Bairabi Railway Station: ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే స్టేషన్లలో ఇండియన్ రైల్వే ఒకటి. అమెరికా, చైనా, రష్యా, తర్వాత స్థానంలో భారత్ ఉంటుంది. మన దేశంలో సుమారు లక్ష కిలో మీటర్ల మేర రైల్వే నెట్ వర్క్ విస్తరించి ఉంది. దేశ వ్యాప్తంగా 7300 పైగా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా రోజు సుమారు 20 వేల రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయి. కొన్ని రాష్ట్రాల్లో ఏకంగా వెయ్యికి పైగా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అయితే, దేశంలో ఒకే ఒక్క రైల్వే స్టేషన్ ఉన్న రాష్ట్రం ఒకటి ఉంది. ఇంతకీ ఆ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది? ఎందుకు ఆ రాష్ట్రంలో ఒకే స్టేషన్ ఏర్పాటు చేశారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఒకే ఒక్క రైల్వే స్టేషన్ ఉన్న రాష్ట్రం మిజోరాం
దేశంలో ఒకే ఒక్క రైల్వే స్టేషన్ ఉన్న రాష్ట్రం మిజోరాం. ఇక్కడి రైల్వే స్టేషన్ పేరు బైరాబి రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ తూర్పు రైల్వేకు ముగింపు స్థానంగా ఉంటుంది. కోలాసిబ్ జిల్లాలోని బైరాబి పట్టణంలో ఈ రైల్వే స్టేషన్ ఉంది. ఆ రాష్ట్రాన్ని దేశంలోని ఇతర ప్రాంతాలతో కనెక్ట్ చేసే ఏకైక స్టేషన్ గా పని చేస్తుంది. ప్రయాణీకుల రాకపోకలు, సరుకు రవాణా ఈ స్టేషన్ నుంచే కొనసాగుతుంది. ఇది ఆ రాష్ట్రంలో చివరి, ఏకైక రైల్వే స్టేషన్. ఇక్కడి నుంచి ముందుకు రైల్వే లైన్ ను విస్తరించే అవకాశం లేదు. ఇక్కడి భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడమే ఇందుకు కారణం.
రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న ప్రజలు
మిజోరాంలో సుమారు 11 లక్షల జనాభా ఉంటుంది. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు సాగించాలంటే ప్రజలు చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. రైల్వే ప్రయాణం చేయాలంటే రాష్ట్ర ప్రజలు కచ్చితంగా ఈ స్టేషన్ కు వచ్చి తీరాల్సిందే. బైరాబి రైల్వే స్టేషన్ ఐజ్వాల్ నగరానికి సుమారు 90 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ప్రజలు ఇక్కడికి వచ్చేందుకు చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ లో మొత్తం 3 ప్లాట్ ఫారమ్ లు ఉన్నాయి. 2016లో ఈ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం జరిగినప్పటికీ, ప్లాట్ ఫారమ్ ల సంఖ్య మాత్రం పెరగలేదు. బైరాబి రైల్వే స్టేషన్ అస్సాంలోని కటఖల్ జంక్షన్ కు 84 కిలో మీటర్ల దూరంలో లింకై ఉంటుంది. ఈ రాష్ట్రంలో మరో రైల్వే స్టేషన్ నిర్మించాలనే ప్రతిపాదన చాలా ఏళ్లుగా ఉంది. రైల్వేశాఖ కూడా తర్వలో మరో రైల్వే స్టేషన్ నిర్మాణంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రెండో రైల్వే స్టేషన్ వస్తే మిజోరం ప్రజలకు మరింత సౌకర్యంగా ఉంటుంది.
భౌగోళిక పరిస్థితులతో ఇబ్బందులు
మిజోరంలో అదనపు రైల్వే స్టేషన్లను నిర్మించకపోవడానికి ప్రధాన కారణం భౌగోళిక పరిస్థితులు. ఈ రాష్ట్రం ఎక్కువ శాతం కొండ ప్రాంతాల్లో ఉంటుంది. ఇక్కడ రైల్వే లైన్లను నిర్మించడం అనేది చాలా కష్టమైన పని. ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, రెండో రైల్వే స్టేషన్ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే మరో స్టేషన్ కు సంబంధించి నిర్ణయం వెలవడే అవకాశం ఉంది.
Read Also: బ్రిటిష్ కాలంలో పునాది పడినా ఇప్పటికీ పూర్తికాని రైల్వే లింక్, ఇదీ అసలు సంగతి!