Bihar Train Robbery: రైళ్లలో భద్రత పెంచుతున్నామని రైల్వేశాఖ చెప్తున్నప్పటికీ దొంగలు బీభత్సం సృష్టిస్తూనే ఉన్నారు. తరచుగా దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతున్నారు. బీహార్ లాంటి రాష్ట్రాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. తాజాగా రైల్లోకి ఎక్కిన దొంగలు ఓ యువతి నుంచి సెల్ ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించారు. సదరు యువతి ప్రతిఘటించే ప్రయత్నం చేసింది. దీంతో రెచ్చిపోయిన దొంగలు సదరు యువతిని కదలుతున్న రైల్లో నుంచి బయటకు తోసేశారు. ఈ ఘటనలతో ఆమె తీవ్ర గాయాలపాలై చావుబతుకుల మధ్య హాస్పిటల్ లో కొట్టుమిట్టాడుతోంది. ఈ దారుణ ఘటన బీహార్ లో భోజ్‌పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
ఈ ఘటనలో గాయపడిన యుతి పేరు కుమారి. ఆదివారం (మే 4) నాడు ఉదయం పిరో నుంచి ఆరాకు రైలులో ప్రయాణం చేస్తోంది. ఆరా స్టేషన్‌లోని మూడవ నంబర్ ప్లాట్ ఫారమ్ దగ్గరికి రాగానే రైలు వేగం తగ్గింది. అదే సమయంలో కొంతమంది దుండగులు ఆమె దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ ను లాక్కునేందుకు ప్రయత్నించారు. ఆమె ప్రతిఘటించడంతో రైల్లో నుంచి కిందికి తోసేశారు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. గాయపడిన యువతిని వెంటనే రైల్వే సిబ్బంది హాస్పిటల్ కు తరలించారు. సదరు యువతి సికర్హట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతేపూర్ గ్రామానికి చెందినట్లుగా గుర్తించారు. ప్రస్తుతం ఆమె సదర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే స్టేషన్ లో రికార్డు అయిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు. త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామన్నారు.
Read Also: 4.5 గంటల్లో రైల్వే బ్రిడ్జి నిర్మాణం, ఇండియన్ రైల్వే సరికొత్త రికార్డు!
రీసెంట్ భాగల్పూర్ జిల్లాలోనూ ఇలాంటి ఘటనే!
ఇటీవలే భాగల్పూర్ లోనూ దొంగలు ఇలాగే చేశారు. కామాఖ్య ఎక్స్ ప్రెస్ రైలులో 21 ఏళ్ల విద్యార్థిని గుర్తు తెలియని దొంగలు బయటకు తోసేశారు. ఆ అమ్మాయి దగ్గర ఉన్న సెల్ ఫోన్ ను కొట్టేయడానికి ప్రయత్నించడంతో ఆమె దొంగలను ప్రతిఘటించింది. కోపంతో ఊగిపోయిన దొంగలు ఆమెను కదులుతున్న రైల్లో నుంచి బయటకు తోసేశారు. ఈ ఘటనలు కాజల్ అనే విద్యార్థిని తీవ్ర గాయాలపాలై స్పాట్ లోనే చనిపోయింది. కాజల్ ఖగారియా జిల్లాకు చెందిన యువతిగా గుర్తించారు. ఆమె బ్యాంకింగ్ కు సంబంధించిన పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. కాజల్ తన కుటుంబం సభ్యులతో కలిసి కామాఖ్య నుంచి భాగల్పూర్ కు రైల్లో ప్రయాణిస్తోంది. కాసేపట్లో భాగల్పూర్ స్టేషన్ లో రైలు దిగుతామనే సమయంలోనే దొంగలు రెచ్చిపోయారు. సెల్ ఫోన్ దొంగతనానికి ప్రయత్నించి ఆమె ప్రాణాలు తీశారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Read Also: ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ కు ఆ పేరు ఎలా వచ్చింది? దీని ప్రత్యేత ఏంటో తెలుసా?