Weekly Special Trains From Secunderabad: సమ్మర్ హాలీడేస్ దగ్గర పడటంతో సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు తిరిగి నగరం బాటపట్టారు. రైల్వే స్టేషన్లలో రద్దీ విపరీతంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. హైదరాబాద్ నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాలకు పలు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం మొత్తం 150 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. వీటిలో పలు రైళ్లను సికింద్రాబాద్ నుంచి నడుపుతున్నట్లు తెలిపింది. చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణాలు చేసేందుకు ఇబ్బంది పడే ప్యాసింజర్లకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పినట్లు అయ్యింది.
సికింద్రాబాద్ నుంచి నడిచే ప్రత్యేక రైళ్లు
సమ్మర్ రద్దీ నేపథ్యంలో నడుతున్న రైళ్లలో 16 రైళ్లను సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ మధ్య నడిపించనున్నారు. ఈ రైళ్లు సుమారు రెండు నెలల పాటు అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్లు సికింద్రాబాద్ నుంచి రాకపోకలు కొనసాగించనున్నాయి. సికింద్రాబాద్ నుంచి కాకినాడ టౌన్‌కు వెళ్లే ప్రత్యేక రైలు(07041) ప్రతి గురువారం రాత్రి 10:40 గంటలకు బయల్దేరుతుంది. మరుసటి రోజు శుక్రవారం ఉదయం 10:45 గంటలకు కాకినాడ టౌన్ కు చేరుకుంటుంది. జూన్ 12, 19, 26వ తేదీల్లో అందుబాటులో ఉంటుంది. అటు జూలై 3, 10, 17, 24,30 తేదీల్లోనూ నడుస్తుంది. ఇక కాకినాడ టౌన్ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే ప్రత్యేక రైలు ప్రతి శుక్రవారం ఉదయం 6:55 గంటలకు బయల్దేరుతుంది. శనివారం ఉదయం 07:00 గంటలకు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది. ఈ రైలు జూన్ 13 నుంచి ప్రతీ శుక్రవారం ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఆగస్టు1న సర్వీసు అందించనుంది.
ఈ ప్రత్యేక రైళ్లు ఏ స్టేషన్లలో ఆగుతాయంటే?
సికింద్రాబాద్- కాకినాడ టౌన్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లు నల్లగొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లె, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట సహా పలు ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి. ఇరువైపు హాల్టింగ్ ఇచ్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లలో ఫస్ట్ AC, సెకండ్ AC, థర్డ్ AC కోచ్‌లతో పాటు జనరల్ బోగీలు కూడా అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు.
Read Also: కాశ్మీర్ వందేభారత్ కు ముహూర్తం ఫిక్స్, ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం.. ఎప్పుడంటే?
సికింద్రాబాద్ స్టేషన్ లో కొనసాగుతున్న పనులు
ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా రైళ్లను చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి నడిపిస్తున్నారు. అయితే, కాకినాడ టౌన్ కు నడిపే 16 రైళ్లను మాత్రం సికింద్రాబాద్ నుంచి నడిపిస్తున్నట్లు తెలిపారు. నిజానికి చర్లపల్లి రైల్వే స్టేషన్ కు వెళ్లేందుకు ప్రయాణీకులకు సరైన రవాణా సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అక్కడికి వెళ్లాలంటేనే వామ్మో అంటున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి కాకినాడకు ప్రత్యేక రైళ్లను నడిపించడం పట్ల ప్రయాణీకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: ఆ రైళ్లలోనూ ఈ-ప్యాంట్రీ సేవలు, ప్రయాణీకులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్!