చేయనుంది.
Read Also: ‘ఆపరేషన్ సిందూర్’ ఎఫెక్ట్, రద్దైన విమానాలకు రీఫండ్ ఇస్తారా?