Indian Railway Tikets: భారతీయ రైల్వే రోజు రోజుకు టెక్నాలజీని గణనీయంగా అందిపుచ్చుకుంటున్నది. ఇప్పటికే అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తూ సరికొత్త రైళ్లు, కోచ్ లను తయారు చేస్తున్నది. మరోవైపు రైలు ప్రమాదాల నివారణలోనూ లేటెస్ట్ టెక్నాలజీని వాడుతున్నది. కవచ్ వ్యవస్థను దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్నది. మరోవైపు వినియోగదారులకు డిజిటల్ సేవలను అందించడంలో సరికొత్త టెక్నాలజీని తీసుకొస్తున్నది. భారతీయ రైల్వే లేటెస్ట్ టెక్నాలజీని వినియోగించుకుంటూ ఇకపై నిమిషానికి రెండు లక్షలకు పైగా రైలు టికెట్లను జారీ చేయాలని భావిస్తున్నట్లు సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) మేనేజింగ్ డైరెక్టర్ జి వి ఎల్ సత్య కుమార్ తెలిపారు.
నిమిషానికి 2.5 లక్షల రైల్వే టికెట్ల జారీ
భారతీయ రైల్వే సంస్థ ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటుందని సత్య కుమార్ వెల్లడించారు. 19వ ఇండియా డిజిటల్ సమ్మిట్ లో పాల్గొన్న ఆయన కీలక విషయాలను వెల్లడించారు. “టికెటింగ్ వ్యవస్థ సామర్ధ్యాన్ని పెంచడంలో టెక్నాలజీ గణనీయమైన పాత్ర పోషించింది. నిమిషానికి 1000 టిక్కెట్లను జారీ చేయడం నుంచి ఈ రోజు 25,000 టిక్కెట్లను జారీ చేసే స్థాయికి చేరుకున్నాం. ఆగస్టు 2025 నాటికి ఈ సంఖ్య ఊహించలేనంత పెరగనుంది. నిమిషానికి 2.5 లక్షల టిక్కెట్లను జారీ చేసేలా ప్రయత్నిస్తున్నాం” అని తెలిపారు. “అల్ట్రాసోనిక్ ఫ్లోర్ డిటెక్టర్లు, ట్రాక్ రికార్డింగ్ కార్లు, ఆసిలేషన్ మానిటరింగ్ సిస్టమ్ తో భద్రతా చర్యలు తీసుకుంటున్నాం. ఈ వ్యవస్థలు ట్రాక్ పరిస్థితులకు సంబంధించి రియల్ టైమ్ డేటాను అందిస్తాయి. రైల్వే నెట్ వర్క్ సమర్థవంతమైన నిర్వహణను సాయపడుతున్నాయి” అని వివరించారు.
1986 నుంచి డిజిటల్ సేవలు
భారతీయ రైల్వేలో డిజిటల్ వ్యవస్థ 1986లో ప్రారంభం అయినట్లు సత్య కుమార్ తెలిపారు.“1986లో కంప్యూటరైజ్డ్ టికెటింగ్ సిస్టమ్‌లను ప్రవేశపెట్టడంతో భారతీయ రైల్వేలో డిజిటల్ పరివర్తన మొదలయ్యింది. ఆ తర్వాత డేటా సెంటర్లను కలపడం, వెబ్ టికెటింగ్, మొబైల్ టికెటింగ్ తో సహా ఈ వ్యవస్థ గణనీయమైన పురోగతి సాధించింది” అని వెల్లడించారు. ఇక ప్రస్తుతం రోజూ రెండు కోట్ల మందికి పైగా ప్రయాణీకులు రైలు ప్రయాణం చేస్తున్నట్లు సత్య కుమార్ తెలిపారు. 4.2 బిలియన్ టన్నులకు పైగా సరుకు రవాణా చేస్తున్నట్లు తెలిపారు. 10 వేల ప్యాసింజర్ రైళ్లు, 3.5 లక్షల కోచ్ లతో నడుస్తున్నట్లు తెలిపారు. 10 వేల రైళ్లకు 15 వేల లోకోమోటివ్ లు అందుబాటులో ఉన్నాయన్నారు.
Read Also: ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఇకపై తేజస్, వందే భారత్ రైళ్లలోనూ ఆ సౌకర్యం!
2 రోజుల పాటు కొనసాగనున్నడిజిటల్ సమ్మిట్
ఇక 19వ ఇండియా డిజిటల్ సమ్మిట్ రెండు రోజుల పాటు కొనసాగనుంది. ఈ సమ్మిట్ ను ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (IAMAI), ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY), భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సహకారంతో నిర్వహిస్తోంది. డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాకు సపోర్టుగా ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నారు.
Read Also: ముగిసిన సంక్రాంతి సంబురాలు.. విశాఖ నుంచి చర్లపల్లికి ప్రత్యేక రైళ్లు