IRCTC’s Complimentary Meal Policy: చలికాలం వచ్చిందంటే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. దట్టమైన పొగ మంచు కారణంగా ఆలస్యం కావడంతో పాటు కొన్ని రైళ్లు రద్దు అవుతాయి. ఇలాంటి సమయంలో ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని రైల్వే సంస్థ నిర్ణయించింది. ఒక వేళ రాజధాని, శతాబ్ది, దురంతో ఎక్స్ ప్రెస్ లాంటి ప్రీమియం రైళ్లు ఆలస్యం అయితే, కాంప్లిమెంటరీగా ఫుడ్ అందించడంతో పాటు టికెట్ డబ్బులు వాపస్ ఇవ్వనున్నట్లు తెలిపింది.
2 గంటలకు మించి ఆలస్యం అయినప్పుడు మాత్రమే!
రైళ్ల ఆలస్యంలో అసౌకర్యాన్ని తగ్గించేందుకు రైల్వే సంస్థ కాంప్లిమెంటరీ మీల్ పాలసీని తీసుకొచ్చింది. రైళ్లు రెండు గంటలు, అంతకంటే ఎక్కువ ఆలస్యం అయినప్పుడు ప్రయాణీకులకు ఉచిత భోజనాన్ని అందిస్తుంది. ఈ భోజనాలు రైలు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణీకులతో పాటు ఆల్రెడీ మార్గం మధ్యలో ఉన్నవారికి కూడా వర్తిస్తుందని రైల్వే అధికారులు వెల్లడించారు.
ప్రయాణీకులకు అందించే ఫుడ్ ఇదే!
⦿ డ్రింక్స్: చక్కెర, మిల్క్ క్రీమర్ కిట్లతో పాటు బిస్కెట్లతో కూడిన టీ లేదంటే కాఫీని అందిస్తారు.
⦿ బ్రేక్ ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్స్: నాలుగు బ్రెడ్ స్లైసులు, వెన్న, 200ml ఫ్రూట్ డ్రింక్, టీ లేదా కాఫీ అందిస్తారు.
లంచ్ లేదా డిన్నర్!
⦿పప్పు, రాజ్మా లేదా చిక్ పీస్(చోలే), ఊరగాయ సాచెట్లతో కూడిన అన్నం అందిస్తారు.
⦿మిక్స్ డ్ వెజిటెబుల్స్, ఊరగాయ సాచెట్లు, ఉప్పు/మిరియాల ప్యాకెట్లతో ఏడు పూరీలు అందిస్తారు.
పై రెండు ఆప్షన్లలో ప్రయాణీకులు ఏదో ఒకదాన్ని మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుందని రైల్వే అధికారులు వెల్లడించారు.
టికెట్ డబ్బులు పూర్తిగా రీఫండ్ పొందే అవకాశం
పొగ మంచు కారణంగా రైళ్లు మూడు గంటలకు పైగా ఆలస్యం అయినా, రైళ్లు దారి మళ్లించినా ప్రయాణీకులు టికెట్ క్యాన్సిల్ చేసుకుని పూర్తి మొత్తాన్ని రీఫండ్ పొందే అవకాశం ఉంటుంది. ఒకవేళ దారి మళ్లించిన రైల్లో ప్రయాణించాలా? వద్దా? అనేది ప్రయాణీకులు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. వెళ్లకూడదు అని భావిస్తే ఆన్ లైన్ లో బుక్ చేసిన టిక్కెట్ల కోసం, రీఫండ్ లను డిజిటల్ గా ప్రాసెస్ చేయవచ్చు. అయితే, రైల్వే కౌంటర్ లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు రీఫండ్ ను క్లెయిమ్ చేయడానికి వ్యక్తిగతంగా వెళ్లి టీడీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది.
Read Also: ఇండియాలో ఫాస్టెస్ట్ రైలు ఇదే! ఎంత వేగంతో దూసుకెళ్తుందో తెలుసా?
కాంప్లిమెంటరీ మీల్ పాలసీతో లాభం ఏంటి?
శీతాకాలంలో తరచుగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతాయి. రైళ్ల రాకపోకలు ఇబ్బందికరంగా సాగుతాయి. అందుకే, ప్రయాణీకులు ఇబ్బంది కలగకుండా కాంప్లిమెంటరీ మీల్ పాలసీని తీసుకొచ్చింది రైల్వే సంస్థ. దీని వల్ల ప్రయాణీకులు కాస్త రిలాక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. రైళ్లు ఆలస్యం అయినా, కాస్త ఓపికగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే, ప్రయాణీకుల అసౌకర్యాన్ని తగ్గించడంతో పాటు వారి ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు ఈ పాలసీ బాగా ఉపయోగపడుతుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు.
Read Also: చార్ట్ ప్రిపేర్ అయినా కన్ఫార్మ్ టికెట్ దొరుకుతుంది సింపుల్‌గా ఈ టిప్స్ ఫాలో అవ్వండి చాలు!