Indian Railways: వందేభారత్ స్లీపర్ రైళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే నిర్ణయం తీసకుంది. వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ఒక్కొక్కటిగా అందుబాటులోకి తీసుకు రాగా, వందేభారత్ స్లీపర్ రైళ్ల విషయంలో కొత్త ఫార్ములాను ఫాలో అవుతోంది. ఒక్కొక్కటిగా కాకుండా.. ఒకేసారి 10 రైళ్లను ప్రారంభించబోతుంది. ఇప్పటికే ఈ రైళ్లు నడిపే రూట్ల విషయంలోనూ ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది.
ఒకేసారి 10 వందే భారత్ స్లీపర్ రైళ్లు
భారతీయ రైల్వే సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలోనే 10 వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించాలని భావిస్తోంది. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) సహకారంతో ఈ కొత్త అల్ట్రా- మోడ్రన్ రైళ్లు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందిచబోతున్నాయి. జమ్మూకాశ్మీర్ లో నడిచే వందేభారత్ స్లీపర్ రైళ్లు మరిన్ని అదనపు ఫీచర్లను కలిగి ఉండబోతున్నాయి. “ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10 వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టాలని భావిస్తున్నాం. ఈ రైళ్లను BEML సహకారంతో తయారు చేస్తున్నారు” అని వందే భారత్ స్లీపర్ రైళ్ల ప్రారంభం గురించి ఒక సీనియర్ రైల్వే అధికారి వెల్లడించారు.
ఏ రూట్లలో అందుబాటులోకి వస్తాయంటే?
వందేభారత్ స్లీపర్ రైళ్లకు సంబంధించిన రూట్లను అధికారికంగా ప్రకటించనప్పటికీ, న్యూఢిల్లీ-హౌరా, సీల్దా-న్యూఢిల్లీ, న్యూఢిల్లీ-పుణే, న్యూఢిల్లీ-ముంబై, న్యూఢిల్లీ-సికింద్రాబాద్ లాంటి ముఖ్యమైన మార్గాలు ఇందులో ఉంటాయని తెలుస్తోంది. త్వరలోనే పూర్తి లిస్టు బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే, దేశంలో తొలి వందేభారత్ స్లీపర్ రైలును మాత్రం జూన్ 6న కత్రా నుంచి శ్రీనగర్ వరకు అందుబాటులోకి రానుంది. ప్రధాని మోడీ ఉధంపూర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రారంభించడంతో పాటు కొత్త వందేభారత్ స్లీపర్ సేవలను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
వందే భారత్ స్లీపర్ రైలు- టాప్ స్పీడ్
వందేభారత్ స్లీపర్ రైళ్లు దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే రైళ్లుగా గుర్తింపు తెచ్చుకోనున్నాయి. ఇప్పటికే రాజస్థాన్ లోని కోటాలో వందేభారత్ స్లీపర్ రైళ్లకు సంబంధించిన ట్రయల్స్ కొనసాగాయి. ఈ సందర్భంగా గంటకు 180 కి.మీ. గరిష్ట వేగాన్ని అందుకున్నాయి. కోటా డివిజన్ లో విజయవంతమైన ట్రయల్ రన్ కు సంబంధించి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశారు. వందే భారత్ స్లీపర్ రైలు లోపల టేబుల్ మీద వాటర్ తో నింపిన గ్లాస్, దాని పక్కనే మొబైల్ ఫోన్ ను ఉంచారు. రైలు గరిష్టంగా 180 కి.మీ. వేగాన్ని అందుకున్నా, వాటర్ గ్లాస్ లోని నీళ్లు ఒలికిపోకుండా ఉండటం ఈ వీడియోలో కనిపించింది. వందేభారత్ స్లీపర్ ప్రయాణం ఎంత స్మూత్ గా ఉండబోతుంది? అనేది ఈ వీడియో వెల్లడిస్తుంది. ఈ రైళ్లను సుమారు 800 కిలో మీటర్ల రేంజ్ లో ఉండే నగరాల మధ్య నడిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
దేశ వ్యాప్తంగా 136 వందేభారత్ రైళ్లు
ఇప్పటికే మధ్యస్థ, తక్కువ దూరాల మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను నడుస్తున్నాయి. ప్రస్తుతం 136 వందే భారత్ రైళ్ల ద్వారా ప్రయాణీకులు రాకపోకలను కొనసాగిస్తున్నారు. ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభవాన్ని ఆస్వాదిస్తున్నారు. కొత్త వందే భారత్ స్లీపర్ రైళ్లు మరింత వేగంగా ప్రయాణీకులకు ప్రయాణ అనుభవాన్ని అందించనున్నాయి.
Read Also: ఆ రైళ్లలోనూ ఈ-ప్యాంట్రీ సేవలు, ప్రయాణీకులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్!