Indian Double-Stack Container Trains: భారతీయ రైల్వే సరుకు రవాణా రంగంలో మరో కీలక మైలురాయిని అందుకుంది. దేశంలో తొలిసారిగా డబుల్ స్టాక్ కంటైనర్లతో కూడిన కంటైనర్ రైలును విజయవంతంగా నడిపింది. ఒకే ప్రయాణంలో పెద్ద మొత్తంలో సరుకును తరలించి భారతీయ రైల్వే సామర్థ్యాన్ని చాటిచెప్పింది. ముంబైలోని జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ టెర్మినల్ నుంచి వడోదర డివిజన్ లోని వర్ణమాలో ఉన్న కాన్కార్ జీసీటీ టెర్మినల్ వరకు ఈ ప్రత్యేక రైలు ప్రయాణించింది. మొత్తం సుమారు 422 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు జర్నీ కొనసాగింది.
1.3 కిలో మీటర్ల పొడవున్న ఈ ప్రత్యేక రైలులో రెండు డబుల్-స్టాక్ కంటైనర్ రేక్ లు ఉన్నాయి. రెండు రేక్ లలో కలిపి మొత్తం 360 TEUల కంటైనర్లను తరలించారు. ఇంత భారీ స్థాయిలో కంటైనర్లను ఒకే సుదూర ప్రయాణంలో రవాణా చేయడం భారతీయ రైల్వేలో ఇదే తొలిసారి కావడం విశేషం. ప్రధాన రేక్‌లో 1,817 టన్నుల సరుకు ఉండగా, ట్రైలింగ్ రేక్‌లో 2,105 టన్నుల బరువు ఉంది. ఈ రెండు రేక్‌లను వేర్వేరు లోకోమోటివ్‌లతో నడిపారు. భారీ సరుకును వేగంగా, సమర్థవంతంగా గమ్యస్థానానికి చేర్చడమే ఈ ప్రయోగం ప్రధాన లక్ష్యం అని రైల్వే అధికారులు తెలిపారు.
సాధారణ కంటైనర్ రైళ్లలో కంటైనర్లను ఒకే స్థాయిలో మాత్రమే లోడ్ చేస్తారు. కానీ డబుల్ స్టాక్ రైళ్లలో ఒక కంటైనర్‌పై మరో కంటైనర్‌ను అమర్చి రెండు అంతస్తులుగా సరుకును రవాణా చేస్తారు. దీంతో ఒకే రైలులో ఎక్కువ కంటైనర్లను తీసుకెళ్లడం సాధ్యమవుతుంది. ఇక సుదూర ప్రయాణంలో రెండు రేక్‌లను కలిపి నడపడం వల్ల భారీ మొత్తంలో సరుకును ఒకేసారి తరలించవచ్చు. దీనివల్ల రైళ్ల సంఖ్య తగ్గడమే కాకుండా రైల్వే మార్గాల సామర్థ్యాన్ని కూడా మెరుగ్గా ఉపయోగించుకోవచ్చు.
పోర్టులు, కంటైనర్ టెర్మినల్స్ లో కంటైనర్లు ఎక్కువ సమయం నిలిచిపోవడం ప్రధాన సమస్యగా ఉంటుంది. డబుల్ స్టాక్ రైళ్ల ద్వారా ఒకేసారి ఎక్కువ కంటైనర్లను తరలించడంతో ఈ రద్దీని తగ్గించవచ్చు. కంటైనర్లను వేగంగా గమ్యస్థానాలకు పంపే అవకాశం కూడా పెరుగుతుంది. అదే సమయంలో ఎక్కువ లోకోమోటివ్ లు, వ్యాగన్లు అవసరం ఉండదు. తక్కువ రోలింగ్ స్టాక్ తోనే ఎక్కువ సరుకును రవాణా చేయవచ్చు.
ఒకే రైలులో భారీ మొత్తంలో సరుకును తరలించడం వల్ల మొత్తం రవాణా ఖర్చు తగ్గే అవకాశం ఉంది. రైళ్ల సంఖ్య తగ్గడంతో మార్గాలపై ఒత్తిడి కూడా తగ్గుతుంది. సరుకు వేగంగా గమ్యస్థానానికి చేరడంతో వ్యాపార సంస్థలకు కూడా ప్రయోజనం కలుగుతుంది. డబుల్ స్టాక్ కంటైనర్ రైళ్ల వల్ల రోడ్లపై తిరిగే వందలాది ట్రక్కుల అవసరం తగ్గుతుంది. ఈ రైళ్లు ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌లతో నడుస్తుండటంతో డీజిల్ వినియోగం తగ్గే అవకాశం ఉంది. దీంతో వాహనాల నుంచి వెలువడే కాలుష్యం, కార్బన్ ఉద్గారాలు తగ్గడంతో పాటు రోడ్లపై ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గనుంది.
📢 First Long Haul (1.3 km) Double Stack container train on Western Dedicated Freight Corridor
JNPT, Mumbai -> Vadodara, Gujarat pic.twitter.com/CY9kWabvrM
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 22, 2026
Read Also: పశ్చిమ కనుమల్లో వందేభారత్ కనువిందు.. పచ్చని అడవిలో ఎర్రని మెరుపుతీగలా..