Pranab Mukherjee Daughter | భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూతురు, కాంగ్రెస్ నాయకురాలు షర్మిష్ఠ ముఖర్జీ సొంత పార్టీ నాయకత్వంపైనే విమర్శలు చేశారు. తన తండ్రి ఒక మాజీ రాష్ట్రపతి మరణించిన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆయన నివాళులర్పించేందుకు కనీసం ఒక సిడబ్లూసీ (కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ) సమావేశం నిర్వహించకపోవాడాన్ని షర్మిష్ఠ ముఖర్జీ తప్పు బట్టారు.
గురువారం డిసెంబర్ 26న మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఆమె సంతాపం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఆయన మరణం తరువాత సంతాపం కోసం ఒక సిడబ్లూసీ మీటింగ్ పెట్టింది. ఆ తరువాత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారకార్థం కోసం ఢిల్లీలో స్థలం కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కానీ ఇదంతా తన తండ్రి మరణం తరువాత ఎందుకు చేయలేదని షర్మిష్ఠ ముఖర్జీ ప్రశ్నించారు. తన తండ్రి స్మారకార్థం కూడా నిర్మించాలని కాంగ్రెస్ ని అడిగితే.. ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తనకు అబద్ధం చెప్పి తప్పించుకున్నారని ఆమె తెలిపారు.
దీనికి సంబంధించి ట్విట్టర్ ఎక్స్ లో ఆమె ఒక పోస్ట్ చేశారు. “బాబా (ప్రణబ్ ముఖర్జీ) చనిపోయినప్పుడు. కాంగ్రెస్ పార్టీ ఒక సిడబ్లూసి సంతాప మీటింగ్ కూడా పెట్టలేదు. ఇలాంటి సంతాప సభలు రాష్ట్రపతుల కోసం పెట్టరు అని ఒక సీనియర్ నాయకుడు నాకు అబద్ధం చెప్పారు. అదంతా అబద్దమని నాకు బాబా డైరీ చూసిన తరువాత తెలిసింది. రాష్ట్రపతి కెఆర్ నారాయణన్ మరణించినప్పుడు సిడబ్లూసి మీటింగ్ పెట్టి సంతాప సందేశాలను బాబానే రాశారని ఆ డైరీలో ఉంది. మన్మహన్ సింగ్ గారికి స్మారకార్థం నిర్మించడం ఒక మంచి ఆలోచన. ఆయన అందుకు అర్హుడు. భారత రత్న కూడా ఇవ్వాలని రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ప్రణబ్ ముఖర్జీ ప్రతిపాదించారు కూడా. కానీ అది జరగలేదు. దానికి కారణాలున్నాయి కానీ అవి ఇప్పుడు అప్రస్తుతం.” అని షర్మిష్ఠ ముఖర్జీ అన్నారు.
Also Read: హైదరాబాద్ ఓఆర్ఆర్ మన్మోహన్ సింగ్ పుణ్యమే..
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే.. మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అంత్యక్రియల ప్రదేశంలోనే ఆయన కోసం ఒక స్మారకార్థం నిర్మించేందుకు స్థలం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశాభివృద్ధికి ఎంతో కృషి చేసిన ఒక ప్రధాన మంత్రి చనిపోతే ఆయనకు స్మారకార్థం నిర్మించడానికి కొంత స్థలం కూడా లేకపోవడం చాలా అవమానకరమని శుక్రవారం కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు.
మన్మోహన్ సింగ్ కోసం ఒక మెమోరియల్ నిర్మించేందుకు కాంగ్రెస్ పార్టీ.. కేంద్ర హోం శాఖను కోరింది. ఆయన అంత్యక్రియలు ఢిల్లీలోని నిగంబోధ్ లో ప్రభుత్వ లాంఛనాలతో శనివారం డిసెంబర్ 28న జరిగాయి.
ఈ అంశంపై కేంద్ర హోం శాఖ స్పందించింది. మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మెమోరియల్ కోసం స్థలం కేటాయిస్తున్నట్లు ఆయన కుటుంబానికి, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి తెలియాజేశామని హోంశాఖ తెలిపింది. శుక్రవారం కేబినెట్ మీటింగ్ ముగిసిన వెంటనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా మల్లికార్జున ఖర్గే, మన్మోహన్ సింగ్ కుటుంబంతో సంప్రదించి మాజీ ప్రధాని మెమోరియల్ కోసం ఢిల్లీలోనే స్థలం కేటాయిస్తున్నట్లు చెప్పినట్లు సమాచారం.