Indian Railways: భారతీయ రైల్వే ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ఎప్పటికప్పుడు కీలక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే ఆటో అప్ గ్రేడ్ ఫీచర్ ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ప్రకారం తాను బుక్ చేసుకున్న క్లాస్ కు పై క్లాస్ లో బెర్త్ లు ఖాళీగా ఉంటే ఆటోమేటిక్ గా మీకు పై క్లాస్ లో ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది. తాజాగా IRCTC (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) నుంచి ఊహించని మెసేజ్ రావడంతో ఓ ప్రయాణీకుడు సంతోషంలో ముగినిపోయాడు. ఆయన సెకెండ్ ఏసీ టికెట్ బుక్ చేసుకుంటే, ఆటో అప్ గ్రేడ్ ఫీచర్ ప్రకారం ఫస్ట్ ఏసీలో బెర్త్ కన్ఫర్మ్ అయ్యిందని మెసేజ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయన రెడ్డిట్ వేదికగా నెటిజన్లతో పంచుకున్నాడు. ఈ మేరకు తనకు వచ్చిన మెసేజ్ స్క్రీన్ షాట్ ను ఆయన షేర్ చేశాడు.
IRCTC మెసేజ్ లో ఏం ఉందంటే?
సదరు ప్రయాణీకుడు షేర్ చేసిన IRCTC స్క్రీన్ షాట్ లో “PNR XXX, అభినందనలు! మీ టికెట్ అప్ గ్రేడ్ చేయబడింది. ఇందుకోసం ఎలాంటి అదనపు చెల్లింపులు అసవరం లేదు. ఉన్నత తరగతిలో ప్రయాణాన్ని ఆస్వాదించండి. IR-CRIS” అని ఆ మెసేజ్ లో ఉంది. ఆటో అప్ గ్రేడేషన్ పథకం కేవలం జోక్ అని చాలా మంది భావిస్తున్నారని, అలాంటి వారు ఈ మెసేజ్ చూసి అయినా నిజం తెలుసుకోవాలన్నాడు. “నా జీవితంలో తొలిసారిగా, నేను 2AC నుంచి ఫస్ట్ క్లాస్ కి అప్ గ్రేడ్ అయ్యాను. ఆ ఆటో అప్‌గ్రేడ్ నిజంగా పనిచేసే వరకు ‘ఆటో అప్ గ్రేడ్’ అనేది జోక్ అని నేను కూడా కొన్నిసార్లు అనుకున్నాను. కానీ, ఇప్పుడు అది నిజం అని తేలింది” అని సదరు ప్రయాణీకుడు రాసుకొచ్చాడు.
నిజానికి ‘ఆటో అప్ గ్రేడ్’ అనేది కింది క్లాస్ లో టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణీకులను పై స్థాయి క్లాస్ కు ప్రమోట్ చేస్తుంది. అంటే సెకెండ్ ఏసీ టికెట్ బుక్ చేసుకుంటే ఫస్ట్ ఏసీలో ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఏసీలో అన్ని బెర్త్ లు ఫిల్ కాకపోతే, మీరు టికెట్ బుకింగ్ సమయంలో ‘ఆటో అప్ గ్రేడ్’ ఆప్షన్ ను ఎంచుకుంటే మాత్రమే ఈ అవకాశం పొందవచ్చు. ఆటో అప్ గ్రేడ్ పథకం ప్రకారం పై క్లాస్ కు ప్రమోట్ అయ్యే వాళ్లు ఎలాంటి అదనపు చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు. అటో అప్ గ్రేడ్ రైలులో సీట్ల లభ్యతపై ఆధారపడి ఉంటుంది.
నెటిజన్లు ఏం అంటున్నారంటే?
ఈ పోస్టుపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. తాము కూడా ఈ పథకం ద్వారా లబ్దిపొందినట్లు చెప్తున్నారు. తొలిసారి ఆటో అప్ గ్రేడ్ పథకం ద్వారా సెకెండ్ ఏసీ టికెట్ తో ఫస్ట్ ఏసీలో ప్రయాణం చేసే అవకాశం లభించడం నిజంగా సంతోషకరం అంటున్నారు. ఈ పథకం గురించి తెలిసి మరికొందరు ఆశ్చర్యపోయారు. “ఇది ఎక్కువగా రైలు ప్రయాణాలు చేసే వారికి తెలుస్తుంది” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. నిజానికి ఇదో లాటరీ లాంటిదని మరో వ్యక్తి రాసుకొచ్చాడు.
Read Also: దేశంలోనే బిజీయెస్ట్ రైల్వే స్టేషన్, రోజూ ఎన్ని వందల రైళ్లు నడుస్తాయంటే?