Indian Railways: భారతీయ రైల్వే సంస్థ దేశ ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించడమే కాదు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరులను తలకెత్తుకుంటున్నది. తాజాగా ఓ అమర వీరుడి పేరును లోకోమోటివ్ కు పెట్టి ఘన నివాళి అర్పించింది. భారతీయ సేనల పట్ల తమకున్న గౌరవాన్ని చాటుకుంది. పాకిస్తాన్ తో జరిగిన కార్గిల్ యుద్ధంలో టైగర్ హిల్ లో తన ప్రాణాలను అర్పించిన కెప్టెన్ జెర్రీ ప్రేమ్ రాజ్ కు అరుదైన అంజలి ఘటించింది. అతడి గౌరవార్థం అరక్కోణంలోని ఎలక్ట్రిక్ లోకో షెడ్‌లో కొత్తగా ప్రారంభించిన WAG-9HC లోకోమోటివ్(38848)కి ఆయన పేరు పెట్టింది. ఈ విషయాన్నిభారతీయ రైల్వే సంస్థ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు లోకోమోటివ్ ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. రైల్వే నిర్ణయంపై నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైలుకు దేశం కోసం ప్రాణాలు వదిలిన అమరుడి పేరు పెట్టడం నిజంగా గొప్ప విషయం అని కొనియాడుతున్నారు.
Legacy etched in Steel and Pride!
Indian Railways pays homage to the valiant Captain Jerry Prem Raj, Vir Chakra, who laid down his life at Tiger Hill during the Kargil War, by naming in his honour the newly commissioned WAG-9HC locomotive (38848) of Electric Loco Shed,… pic.twitter.com/cHaZifduh6
— Ministry of Railways (@RailMinIndia) December 29, 2024
Read Also:అంజి ఖాడ్ కేబుల్ బ్రిడ్జిపై రైల్వే లోడ్ టెస్ట్, వీడియో చూస్తే వావ్ అనాల్సిందే!
ఇంతకీ ఎవరీ కెప్టెన్ జెర్రీ ప్రేమ్ రాజ్?
కెప్టెన్ జెర్రీ కార్గిల్ వార్ లో దేశం కోసం ప్రాణాలు వదిలిన అమర వీరుడు. కేరళకు చెందిన కెప్టెన్ జెర్రీ ధైర్యానికి, పోరాట తత్వానికి నిలువెత్తు నిదర్శనం. కార్గిల్ యుద్ధంలో టైగర్ హిల్స్ నుంచి శత్రుమూకలను తరిమి వేసే క్రమంలో వీర మరణం పొందారు. శుత్రువుల బుల్లెట్లు తగిలినప్పటికీ, తన తోటి జవాన్లను కాపాడేందుకు తూటాలు ఎక్కు పెట్టారు. చివరికి ప్రాణాలు వదిలారు. యువ సైనిక అధికారి ధైర్యసాహసాలకు గాను, ఆయన మరణానంతరం వీరచక్ర అవార్డుతో భారత ప్రభుత్వం గౌరవించింది. మరణానికి ముందుకు ఆయన తన తల్లిదండ్రులకు రాసిన లేఖ అప్పట్లో అందరినీ కంటతడి పెట్టించింది. “ అమ్మా, నాన్నా.. నన్ను చూసి గర్వపడండి. చింతించకండి. మేము శత్రువులను ఎదుర్కొంటున్నాం. మా కోసం ప్రార్థించండి” అని రాశారు. తల్లి అతడి కోసం ప్రార్థిస్తే, కొడుకు దేశాన్ని రక్షించడానికి తన ప్రాణాలను ఇచ్చాడు. కెప్టెన్ జెర్రీ ప్రేమ్ రాజ్ 27 ఏళ్ల వయసులో దేశం కోసం ప్రాణాలర్పించారు.
కెప్టెన్ జెర్రీ ప్రేమ్ రాజ్ కేరళ తిరువనంతపురం సమీపంలోని వెంగనూర్ నివాసి. తల్లిదండ్రులు రెత్నా రాజ్, చెల్లా థాయీ. ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. వీరి కుటుంబానికి సైనిక నేపథ్యం ఉన్నది. అతడి సోదరుడు రెజినాల్డ్ పవిత్రన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పని చేశారు. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పొందిన కెప్టెన్ ప్రేమ్ రాజ్ అంకితభావంతో అత్యుత్తమ అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1997లో 158 మీడియం రెజిమెంట్ (SP)కు నాయకత్వం వహించారు. కార్గిల్ వార్ లో భాగంగా జూలై 6, 1999 అర్థరాత్రి సమయంలో శత్రువుల దాడిలో తీవ్రంగా గాయపడి, మరుసటి రోజు అమరుడయ్యారు.
Read Also: ప్రారంభానికి రెడీ అవుతున్న వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్, దీని ప్రత్యేకతలు ఎంతో తెలుసా?