Indian Railways: తత్కాల్ టికెట్ బుకింగ్ విషయంలో రైల్వేశాఖ కీలక చర్యలు చేపడుతోంది. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా కఠిన చర్యలు తీసుకోబోతోంది. రైలు ప్రయాణాల సమయంలో ఆధార్ ధృవీకరణ విధానాలను బలోపేతం చేయడానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణీకుల మెరుగైన ధృవీకరణ కోసం గుర్తింపు తనిఖీలకు mAadhaar మొబైల్ అప్లికేషన్‌ను ఉపయోగించాలని టికెట్ ఎగ్జామినర్లకు సూచించింది.
తత్కాల్ బుకింగ్ కు ఆధార్ ధృవీకరణ తప్పనిసరి!
తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవడానికి e-ఆధార్ ధృవీకరణను తప్పనిసరి చేస్తూ రైల్వేశాఖ ఇటీవలి నిర్ణయం తీసుకుంది. నకిలీ ఆధార్ కార్డులను ఉపయోగించి టికెట్లు బుక్ చేయడంతో పాటు తత్కాల్ టికెట్ల దుర్వినియోగానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిసైడ్ అయ్యింది. తత్కాల్ టికెట్స్ బుకింగ్ కు సంబంధించి తాజాగా మార్చిన రూల్స్ లో భాగంగా క్యాటరింగ్ సిబ్బంది, హౌస్ కీపింగ్ సిబ్బంది ఆధార్ ఆధారాలు కూడా ధృవీకరణకు లోబడి ఉంటాయి. టికెట్ ఎగ్జామినర్ ఆధార్ కార్డు నకిలీ చేయబడిందని అనుమానించిన సందర్భాల్లో.. ఆయన వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) లేదంటే గవర్నమెంట్ రైల్వే పోలీసు అధికారులకు తెలియజేయాలి.
MAadhaar యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని టీటీఈలకు ఆదేశం
ప్రస్తుతం టికెట్ ఎగ్జామినర్లు Google Play Store నుంచి mAadhaar అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని రైల్వే ఉన్నతాధికారులు సూచించారు. ఈ యాప్ ను వారి అధికారిక టాబ్లెట్లలో అందుబాటులో ఉంచుతారు. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) అభివృద్ధి చేసిన mAadhaar యాప్, QR కోడ్ స్కానింగ్, ఆధార్ నంబర్, పేరు, చిరునామా వంటి కీలక గుర్తింపు వివరాలను వెల్లడిస్తుంది. తత్కాల్ టికెట్స్ మీద ఇకపై ఆధార్ నెంబర్ కూడా ప్రింట్ అయ్యే అవకాశం ఉంది. టీటీఈ టికెట్లను చెక్ చేసే సమయంలో అనుమానం వచ్చిన ఆధార్ నెంబర్ ను mAadhaar అప్లికేషన్ ద్వారా కన్ఫర్మ్ చేసుకుంటారు. ఒకవేళ అందులో వివరాలు తప్పుగా చూపించబడితే, సదరు ప్రయాణీకులపై రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు.
Read Also: మారిన తత్కాల్ టికెట్ రూల్స్.. ఇకపై అది తప్పనిసరి, లేకుంటే?
తత్కాల్ టికెట్ల విషయంలో పెరగనున్న పారదర్శకత
గత కొంతకాలంగా తత్కాల్ టికెట్ల బుకింగ్ విషయం తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇదంతా ఓ పెద్ద స్కామ్ అంటూ సాధారణ ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తత్కాల్ టికెట్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తత్కాల్ టికెట్స్ బుకింగ్ కు ఆధార్ ను తప్పనిసరి చేసింది. అంతేకాదు, బుకింగ్ విండో ఓపెన్ అయిన తర్వాత 10 నిమిషాల వరకు ఏజెంట్లకు టికెట్ బుకింగ్ అవకాశం కల్పించడం లేదని వెల్లడించింది. ఈ నేపథ్యంలో సాధారణ ప్రయాణీకులకు మేలు కలగనుంది. ఇంతకాలం తత్కాల్ టికెట్ల విషయం వస్తున్న విమర్శలకు చెక్ పెట్టే అవకాశం ఉంటుంది.
Read Also: ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే మార్గం, ప్రయాణీకులు ఆక్సిజన్ మాస్కులు పెట్టుకోవాల్సిందే!