India’s Viral Train Cafe: సోషల్ మీడియాలో ఇటీవల ట్రైన్ కేఫేకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. కేవలం రూ.50కే దేశంలోనే అత్యంత అందమైన ట్రైన్ కేఫే అంటూ ఈ వీడియోలకు క్యాప్షన్లు కనిపిస్తున్నాయి. అయితే, ఈ వీడియోల్లో కనిపిస్తున్నది ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేఫే కాదు. దేశంలో ఎంతో పేరున్న దక్కన్ క్వీన్ ఎక్స్ ప్రెస్ రైలులోని ప్రత్యేకమైన డైనింగ్ కార్ ఇది. ముంబై CSMT నుంచి పూణే జంక్షన్ వరకు ప్రయాణించే అద్భుతమైన దక్కన్ క్వీన్ లో ఈ కేఫే ఏర్పాటు చేశారు. సాధారణ రైలులా ప్రయాణికులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్లడంతో పాటు, ఈ రైలులోని డైనింగ్ కార్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
దక్కన్ క్వీన్‌లోని డైనింగ్ కార్ సాధారణ రైలు బోగీలకు భిన్నంగా కనిపిస్తుంది. పాతకాలపు చెక్క ఫినిషింగ్, పెద్ద గాజు కిటికీలు, లోపలి ఇంటీరియర్ ఈ బోగీకి ప్రత్యేకమైన లుక్‌ను ఇస్తాయి. రైలు కదులుతున్న సమయంలో కిటికీ బయట కనిపించే ప్రకృతి దృశ్యాలు ఈ ఎక్స్ పీరియెన్స్ ను మరింత ప్రత్యేకంగా మారుస్తాయి. ముఖ్యంగా ముంబై–పూణే మార్గంలోని లోనావాలా ఘాట్ ప్రాంతంలో ప్రయాణించే సమయంలో కొండలు, పచ్చని ప్రకృతి, లోయలు కనిపిస్తాయి. వర్షాకాలంలో ఈ ప్రాంతం మరింత అందంగా కనిపించడంతో ట్రైన్ జర్నీకి మరో ఆకర్షణ చేరుతుంది.
వైరల్ వీడియోల్లో రూ.50 అనే ధర ఎక్కువగా కనిపించడంతో చాలామందికి ఇది మొత్తం ప్రయాణానికి సంబంధించిన టికెట్ ధర అయి ఉంటుందని భావిస్తున్నారు. కానీ, దక్కన్ క్వీన్‌లో ప్రయాణించడానికి జనరల్ క్లాస్‌లో టికెట్ ధర సుమారు రూ.80 నుంచి రూ.100 వరకు ఉంటుంది. అయితే, టికెట్ ధర ప్రయాణ తేదీ, కోచ్, ఛార్జీల ఆధారంగా మారుతుంది. కేఫే ఎక్స్ పీరియెన్స్ కోసం అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
డైనింగ్ కార్‌లో ప్రయాణికులు కూర్చుని ఫుడ్, డ్రింక్స్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ బోగీలో లభించే కొన్ని ఐటమ్స్ కూడా సోషల్ మీడియాలో ప్రత్యేకంగా చర్చకు వస్తున్నాయి. ముఖ్యంగా బేక్డ్ చీజ్ టోస్ట్, కాఫీ లాంటి ఐటమ్స్ ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. వీటి ధరలు కూడా తక్కువగానే ఉంటాయని వైరల్ పోస్టుల్లో చెప్తున్నారు. కాఫీ, చీజ్ టోస్ట్ వంటి ఆహార పదార్థాలకు సుమారు రూ.50 వరకు ఖర్చవుతుందని కొన్ని పోస్టులు చెబుతున్నాయి.
సాధారణంగా రైలులో ప్రయాణిస్తే మన ఫోకస్ అంతా సీటు, డెస్టినేషన్, కిటికీ బయట దృశ్యాలపైనే ఉంటుంది. కానీ దక్కన్ క్వీన్‌లోని డైనింగ్ కార్ మాత్రం ప్రయాణాన్నే ఒక ప్రత్యేక అనుభవంగా మార్చేలా ఉంటుంది. ఒకవైపు పాతకాలపు డైనింగ్ కార్ వాతావరణం, మరోవైపు కిటికీ బయట కనిపించే సహ్యాద్రి పర్వతాలు.. మధ్యలో వేడి కాఫీ ఆకట్టుకుంటాయి.
Read Also: ప్రపంచంలో వింతైన రైళ్లు.. వీటి ప్రయాణం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!