6 Weirdest Trains in the World: రైలు అంటే పట్టాలపై ప్రయాణించే రవాణా సాధనంగా మనకు తెలుసు. కానీ, ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో రైళ్లను చూస్తే ఈ ఈక్వేషన్ మారిపోతుంది. కొన్ని రైళ్లు గాల్లో వేలాడుతూ వెళ్తే.. మరికొన్ని ఏకంగా భవనాల మధ్యలోంచి దూసుకెళ్తాయి. ఇంకొన్ని రోడ్డు మీద బస్సులా తిరుగుతూ, అవసరమైనప్పుడు రైలుగా మారిపోతాయి. ఇలాంటి ఇంజనీరింగ్ ప్రయోగాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కొన్ని రైళ్ల గురించి తెలుసుకుందాం.
స్విట్జర్లాండ్‌లోని స్టూస్‌బాన్ రైలు ప్రపంచంలోనే అత్యంత నిటారైన పబ్లిక్ ఫనిక్యులర్ రైల్వేగా ప్రసిద్ధి చెందింది. కొండపైకి వెళ్లే సమయంలో రైలు దాదాపు 47 డిగ్రీల వాలులో ప్రయాణిస్తుంది. ఇంత నిటారుగా ఉన్నా ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు క్యాబిన్లను ప్రత్యేకంగా రూపొందించారు. గుండ్రటి బారెల్ ఆకారంలో ఉండే క్యాబిన్లు రైలు వాలుకు అనుగుణంగా తమ స్థానాన్ని మార్చుకుంటాయి. దీంతో బయట రైలు ఎంత వాలుగా ఉన్నా లోపల ప్రయాణికులు మాత్రం నిటారుగానే కూర్చోవచ్చు.
జర్మనీలోని వుప్పర్తాల్ సస్పెన్షన్ రైల్వే సాధారణ రైళ్లకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ పట్టాలు నేలపై కాకుండా పైభాగంలో ఏర్పాటు చేశారు. వాటి కింద వేలాడే క్యారేజీలు నగరంలోని రోడ్లు, భవనాలు, నదుల మీదుగా ప్రయాణిస్తాయి. 1901లో ప్రారంభమైన ఈ రైలు ఇప్పటికీ నగర రవాణాలో భాగంగా కొనసాగుతోంది. బయట నుంచి చూస్తే రైలు గాల్లో తేలుతున్నట్టుగా కనిపించడం దీని ప్రత్యేకత.
చైనాలోని చొంగ్చింగ్ నగరం ఎత్తుపల్లాలతో, ప్రత్యేక నిర్మాణాలతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడి మోనోరైల్ మరో కారణంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. 19 అంతస్తుల నివాస భవనం మధ్యలోంచే మోనోరైల్ మార్గం వెళ్తుంది. భవనంలోని 6 నుంచి 8వ అంతస్తుల ప్రాంతంలోనే రైల్వే స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. నగరంలో స్థలం కొరతను దృష్టిలో పెట్టుకుని రవాణా వ్యవస్థను ఇలా నిర్మించడం ఇంజనీరింగ్ లో ఆసక్తికరమైన ఎగ్జాంఫుల్ గా చెప్పుకోవచ్చు.
జపాన్‌లోని DMV రోడ్ రైల్ వాహనం బస్సు, రైలు రెండింటి లక్షణాలను కలిగి ఉంటుంది. రోడ్డుపై సాధారణ రబ్బరు టైర్లతో బస్సులా ప్రయాణించే ఈ వాహనం రైల్వే ట్రాక్ వద్దకు చేరుకున్న తర్వాత ప్రత్యేక విధానంతో రైలుగా మారుతుంది. దాదాపు 15 సెకన్లలో ఐరన్ చక్రాలు కిందకు వచ్చి పట్టాలపైకి చేరతాయి. అవసరం తీరిన తర్వాత మళ్లీ రోడ్డు ప్రయాణానికి సిద్ధమవుతుంది.
చైనాలోని లాసా వైపు వెళ్లే రైలు మార్గం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే మార్గాల్లో ఒకటి. కొన్ని ప్రాంతాల్లో రైలు సముద్ర మట్టానికి సుమారు 5,068 మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తుంది. అంత ఎత్తులో గాలిలో ఆక్సిజన్ తక్కువగా ఉండటంతో ప్రయాణికుల కోసం రైలు బోగీల్లో ప్రత్యేక ఆక్సిజన్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేశారు. సీట్ల దగ్గర కూడా పర్సనల్ ఆక్సిజన్ అవుట్‌లెట్లు అందుబాటులో ఉంటాయి.
కంబోడియాలో ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగించిన నోరి లేదంటే బాంబూ ట్రైన్ పేరు కూడా ఈ జాబితాలో ఉంటుంది. వెదురుతో తయారు చేసిన చిన్న ప్లాట్‌ఫారమ్‌కు మోటార్‌ను అమర్చి పట్టాలపై నడిపేవారు. ఎదురుగా మరో ట్రైన్ వస్తే.. ఈ చిన్న వాహనాన్ని పట్టాల నుంచి పక్కకు తొలగించి, అవతలి వాహనం వెళ్లిన తర్వాత తిరిగి పట్టాలపైకి ఎక్కించేవారు. సాధారణ వనరులతో స్థానిక అవసరాలకు తగ్గట్టుగా రూపొందిన ఈ ప్రయాణ విధానం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.
Read Also: దేశంలో అత్యంత అందమైన రైలు ప్రయాణాలు.. ఈ 5 రూట్లు అస్సలు మిస్ కావొద్దు!