Indian Railways: వేసవి సెలవుల నేపథ్యంలో భారతీయ రైల్వే పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్ కు వెళ్తున్నారు. రైల్వే స్టేషన్లలో రద్దీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా భారతీయ రైల్వే స్పెషల్ ట్రైన్స్ ను అందుబాటులో ఉంచింది. ఈ ప్రత్యేక రైళ్లు ఇప్పుడు ప్రయాణీకులకు చుక్కలు చూపిస్తున్నాయి. లక్నో, గోరఖ్ పూర్, సహర్సా, ఢిల్లీ మధ్య నడుస్తున్న అనేక రైళ్లు 9 నుంచి 35 గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. వేలాది మంది ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మండుతున్న ఎండలు, విపరీమైన ఉక్కపోత, స్టేషన్లలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణీకులు టార్చర్ అనుభవిస్తున్నారు.
రైళ్ల కోసం ప్రయాణీకుల పడిగాపులు
ఆనంద్ విహార్ నుంచి సహర్సాకు వెళ్లే 05578 నెంబర్ గల గరీబ్ రథ్ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు లక్నోకు చేరుకోవాల్సి ఉంది. కానీ, ఈ రైలు శనివారం రాత్రి 2:00 గంటలకు చేరుకుంది. అంటే దాదాపు 35 గంటలు ఆలస్యం అయ్యింది. ఈ నేపథ్యంలో వేలాది మంది ప్రయాణీకులు చార్ బాగ్ రైల్వే స్టేషన్ లో రాత్రంతా నేలపైనే పడుకోవాల్సి వచ్చింది. “మేము ముందస్తుగానే టికెట్లు బుక్ చేసుకున్నాం. మా పిల్లలతో కలిసి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కానీ, రైలు 35 గంటలు ఆలస్యం అయ్యింది. సరైన నీళ్లు ఆహారం దొరకడం లేదు. మా ఇబ్బందిని పట్టించుకునే వారే లేరు” అని బీహార్ కు వెళ్తున్న రాకేష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు.
గంటల తరబడి ఆలస్యంగా..
ఇంతకీ ఏ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయంటే..
⦿ 04011 ముజఫర్ పూర్- ఆనంద్ విహార్ సమ్మర్ స్పెషల్ రైలు- 10 గంటలు ఆలస్యం
⦿ 03312 చండీగఢ్- ధన్ బాద్ స్పెషల్- 9 గంటలు ఆలస్యం
⦿ 04029 ముజఫర్ పూర్- ఆనంద్ విహార్ స్పెషల్- 9 గంటలు ఆలస్యం
⦿ అవధ్ అస్సాం ఎక్స్‌ప్రెస్, గరీబ్ రథ్, ఝాన్సీ ప్యాసింజర్- 2 నుంచి 4 గంటలు ఆలస్యం
ఎలాంటి సమాచారం ఇవ్వని రైల్వే అధికారులు
ఆలస్యంగా నడుస్తున్న రైళ్లలో ఎక్కువ భాగం సుదూర ప్రయాణాలు చేస్తున్నాయి. కానీ, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సమ్మర్ స్పెషల్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే స్టేషన్లతో పాటు వెబ్ సైట్లలోనూ ఈ ఆలస్యం గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదని మండిపడుతున్నారు. గంటల తరబడి ప్లాట్ ఫారమ్ ల మీద వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందంటున్నారు. ” సమ్మర్ స్పెషల్ రైళ్లు ఏ సమయానికి వస్తాయో మాకు కూడా కచ్చితంగా తెలియదు. మాకూ పైనుంచి ఆర్డర్లు వస్తాయి. ఆలస్యానికి చాలా కారణాలు ఉన్నాయి. ట్రాక్ మరమ్మతులు, ఇంటర్ లాకింగ్ లేకపోవడం, సిబ్బంది లేకపోవడం లాంటి కారణాలతో రైళ్లు ఆలస్యం అవుతాయి” అని చార్ బాగ్ స్టేషన్ అధికారులు వెల్లడించారు.
ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని డిమాండ్
రైళ్లు ఆలస్యం అయిన సమయంలో తగిన ఏర్పాట్లు చేయాలని రైల్వే అధికారులను ప్రయాణీకులు డిమాండ్ చేస్తున్నారు. “రైలు కార్యకలాపాల్లో పారదర్శకత ఉండాలి. ఆలస్యమైతే, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. ప్లాట్ ఫామ్ పై సరైన సమాచార వ్యవస్థ ఉండాలి. రైళ్ల సమయపాలనకు ప్రాధాన్యత ఇవ్వాలి” అని కోరుతున్నారు.
Read Also: దోపిడీ దొంగల అరాచకం.. రన్నింగ్ ట్రైన్ నుంచి యువతిని తోసేయడంతో..