Metro Global Recognition: దేశ రాజధాని ఢిల్లీలోని మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) అరుదైన ఘనత సాధించింది. ISO 55001:2024 సర్టిఫికేషన్ పొందిన దేశంలోని తొలి మెట్రో సంస్థగా నిలిచింది. మెట్రో ఆస్తుల మెయింటెనెన్స్ కు సంబంధించిన ఈ అంతర్జాతీయ ప్రమాణాన్ని ముంబై మెట్రో లైన్-3 కార్యకలాపాలు, నిర్వహణలో DMRC అందిస్తున్న సేవలకు గుర్తింపుగా అందించారు. ఈ సర్టిఫికేషన్‌తో మెట్రో నిర్వహణలో మరో అడుగు ముందుకు పడినట్టైంది. కేవలం సమస్య వచ్చినప్పుడు మరమ్మతులు చేయడం కాకుండా.. ఒక వ్యవస్థ మొత్తం జీవితకాలంలో ఎలా పనిచేస్తుంది? దాని పనితీరు ఎలా మెరుగుపరచాలి? ఖర్చులు, నష్టాలను ఎలా నియంత్రించాలి? అనే అంశాలపై DMRC మరింత దృష్టి పెట్టనుంది.
ముంబై మెట్రో లైన్-3 సుమారు 33.5 కిలోమీటర్ల పొడవుతో కొలాబా, బాంద్రా ప్రాంతాలను కలుపుతుంది. ఈ మార్గం ఆపరేషన్స్, మెయింటెనెన్స్ నిర్వహణలో DMRC కీలక బాధ్యతలు నిర్వహిస్తోంది. రైళ్లు, ట్రాక్షన్ వ్యవస్థ, సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్స్, స్టేషన్లు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ట్రాక్‌లు, సివిల్ మౌలిక సదుపాయాలు లాంటి అనేక విభాగాలు ఇందులో ఉన్నాయి. ఇంత పెద్ద వ్యవస్థను సమర్థంగా నిర్వహించేందుకు ఎన్నో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది.
సాధారణంగా ఏదైనా పరికరం, మౌలిక సదుపాయంలో సమస్య వచ్చినప్పుడు దాన్ని సరిచేయడం కామన్. అయితే ISO 55001 విధానం అంతకంటే ముందుకు వెళ్తుంది. ఆ వ్యవస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ప్రస్తుతం దాని పరిస్థితి ఎలా ఉంది? భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రావచ్చు? దాని మెయింటెనెన్స్ కు ఎంత ఖర్చవుతుంది? ఎంతకాలం సమర్థంగా ఉపయోగించుకోవచ్చు? వంటి అంశాలను ముందుగానే అంచనా వేయాలి. దీంతో మెయింటెనెన్స్ మరింత ప్రణాళికాబద్ధంగా సాగుతుంది. ఖర్చులు తగ్గడంతో పాటు సర్వీసులలో అంతరాయాలు తగ్గించే అవకాశం ఉంటుంది.
దేశంలో మెట్రో రైలు నెట్‌వర్క్ వేగంగా విస్తరిస్తోంది. కొత్త మార్గాలు, స్టేషన్లు, రైళ్లు, సిగ్నలింగ్ వ్యవస్థలు, ఇతర మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ఇలాంటి సమయంలో కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను ఎక్కువకాలం సమర్థంగా ఉపయోగించుకోవడం చాలా ముఖ్యం. ISO 55001 వంటి ప్రమాణాలు ఆస్తుల పనితీరు, భద్రత, మెయింటెనెన్స్ ఖర్చులను మెరుగ్గా పర్యవేక్షించేందుకు ఉపయోగపడతాయి.
ఇదే సమయంలో ఢిల్లీ మెట్రో, ఢిల్లీ-మీరట్ నమో భారత్ రాపిడ్ రైలు సేవల టైమ్ మెమింటెనెన్స్ పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఈ రెండు రవాణా వ్యవస్థలు 99.9 శాతం సమయపాలనతో పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి పనితీరుకు మెరుగైన మౌలిక సదుపాయాల మెయింటెనెన్స్ కూడా కీలక కారణంగా చెప్పవచ్చు.
ISO 55001 అనేది రైల్వే అసెట్స్ మెయింటెనెన్స్ వ్యవస్థకు సంబంధించిన అంతర్జాతీయ ప్రమాణం. ఆస్తులను ఏర్పాటు చేయడం నుంచి నిర్వహణ, పనితీరు, రిస్క్ కంట్రోల్ తో పాటు వాటి మొత్తం లైఫ్ సర్కిల్ ను పరిగణనలోకి తీసుకోవడం దీని ప్రధాన ఉద్దేశం. దేశంలో మెట్రో రైలు వ్యవస్థ మరింత విస్తరిస్తున్న నేపథ్యంలో DMRC పొందిన ఈ సర్టిఫికేషన్ ఇతర మెట్రో సంస్థలకు కూడా ఒక బెంచ్ మార్క్ గా నిలిచే అవకాశం ఉంది.
Read Also: అమృత్ భారత్ రైళ్లలో సూపర్ స్పెసిలిటీస్.. వెర్షన్ 3.0 చూస్తే మతిపోవాల్సిందే!