Gold Smuggling Attempt: బంగారం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు విమానాశ్రయాల్లో భద్రతా సిబ్బంది ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తుంటారు. అయినప్పటికీ, కొందరు ప్రయాణికులు బంగారాన్ని దాచేందుకు కొత్త కొత్త పద్దతులు ఎంచుకుంటున్నారు. తాజాగా బెంగళూరు ఎయిర్ పోర్టులో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. నోటిలో బంగారం దాచుకుని విమానం ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ ప్రయాణికుడిని సీఐఎస్ఎఫ్ సిబ్బంది పట్టుకున్నారు.
ఘజియాబాద్ వెళ్లే విమానం ఎక్కేందుకు ప్రయాణికుడు టెర్మినల్1లో సెక్యూరిటీ చెక్ కు వెళ్లాడు. దాదాపు ఉదయం 7.30 గంటల సమయంలో సిబ్బంది అతడిని తనిఖీ చేశారు. ఈ సమయంలో ప్రయాణికుడి ప్రవర్తన భద్రతా సిబ్బందికి అనుమానంగా అనిపించింది. తనిఖీ సమయంలో అతడు సరిగా స్పందించకపోవడంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది మరింత జాగ్రత్తగా పరిశీలించారు. దీంతో అతడు ఏదో దాచినట్లు అనుమానం బలపడింది. సీఐఎస్ఎఫ్ అధికారులు పూర్తిగా తనిఖీ చేయగా నోటిలో రెండు క్యాప్సూల్స్ ఉన్నట్లు గుర్తించారు. వాటిలో బంగారం దాచినట్లు అనుమానించారు. క్యాప్సూల్స్ లో ఉన్న బంగారం మొత్తం సుమారు 82 గ్రాముల బరువు ఉన్నట్లు గుర్తించారు.
బంగారాన్ని క్యాప్సూల్స్ లో పెట్టి నోటిలో దాచుకోవడం భద్రతా సిబ్బందిని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా బంగారం అక్రమ రవాణాకు వివిధ రకాల దాచే పద్ధతులను ఉపయోగించిన ఘటనలు కనిపిస్తుంటాయి. అయితే, ఈ కేసులో అనుసరించిన విధానం చాలా అరుదైనదిగా అధికారులు వెల్లడించారు.
సదరు ప్రయాణికుడు తెల్లవారుజామున దుబాయ్ నుంచి బెంగళూరుకు చేరుకున్నాడు. అక్కడి నుంచి ఘజియాబాద్ వెళ్లే విమానం ఎక్కేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే టెర్మినల్-1లో సాధారణ భద్రతా తనిఖీలు జరుగుతుండగా అతడి వ్యవహారశైలిపై సీఐఎస్ఎఫ్ సిబ్బందికి అనుమానం వచ్చింది. తనిఖీల్లో క్యాప్సూల్స్ బయటపడటంతో ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై మరింత విచారణ కోసం ప్రయాణికుడిని స్థానిక పోలీసులకు అప్పగించినట్లు సీఐఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. క్యాప్సూల్స్‌లో లభించిన బంగారాన్ని స్వచ్ఛత పరీక్ష కోసం పంపించారు. పరీక్షల తర్వాత బంగారం అసలు విలువ, స్వచ్ఛత తదితర వివరాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రయాణికుడు బంగారాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? దాన్ని ఎక్కడికి తరలించేందుకు ప్రయత్నించాడు? ఈ వ్యవహారం వెనుక మరెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో అధికారులు విచారణ చేపట్టే అవకాశం ఉంది.
ఈ కేసులో స్వాధీనం చేసుకున్న బంగారం పరిమాణం పెద్దగా లేకపోయినా.. దాన్ని దాచిన విధానం కారణంగా ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది. నోటిలో క్యాప్సూల్స్ రూపంలో బంగారాన్ని దాచుకుని ప్రయాణించేందుకు ప్రయత్నించడం అసాధారణమైన విషయమని అధికారులు చెబుతున్నారు.
Read Also: పరందూర్ ఎయిర్‌పోర్ట్ రద్దు.. విజయ్ నిర్ణయం సరైనదేనా? ఎందుకీ నిర్ణయం?