Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం భారత గగనతలం మీద ఆంక్షలు విధించింది. ఈ నిర్ణయంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో విమాన కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. భద్రతా చర్యల్లో భాగంగా ఉత్తర, పశ్చిమ, మధ్య భారతంలోని 27 విమానాశ్రయాల షట్ డౌన్ కు ఆదేశాలు జారీ చేసింది. మే 10 వరకు ఆయా విమానాశ్రయాల్లో విమాన సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 27 విమానాశ్రయాలకు ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ సహా పలు విమానయాన సంస్థలు తమ విమాన సర్వీసులను నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో రద్దు అయిన విమానాలకు సంబంధించి కీలక ప్రకటన చేశాయి. ఒకవేళ ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటే, ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా రీ షెడ్యూల్ చేసుకోవచ్చని ప్రకటించాయి. మిగతా వారికి పూర్తి స్థాయిలో రీఫండ్ అందిస్తామని ప్రకటించాయి.
ఇంతకీ ఏ విమానయాన సంస్థ ఏం చెప్పిందంటే?
⦿ ఎయిర్ ఇండియా
ఎయిర్ ఇండియా గ్రూప్ నకు చెందిన విమానాల్లో ప్రయాణించేందుకు టికెట్లు బుక్ చేసుకున్న వారికి పూర్తి స్థాయిలో రీఫండ్ అందిస్తామని ప్రకటించింది. ఒకవేళ రీషెడ్యూల్ చేసుకోవాలి అనుకుంటే, ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ప్రయాణ తేదీని మార్చుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. అయితే, రీ షెడ్యూల్ అవకాశాన్ని ఒకేసారి పొందాల్సి ఉంటుందని వెల్లడించింది. ప్రయాణాన్ని రద్దు చేసుకున్న ప్రయాణీకులు, ఎయిర్ ఇండియా వెబ్ సైట్ లేదంటే యాప్ ను ఓపెన్ చేయాలి. మేనేజ్ బుకింగ్ విభాగంలోకి వెళ్లి రీఫండ్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఒకవేళ ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటే వెబ్ సైట్ లోని సెల్ఫ్-సర్వీస్ రీ-అకామడేషన్ ఎంపికను ఉపయోగించి మీ ప్రయాణాన్ని రీషెడ్యూల్ చేసుకునే అవకాశం ఉంటుంది.
⦿ ఇండిగో
శ్రీనగర్ కు బయలుదేరే అన్ని విమానాలకు సంబంధించి ప్రయాణాన్ని రీ షెడ్యూల్ చేసుకునే వారికి ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని వెల్లడించింది. ఈ మినహాయింపులు మే 22, 2025 వరకు షెడ్యూల్ చేయబడిన ప్రయాణాలకు, ఏప్రిల్ 22, 2025 నాటికి చేసిన రిజర్వేషన్‌లకు వర్తిస్తుందని తెలిపింది. టికెట్ క్యాన్సిల్ చేసుకున్న వాళ్లు రీఫండ్ కోసం ఇండిగో అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ఇమెయిల్ ID, PNR/బుకింగ్ రిఫరెన్స్ నంబర్ ను ఎంటర్ చేసి రీఫండ్ ను క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
⦿ IXigo
విమానాశ్రయ మూసివేతలతో ఎఫెక్ట్ అయిన విమానాలన్నింటికీ ixigo వినియోగదారులకు పూర్తి వాపసును అందించనున్నట్లు సంస్థ వెల్లడించింది. కన్వీనియెన్స్ రుసుములను తిరిగి చెల్లించనున్నట్లు ఆన్ లైన్ ట్రావెల్ ఏజెన్సీ ప్రకటించింది.
⦿ స్పైస్ జెట్
మే 10 ఉదయం 5:29 గంటల వరకు లేహ్, శ్రీనగర్, జమ్మూ, ధర్మశాల, కాండ్లా, అమృత్ సర్ కు వెళ్లే విమానాలను రద్దు చేస్తున్నట్లు స్పైస్ జెట్ ప్రకటించింది. ఎఫెక్ట్ అయిన ప్రయాణీకులు తమ రీఫండ్ ను క్లెయిమ్ చేసుకోవడానికి ఎయిర్ లైన్ రీఫండ్ విధానాన్ని వెల్లడించింది. విమానం రద్దు అయిన, 60 నిమిషాల కంటే ఎక్కువ సమయం రీషెడ్యూల్ చేయబడినా, 120 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ సమయం ఆలస్యం అయినా, అదనపు ఛార్జీ లేకుండా పూర్తి వాపసును పొందే అవకాశం ఉంటుంది. అని స్పైస్ జెట్ వెల్లడించింది.
Read Also: భారత్ ప్రతిదాడులు, పాక్ మీదుగా ప్రయాణించే విమానాలు యూ టర్న్!