Amrit Bharat 3.0 Key Features: భారతీయ రైల్వే ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. తక్కువ ధరలో ఎక్కువ సౌకర్యాలతో ప్రయాణం అందిస్తున్న అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ లో ఇప్పుడు కీలక అప్ డేట్స్ రాబోతున్నాయి. త్వరలో అందుబాటులోకి రానున్న అమృత్ భారత్ 3.0 రైళ్లలో తొలిసారిగా ఏసీ కోచ్‌లను ప్రవేశపెట్టేందుకు రైల్వే సిద్ధమవుతోంది. దీంతో సామాన్య ప్రయాణికులకు కూడా మరింత సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ ను మొదటగా 2023లో ప్రారంభించారు. ప్రస్తుతం ఈ రైళ్లు జనరల్, స్లీపర్ క్లాస్ కోచ్‌లతో నాన్ ఏసీ రైళ్లుగా నడుస్తున్నాయి. తక్కువ ఛార్జీ, ఆధునిక సౌకర్యాలు, వేగవంతమైన ప్రయాణం కారణంగా వీటికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 60కి పైగా అమృత్ భారత్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని మార్గాల్లో సుమారు 1,000 కిలోమీటర్ల ప్రయాణానికి స్లీపర్ క్లాస్ టికెట్ ధర దాదాపు రూ.500గా ఉండటంతో సామాన్యులు వెళ్లేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ రైళ్లలో ఆక్యుపెన్సీ కూడా చాలా ఎక్కువగా ఉంది.
కొత్త వెర్షన్‌లో AC ఫస్ట్ క్లాస్, AC 2-టైర్, AC 3-టైర్ కోచ్‌లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకోసం మొత్తం 14 కొత్త రేక్‌లను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొత్త ఏసీ కోచ్‌లలో వందే భారత్ స్లీపర్, రాజధాని ఎక్స్ ప్రెస్ వంటి ప్రీమియం రైళ్లలో కనిపించే అత్యాధునిక సౌకర్యాలు ఉండనున్నాయి. దీంతో తక్కువ ధరలో మెరుగైన సౌకర్యాలతో ప్రయాణించాలనుకునే వారికి అమృత్ భారత్ 3.0 బెస్ట్ ఆప్షన్ కానుంది.
అమృత్ భారత్ రైళ్లలో రెండు చివర్లలో లోకోమోటివ్‌లు ఉంటాయి. పుష్ పుల్ టెక్నాలజీ కారణంగా రైలు వేగంగా వేగం అందుకోవడంతో పాటు ప్రయాణ సమయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ రైళ్లు గంటకు గరిష్ఠంగా 130 కిలోమీటర్ల వేగంతో నడిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
అమృత్ భారత్ రైళ్లలో ఇప్పటికే అనేక ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. మడిచే స్నాక్ టేబుల్స్, మెరుగైన సీట్లు, సౌకర్యవంతమైన బెర్త్‌లు ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. మొబైల్ హోల్డర్లు, USB A, USB C ఛార్జింగ్ పాయింట్లు కూడా ఉన్నాయి. ప్రయాణ సమాచారం కోసం పబ్లిక్ అడ్రస్, ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఏర్పాటు చేశారు.
ఈ రైళ్లలో ఇండియన్, వెస్ట్రన్ స్టైల్ టాయిలెట్లు ఉన్నాయి. ఆటోమేటిక్ సోప్ డిస్పెన్సర్లు, స్మెల్ కంట్రోల్ వ్యవస్థలు కూడా ఉన్నాయి. అలాగే ఎయిర్ స్ప్రింగ్ సస్పెన్షన్ కారణంగా ప్రయాణం మరింత సౌకర్యంగా ఉంటుంది. క్రాష్ రెసిస్టెంట్ ఫీచర్లు, సెమీ ఆటోమేటిక్ కప్లర్లు లాంటి సాంకేతికత భద్రతను పెంచేందుకు ఉపయోగపడుతుంది. తక్కువ ఖర్చు, మంచి వేగం, ఆధునిక సౌకర్యాలతో అమృత్ భారత్ 3.0ని తయారు చేస్తే, సామాన్యుడికి ఏసీ రైలు ప్రయాణం మరింత దగ్గర కానుంది.
Read Also: దక్షిణం నుంచి తూర్పు భారతం వరకు.. 7 రాష్ట్రాలను కలిపే కొత్త అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్!