Indian Railways: భారతీయ రైల్వే వ్యవస్థలో వందేభారత్ రైళ్లు సరికొత్త అధ్యాయానికి నాంది పలికాయి. ఇంతకు ముందు ఉన్న రైళ్లకు పూర్తి భిన్నమైన రూపంతో పాటు అత్యధిక వేగంతో పరుగులు తీస్తూ ముందుకు వచ్చాయి. ప్రపంచ స్థాయి సదుపాయాలతో ప్రయాణీకులకు ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభవాన్ని అందించాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 136 వందేభారత్ రైళ్లు సేవలను అందిస్తున్నాయి. సుమారు 500 కిలో మీటర్ల పరిధి ఉన్న రూట్లలో నడుస్తున్నాయి. చెన్నైకి చెందిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) తయారు చేసిన ఈ సెమీ హై స్పీడ్ రైళ్లు.. భారతీయ రైలు ప్రయాణంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చాయి. ప్రయాణీకులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్నిఅందిస్తున్నాయి. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు పూర్తి ఆక్యుపెన్సీలతో నడుస్తున్నాయి.
వందేభారత్ టికెట్ల ధరల తగ్గింపు దిశగా ఆలోచన
సంప్రదాయ రైళ్లతో పోల్చితే వందేభారత్ రైళ్ల టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే పేదల ప్రజలకు ఇందులో ప్రయాణం చేయాలనే కోరిక ఉన్నా, ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. పేద ప్రజలకు వందేభారత్ రైలు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వందేభారత్ రైళ్ల టికెట్ల ధరల తగ్గింపు అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
కేంద్ర రైల్వే మంత్రి ఏం చెప్పారంటే?
పేద ప్రజలకు వందేభారత్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏమైనా చర్చలు తీసుకుంటుందా? ధరల తగ్గింపు ఆలోచన ఏమైనా ఉందా? అని లోక్ సభ ఎంపీ రకీబుల్ హుస్సేన్ అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక సమాధానం చెప్పారు. పలు రకాల రైళ్లు, ఆ రైళ్లలో ప్రయాణించే క్లాసులు, కల్పించే సౌకర్యాల ఆధారంగా ఛార్జీలు ఉంటాయని వైష్ణవ్ తెలిపారు. భారతీయ రైల్వే సంస్థ సేవల ఖర్చు, సేవల విలువ, ప్రయాణీకులు భరించగల సామర్థ్యం, సామాజిక ఆర్థిక పరిగణనను పరిశీలించే ఛార్జీలను నిర్ణయిస్తుందన్నారు. వందే భారత్ రైళ్లతో సహా అన్ని రైళ్లలో ఛార్జీల హేతుబద్ధీకరణ నిరంతరంగా కొనసాగుతుందన్నారు. పేదలకు ఈ రైలు ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
అమృత్ భారత్ సేవలు అందుబాటులోకి
జాతీయ రవాణా సంస్థ ఇప్పటికే అమృత్ భారత్ సేవలను అందుబాటులోకి తెచ్చిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇవి పూర్తిగా నాన్ ఎసీ రైళ్లు అన్నారు. పేద ప్రజలు చక్కటి ప్రయాణ సేవలను పొందే అవకాశం ఉందన్నారు. “ఇటీవల ఇండియన్ రైల్వే అమృత్ భారత్ సేవలను ప్రవేశపెట్టింది. ఇవి పూర్తిగా నాన్ ఏసీ రైళ్లు. ప్రస్తుతం 12 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 8 జనరల్ క్లాస్ కోచ్‌లు ఉన్నాయి. ఇందులో పేద ప్రజలు చక్కటి ప్రయాణ సేవలను పొందే అవకాశం ఉంది” అని చెప్పుకొచ్చారు. “ఈ రైళ్లు అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉన్నాయి. జెర్క్ ఫ్రీ ట్రావెల్ కోసం సెమీ పర్మనెంట్ కప్లర్లు, స్లైడింగ్ విండోలు, ఫోల్డబుల్ స్నాక్ టేబుల్స్, బాటిల్ హోల్డర్లు, మొబైల్ హోల్డర్లు సహా మొదలైన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి” అన్నారు.
Read Also: జమ్మూ నుంచి శ్రీనగర్ కు రైల్వే సర్వీస్, ఓపెనింగ్ ఎప్పుడో చెప్పేసిన కేంద్రం!