BIG TV LIVE Originals: భారత్ లో ముంబై- అహ్మదాబాద్ మధ్య 2028 నాటికి బుల్లెట్ రైలును అందుబాటులోకి తీసుకు వచ్చేలా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. రెండు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని 8 గంటల నుంచి ఏకంగా 3 గంటలకు తగ్గించాలని టార్గెట్ గా పెట్టుకుంది. ముంబై- అహ్మదాబాద్ మాత్రమే కాదు, దేశ వ్యాప్తంగా పలు నగరాలను అనుసంధానించేలా బుల్లెట్ రైలు రూట్లను ప్లాన్ చేస్తోంది. ఈ రైళ్లు గంటకు 320 కి.మీ వేగంతో నడిచేలా డిజైన్ చేస్తున్నారు. ప్రయాణాన్ని త్వరగా, సులభంగా మార్చేలా చర్చలు తీసుకుంటున్నారు. దేశంలో ప్లాన్ చేస్తున్న భవిష్యత్ బుల్లెట్ రైలు మార్గాలు ఏవి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
దేశంలో ప్రతిపాదిత బుల్లెట్ రైలు మార్గాలు
భారత ప్రభుత్వం, నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(NHSRCL) సంయుక్తంగా బుల్లెట్ రైళ్ల కోసం ఏడు కొత్త మార్గాలను ప్రతిపాదించింది. ఈ మార్గాలు ఇంకా ప్రణాళిక దశలోనే ఉన్నాయి. అన్ని అధ్యయనాల తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రతిపాదిత బుల్లెట్ మార్గాల ఏవంటే..
⦿ ఢిల్లీ నుంచి వారణాసి: రెండు నగరాల మధ్య 800 కి.మీ దూరం ఉంటుంది. ఢిల్లీ, నోయిడా, ఆగ్రా, కాన్పూర్, లక్నో, వారణాసి వరకు ఈ మార్గం ఉంటుంది. ప్రస్తుతం ప్రయాణ సమయం 8 గంటలు ఉండగా 3.5 గంటలకు తగ్గనుంది. ఈ మార్గం రాజధాని నగరంతో పాటు ప్రధాన ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశమైన వారణాసికి కలుపుతుంది. ఇది పర్యాటకులు, యాత్రికులకు అనుగుణంగా ఉంటుంది.
⦿ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్: రెండు నగరాల నడుమ 880 కి.మీ ఉంటుంది. ఢిల్లీ, జైపూర్, అజ్మీర్, ఉదయపూర్, అహ్మదాబాద్ నగరాలను కలుపుతుంది. ప్రయాణ సమయం ప్రస్తుతం 14 గంటలు ఉండగా 4 గంటలకు తగ్గనుంది. ఈ మార్గం రాజస్థాన్‌లోని జైపూర్, ఉదయపూర్ లాంటి అందమైన నగరాల ద్వారా ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు లింక్ చేస్తుంది. ఇది పర్యాటక, వ్యాపార రంగాలకు ఊతం ఇవ్వనుంది.
⦿ ఢిల్లీ నుంచి అమృత్ సర్: ఈ రెండు నగరాల మధ్య 460 కి.మీ ఉంటుంది. ఢిల్లీ, చండీగఢ్, లూధియానా, జలంధర్, అమృత్ సర్ నగరాలను కలుపుతుంది. ప్రయాణ సమయంలో 2 నుంచి 3 గంటలు పడుతుంది. ఈ మార్గం ఢిల్లీని స్వర్ణ దేవాలయం ఉన్న అమృత్ సర్ ను కలుపుతుంది. ఇది జమ్మూ వరకు కూడా విస్తరించవచ్చు.
⦿ ముంబై నుంచి నాగ్ పూర్: ఈ నగరాల మధ్య దూరం దాదాపు 760 కి.మీ ఉంటుంది. ముంబై, నాసిక్, నాగ్ పూర్ నగరాలను కలుపుతుంది. ప్రయాణ సమయం 3.5 గంటలకు తగ్గుతుంది. ఈ మార్గం దేశ ఆర్థిక రాజధాని ముంబైని మహారాష్ట్రలోని అభివృద్ధి చెందుతున్న నగరమైన నాగ్ పూర్ ను కలుపుతుంది.
⦿ ముంబై నుంచి హైదరాబాద్: ఈ రెండు నగరాల మధ్య 700 కి.మీ దూరం ఉంటుంది. ముంబై, పూణే, హైదరాబాద్ నగరాలను కలుపుతుంది. ప్రయాణ సమయం దాదాపు 3 గంటలు ఉంటుంది. ఈ మార్గం ముంబైని పూణే ద్వారా ప్రధాన టెక్ నగరమైన హైదరాబాద్‌కు కలుపుతుంది. ఇది వ్యాపార, ఉద్యోగ అవకాశాలను పెంచుతుంది.
⦿ చెన్నై నుంచి మైసూరు: రెండు నగరాల మధ్య దాదాపు 435 కి.మీ దూరం ఉంటుంది. చెన్నై, బెంగళూరు, మైసూరు నగరాలను కలుపుతుంది. ప్రయాణ సమయం 2.5 గంటలకు కుదించబడుతుంది.
⦿ వారణాసి నుంచి హౌరా: దాదాపు 760 కిలో మీటర్ల దూరం ఉంటుంది. వారణాసి, పాట్నా, హౌరా నగరాలను కలుపుతుంది. ప్రయాణ సమయం దాదాపు 3.5 గంటలు ఉంటుంది. ఈ మార్గం ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ ను కలుపుతుంది, కోల్ కతా ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది.
వీటితో పాటు ఢిల్లీ-కోల్ కతా(1,474 కి.మీ), ముంబై- చెన్నై(1,317 కి.మీ) పాట్నా-గౌహతి (850 కి.మీ), అమృత్ సర్- జమ్మూ(190 కి.మీ), తిరువనంతపురం-కాసర్ గోడ్ (532 కి.మీ) అహ్మదాబాద్- రాజ్ కోట్ (225 కి.మీ) మార్గాలపైనా అధ్యయనం జరుపుతోంది. బుల్లెట్ రైళ్లు దేశంలో అత్యంత వేగవంతమైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనున్నారు. వ్యాపార, పర్యాటక రంగాలకు ఊతం ఇవ్వనున్నాయి. కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించనున్నారు.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.
Read Also: ఆ గ్రామంలో కాలనీలన్నీ గుండ్రంగా ఉంటాయి.. మీరూ అక్కడ స్టే చేయొచ్చు!