India’s Travel Revolution: దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగం పెరుగుతోంది. కొత్త వంతెనలు, సొరంగాలు, ఎక్స్ ప్రెస్‌వే లు, రైల్వే ప్రాజెక్టులు అందుబాటులోకి రావడంతో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకునే సమయం గణనీయంగా తగ్గుతోంది. గతంలో గంటల తరబడి పట్టిన ప్రయాణాలు ఇప్పుడు తక్కువ సమయంలోనే పూర్తవుతున్నాయి. ఈ మార్పును వివరిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన తాజా ఫ్యాక్ట్ షీట్‌లో పలు ఆసక్తికరమైన వివరాలు వెల్లడయ్యాయి.
నదులు, లోయలు వంటి సహజ అడ్డంకుల కారణంగా గతంలో సుదీర్ఘ మార్గాల్లో ప్రయాణించాల్సి వచ్చేది. కొత్త వంతెనలు ఈ పరిస్థితిని మార్చాయి. అస్సాంలోని భూపేన్ హజారికా సేతు (ధోలా-సాదియా వంతెన) రూపాయ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్‌లోని మేకా/రోయింగ్ ప్రాంతానికి ప్రయాణ సమయాన్ని ఆరు గంటల నుంచి దాదాపు గంటకు తగ్గించింది. అలాగే బోగీబీల్ వంతెన ధేమాజీ-దిబ్రూగఢ్ మధ్య ప్రయాణాన్ని దాదాపు రోజు నుంచి కేవలం ఒకటి నుంచి రెండు గంటలకు తీసుకొచ్చింది. ముంబైలోని అటల్ సేతు కూడా ఇలాంటి మార్పునే చూపించింది. ముంబై-నవీ ముంబై ప్రయాణ సమయం సుమారు రెండు గంటల నుంచి 20 నిమిషాలకు తగ్గింది.
కొండలు, కనుమలు ఉన్న ప్రాంతాల్లో ప్రయాణానికి సొరంగాలు కీలకంగా మారుతున్నాయి. అటల్ టన్నెల్ 9.02 కిలోమీటర్ల పొడవుతో రోహ్‌తాంగ్ ప్రాంతాన్ని దాటుతుంది. దీనివల్ల మనాలి-సర్చు మార్గంలో సుమారు 46 కిలోమీటర్ల దూరం తగ్గడంతో పాటు నాలుగు నుంచి ఐదు గంటల సమయం ఆదా అవుతోంది. జమ్మూ-శ్రీనగర్ మార్గంలోని డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ టన్నెల్ ప్రయాణ దూరాన్ని సుమారు 30 కిలోమీటర్లు తగ్గిస్తోంది. దాదాపు రెండు గంటల సమయం కూడా ఆదా అవుతోంది. అదేవిధంగా బనిహాల్-ఖాజీగుండ్ ట్విన్ టన్నెల్ సుమారు గంటన్నర సమయాన్ని తగ్గిస్తుండగా, అరుణాచల్ ప్రదేశ్‌లోని సేలా టన్నెల్ తేజ్‌పూర్-తవాంగ్ ప్రయాణాన్ని వేగవంతం చేసింది.
యాక్సెస్-కంట్రోల్డ్ ఎక్స్ ప్రెస్ వేలు కూడా ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తున్నాయి. ఢిల్లీ-మీరట్ ఎక్స్ ప్రెస్‌వేతో ప్రయాణ సమయం సుమారు రెండున్నర గంటల నుంచి 50 నిమిషాలకు చేరింది. బెంగళూరు-మైసూరు ప్రయాణం దాదాపు మూడు గంటల నుంచి 75 నిమిషాలకు తగ్గింది. ఢిల్లీ-డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్ ప్రయాణ సమయాన్ని ఆరు గంటలకు పైగా ఉన్న స్థాయి నుంచి సుమారు రెండున్నర గంటలకు తగ్గించేలా రూపొందించారు. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే పూర్తిగా అందుబాటులోకి వస్తే ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం సుమారు 33 గంటల నుంచి 12 గంటలకు తగ్గనుంది.
కొత్త రైల్వే లైన్లతో పాటు ఇప్పటికే ఉన్న మార్గాల్లో రైళ్ల వేగాన్ని పెంచే చర్యలు కూడా కొనసాగుతున్నాయి. 2026 రైల్వే టైమ్‌టేబుల్ ప్రకారం దేశవ్యాప్తంగా 549 రైళ్ల ప్రయాణ సమయాన్ని తగ్గించారు. ఇందులో 20 రైళ్లు గంటకుపైగా, 48 రైళ్లు 31-59 నిమిషాలు, మరో 105 రైళ్లు 16-30 నిమిషాల వరకు టైమ్ సేవ్ చేస్తున్నాయి. వందే భారత్ సేవలు కూడా వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నాయి. న్యూఢిల్లీ-వారణాసి సర్వీస్ పాత సర్వీసులతో పోలిస్తే వేగంగా నడుస్తోంది. కత్రా-శ్రీనగర్, బనారస్-ఖజురాహో, ఎర్నాకులం-బెంగళూరు మార్గాల్లోనూ ప్రయాణ సమయం తగ్గింది.
భారతదేశ రవాణా మౌలిక సదుపాయాల్లో తదుపరి పెద్ద అడుగు హైస్పీడ్ రైలు. ముంబై-అహ్మదాబాద్ మధ్య 508 కిలోమీటర్ల కారిడార్ గంటకు 320 కిలోమీటర్ల వేగంతో రైళ్లను నడిపేలా రూపొందిస్తున్నారు. ఈ మార్గంలో ప్రయాణ సమయం సుమారు రెండు గంటలకు తగ్గే అవకాశం ఉంది.
Read Also: గంటకు 320 కిమీ వేగం.. అయినా స్మూత్‌గా ట్రాక్ ఛేంజ్.. బుల్లెట్ రైలు సీక్రెట్ ఇదే!