Indian Railways Winter Fog Update: చలికాలంలో నార్త్ ఇండియాతో పాటు సౌత్ లోనూ పొగమంచు తీవ్రం అవుతుంది. అయితే, ఈసారి దాని ప్రభావం రైలు ప్రయాణాలపైనా కనిపించనుంది. పొగమంచు కారణంగా రైళ్ల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండటంతో భారతీయ రైల్వే 2026 డిసెంబర్ నుంచి 2027 ఫిబ్రవరి వరకు పలు రైళ్ల సర్వీసుల్లో మార్పులు చేసింది. నార్త్ మధ్య రైల్వే పరిధిలో మొత్తం 13 రైళ్లకు సంబంధించిన సర్వీసులలో ఈ మార్పులు ఉంటాయి. ఇందులో కొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను వారంలో కొన్ని రోజులు మాత్రమే నడపనున్నారు. మరో రెండు రైళ్లకు మార్గంలోని కొంత భాగంలో సర్వీసు నిలిపివేయనున్నారు.
చలికాలం పొగమంచు నేపథ్యంలో నాలుగు రైళ్లను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు రైల్వే ప్రకటించింది. 14112 ప్రయాగ్రాజ్–ముజఫర్‌పూర్, 14111 ముజఫర్‌పూర్–ప్రయాగ్రాజ్ రైళ్ల సర్వీసులు డిసెంబర్ 2, 2026 నుంచి ఫిబ్రవరి 24, 2027 వరకు అందుబాటులో ఉండవు. అలాగే 22198 వీరాంగన లక్ష్మీబాయి ఝాన్సీ–కోల్‌కతా రైలు డిసెంబర్ 4 నుంచి ఫిబ్రవరి 26 వరకు, 22197 కోల్‌కతా–వీరాంగన లక్ష్మీబాయి ఝాన్సీ రైలు డిసెంబర్ 6 నుంచి ఫిబ్రవరి 28 వరకు రద్దు కానున్నాయి.
మరికొన్ని రైళ్లకు పూర్తి రద్దు కాకుండా సర్వీసుల సంఖ్యను తగ్గించారు. అంటే, ఆయా రైళ్లు ప్రతిరోజూ కాకుండా నిర్దిష్ట రోజుల్లో మాత్రమే నడుస్తాయి. 11123 గ్వాలియర్–బరౌని రైలు సోమ, గురువారాల్లో, 11124 బరౌని–గ్వాలియర్ రైలు మంగళ, శుక్రవారాల్లో రద్దవుతాయి. అదేవిధంగా 11109/11110 వీరాంగన లక్ష్మీబాయి ఝాన్సీ–లక్నో రైళ్లను శని, ఆదివారాల్లో నడపరు. 12033/12034 కాన్పూర్–న్యూఢిల్లీ రైళ్లకు మంగళ, గురు, శనివారాల్లో సర్వీసు ఉండదు. 12179/12180 లక్నో–ఆగ్రా ఫోర్ట్, 11905/11906 ఆగ్రా కంటోన్మెంట్–హోషియార్‌పూర్ రైళ్ల సర్వీసుల్లోనూ వారంలోని కొన్ని రోజులు మార్పులు ఉంటాయి.
పూర్తిగా రద్దు కాకుండా రెండు రైళ్లను వాటి మార్గంలోని కొంత భాగంలో మాత్రమే నడపనున్నారు. 12177 హౌరా–మధుర రైలు ఆగ్రా కంటోన్మెంట్–మధుర మధ్య డిసెంబర్ 4 నుంచి ఫిబ్రవరి 26 వరకు టెంపరరీగా రద్దవుతుంది. తిరుగు ప్రయాణంలో 12178 మధుర–హౌరా రైలు మధుర–ఆగ్రా కంటోన్మెంట్ మధ్య డిసెంబర్ 7 నుంచి ఫిబ్రవరి 22 వరకు పాక్షికంగా రద్దవుతుంది.
ఈ మార్పులు ప్రధానంగా పొగమంచు సమయంలో రైళ్లను సురక్షితంగా, సజావుగా నడిపించేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా ప్రకటించబడ్డాయి. ముఖ్యంగా డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈ రైళ్లలో ప్రయాణించాలనుకునేవారు టికెట్ బుక్ చేసుకునే ముందు రైలు నంబర్, ప్రయాణ తేదీ, ఆ రోజు సర్వీసు ఉందో లేదో తప్పనిసరిగా చెక్ చేసుకోవడం మంచిది. పొగమంచు సీజన్‌లో రైళ్ల ఆలస్యాలు, రూట్ ఛేంజ్ లు, సర్వీసుల రద్దు అవకాశం ఉండటంతో ప్రయాణికులు చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా ముందుగానే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడం అవసరం.
Read Also: గంటల ప్రయాణం ఇప్పుడు నిమిషాల్లోకి.. భారత్‌లో మారిపోతున్న ట్రావెల్ లెక్కలు!