Big Tv Originals: భారతీయ రైల్వే ఏసీ కోచ్ లో ప్రయాణించే ప్యాసింజర్లకు బెడ్ రోల్స్ అందిస్తుంది. ముఖ్యంగా రాత్రిపూట సుదూర ప్రయాణాలు చేసే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. బెడ్ రోల్స్ లో దుప్పట్లు, దిండ్లు, బెడ్ షీట్లు, తువ్వాళ్లు అందజేస్తుంది. ఈ బెడ్ రోల్స్ వైట్ కలర్ లో ఉంటాయి. మిగతా రంగుల్లో కనిపించవు. ఇంతకీ రైల్వే కేవలం వైట్ కలర్ బెడ్ రోల్స్ మాత్రమే ఎందుకు అందిస్తుంది? ఏమైనా ప్రత్యేక కారణం ఉందా? ఒక్కో బెడ్ రోల్ ధర ఎంత ఉంటుంది? ఎవరైనా రైలు నుంచి బెడ్ రోల్ ను దొంగిలిస్తే ఏం జరుగుతుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
వైట్ బెడ్ రోల్స్ ఉపయోగించడానికి కారణాలు
⦿ మురికిని గుర్తించడం: వైట్ కలర్ వస్తువుల మీద ధూళి, మరకలు స్పష్టంగా కనిపిస్తాయి. దుప్పటి శుభ్రంగా లేకుంటే, రైల్వే సిబ్బంది వెంటనే వాటిని మార్చుతారు. ప్రతి ప్రయాణీకుడికి తాజా, శుభ్రమైన పరుపులు లభించేలా సాయపడుతుంది. భారతీయ రైల్వే ఈ బెడ్ రోల్స్ ను తరచుగా వేడి నీరు, బ్లీచ్ తో శుభ్రం చేస్తుంది.
⦿ ఎక్కువ మన్నిక: తెల్లటి బెడ్ రోల్స్ క్వాలిటీగా దృఢంగా ఉంటాయి. ఇవి పవర్ ఫుల్ క్లీనింగ్ కెమికల్స్, వేడికి దెబ్బతినకుండా తట్టుకుంటాయి. ఇతర రంగుల బెడ్ రోల్స్ ఈజీగా మసకబారుతాయి. తట్టుకోగలవు. తెలుపు బెడ్ రోల్స్ ఎక్కువ కాలం మన్నికగా ఉండటం వలన రైల్వేకు డబ్బు ఆదా అవుతుంది.
⦿ ప్రొఫెషనల్ గా కనిపిస్తాయి: తెలుపు రంగు స్వచ్ఛత, శుభ్రతను సూచిస్తాయి. ప్రయాణీకులకు తెల్లటి పరుపులను చూసినప్పుడు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలనిపిస్తాయి. ఇవి రైలులో హోటల్ లాంటి అనుభూతిని కల్పిస్తాయి.
⦿ నాణ్యత తనిఖీలలో సాయం: రైల్వే అధికారులు తనిఖీల సమయంలో తెలుపు రంగు బెడ్ రోల్స్ లాండ్రీ సరిగ్గా జరిగిందో? లేదో? ఈజీగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. పసుపు రంగు మచ్చలు, గుర్తులు ఉంటే త్వరగా కనిపిస్తాయి.
ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చాయంటే?
భారతీయ రైల్వేలో వైట్ కలర్ బెడ్ రోల్స్ 1990 నుంచి అందుబాటులోకి వచ్చాయి. అప్పటి నుంచి AC కోచ్ లు సాధారణం కావడంతో భారతీయ రైల్వేలు బెడ్ రోల్స్ ను విస్తృతంగా ఉపయోగించడం ప్రారంభించాయి.
ఒక బెడ్ రోల్ ధర ఎంత ఉంటుందంటే?
ఏసీ క్లాస్ ప్రయాణీకులకు బెడ్ రోల్స్ ను సాధారణంగా ఉచితంగా ఇస్తారు. వీటికి ఛార్జీని టికెట్ ధరలోనే వసూలు చేస్తారు. గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ లాంటి కొన్ని ప్రత్యేక రైళ్లలో, బెడ్ రోల్స్ అవసరం అనుకుంటేనే తీసుకోవచ్చు. ఒక దుప్పటి, రెండు బెడ్ షీట్లతో కూడిన ప్రైమరీ కిట్ ధర దాదాపు రూ. 110 ఉంటుంది. రెండు బెడ్ షీట్లు, ఒక దిండు, ఒక దుప్పటితో కూడిన ఫుల్ కిట్ ధర దాదాపు రూ. 250 ఉంటుంది. అటు ఒక దిండు, రెండు బెడ్ షీట్లకు రూ. 140, దుప్పటితో కూడిన పూర్తి సెట్ కు రూ. 300 ఖరీదు చేసే డిస్పోజబుల్ కిట్లు కూడా ఉంటాయి. వీటిని ఉపయోగించి బయటపడేయవచ్చు.
రైలు నుంచి బెడ్ రోల్‌ను దొంగిలిస్తే ఏమవుతుంది?
రైళ్లలో బెడ్ రోల్స్ దొంగిలిస్తే రైల్వే అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారు. దొంగతనం చేస్తూ మొదటిసారి పట్టుబడితే, రూ.1,000 జరిమానా, 1 సంవత్సరం వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. రెండోసారి పట్టుబడితే 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA ద్వారా కంప్లైట్ ఫైల్ చేయబడుతుంది.