Indian Railways RAC News: రైలులో RAC టికెట్ తో ఏసీ కోచ్ లో ప్రయాణించే వారికి భారతీయ రైల్వే అదిరిపోయే న్యూస్ చెప్పింది. ఏసీ చైర్ కార్ ను మినహాయించి, మిగతా అన్ని ఏసీ కోచ్ లలో ప్రయాణించే ఆర్‌ఏసీ ప్రయాణికులకు కూడా పూర్తి బెడ్‌రోల్ కిట్ తప్పనిసరిగా ఇవ్వాలని రైల్వేశాఖ అన్ని రైల్వే జోన్లకు మరోసారి ఆదేశాలు జారీ చేసింది.
ఇటీవల చాలా మంది ప్రయాణికులు తమకు బెడ్ షీట్లు, దుప్పట్లు, దిండు కవర్లు లాంటి లినెన్ సామగ్రి ఇవ్వడం లేదని, పూర్తి కిట్ అందించడం లేదని ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదులు పదేపదే రావడంతో రైల్వేశాఖ ఈ అంశంపై మరోసారి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 4న అన్ని రైల్వే జోన్‌లకు పంపిన లేఖలో, ఇప్పటికే అమల్లో ఉన్న నిబంధనలను కచ్చితంగా పాటించాలని మంత్రిత్వ శాఖ సూచించింది. ఏసీ కోచ్‌లో RAC టికెట్‌తో ప్రయాణించే ప్రతి ప్రయాణికుడు కూడా పూర్తి బెడ్‌రోల్ కిట్ పొందే హక్కు కలిగి ఉంటాడని వెల్లడించింది.
RAC టికెట్ ప్రకారం మొదట ఇద్దరు ప్రయాణికులు ఒకే లోయర్ బెర్త్ ను పంచుకుని ప్రయాణిస్తారు. తర్వాత ప్రయాణం ప్రారంభమైన తర్వాత, మధ్యలో కన్ఫర్మ్ అయిన బెర్త్ ఖాళీ అయితే, వారిలో ఒకరికి పూర్తి బెర్త్ కేటాయిస్తారు. అయితే, బెర్త్ షేర్ చేసుకోవాల్సి వచ్చినా, బెడ్ రోల్ విషయంలో ఎలాంటి తగ్గింపు ఉండకూడదని రైల్వే స్పష్టం చేసింది. అంటే ఒకే బెర్త్ ను ఇద్దరు పంచుకున్నా, ఇద్దరికీ విడివిడిగా పూర్తి బెడ్‌రోల్ కిట్ ఇవ్వాలి. ఇందులో సాధారణంగా రెండు బెడ్ షీట్‌లు, ఒక దిండు, దిండు కవర్, ఒక దుప్పటి ఉంటుంది. ఈ సౌకర్యాలు ఏసీ చైర్ కార్ ప్రయాణికులకు మాత్రం వర్తించవు.
రైల్వే బోర్డు ఇప్పటికే ఈ మార్గదర్శకాలను జారీ చేసినప్పటికీ, కొన్ని రైళ్లలో ఆర్‌ఏసీ ప్రయాణికులకు బెడ్‌రోల్ ఇవ్వకపోవడం, అసంపూర్ణంగా ఇవ్వడం జరుగుతోందని రైల్వేశాఖ దృష్టికి వచ్చింది. దీంతో అన్ని జోన్లు ఈ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని మరోసారి గుర్తు చేసింది. ప్రయాణికులు ప్రయాణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడటం రైల్వే లక్ష్యమని అధికారులు తెలిపారు. బెడ్‌రోల్ అందించాల్సిన బాధ్యతను సంబంధిత సిబ్బంది నిర్లక్ష్యం చేయకూడదని కూడా సూచించారు. ఏసీ కోచ్‌లో RAC టికెట్‌తో ప్రయాణిస్తున్నప్పటికీ, పూర్తి బెడ్‌రోల్ కిట్ ఇవ్వకపోతే ప్రయాణికులు వెంటనే టికెట్ చెకింగ్ సిబ్బందిని, రైల్వే అధికారులను సంప్రదించవచ్చు. అవసరమైతే అధికారిక ఫిర్యాదు కూడా చేసే అవకాశం ఉంటుంది.
సో, RAC టికెట్ ఉంటే, బెడ్‌రోల్ ఇవ్వాల్సిన అవసరం లేదనే అపోహకు ఇప్పుడు పూర్తిగా తెరపడింది. ఏసీ చైర్ కార్‌ను మినహాయించి, అన్ని ఏసీ కోచ్‌లలో ఆర్‌ఏసీ ప్రయాణికులకు కూడా కన్ఫర్మ్ టికెట్ ఉన్న ప్రయాణికులతో సమానంగా పూర్తి బెడ్‌రోల్ కిట్ అందించడం రైల్వే నిబంధన అని రైల్వేశాఖ మరోసారి స్పష్టం చేసింది.
Read Also: నిద్రలో దిగాల్సిన స్టేషన్ దాటిపోతే.. ఫ్రీగా మరో రైల్లో వెనక్కి వెళ్లొచ్చా?