India Bullet Train Update: ముంబై–అహ్మదాబాద్ మధ్య నిర్మిస్తున్న తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఆలస్యం అవుతుందంటూ వస్తున్న విమర్శలపై జపాన్ హైస్పీడ్ రైల్ సంస్థ చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తికావడం లేదని ఆరోపణలు వస్తున్నప్పటికీ.. దీనిని సాధారణ ప్రాజెక్టులతో పోల్చి ఆలస్యం అని చెప్పడం సరికాదన్నారు. 500 కిలోమీటర్లకు పైగా హైస్పీడ్ బుల్లెట్ రైలు ప్రాజెక్టును భారత్ తొలిసారిగా చేపడుతోందని గుర్తు చేశారు.
జపాన్ 1964లో తన తొలి హైస్పీడ్ రైలును ప్రారంభించింది. అప్పటి నుంచి బుల్లెట్ రైళ్ల నిర్మాణం, నిర్వహణలో ఆ దేశానికి దాదాపు 62 ఏళ్ల అనుభవం ఉంది. అయినప్పటికీ.. ఇలాంటి 500 కిలోమీటర్ల హైస్పీడ్ రైలు మార్గాన్ని జపాన్ ఇప్పుడు మొదటిసారి నిర్మించాల్సి వస్తే పదేళ్లలో పూర్తి చేయడం సులభం కాదని జపాన్ ట్రాన్స్ పోర్ట్ అండ్ టూరిజం రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, ఇంటర్నేషనల్ హై స్పీడ్ రైల్ అసోసియేషన్ చైర్మన్ మసాఫుమి శుకూరి వెల్లడించారు. భారతదేశంలో తొలిసారిగా ఇంత భారీ ప్రాజెక్టును చేపట్టి ముందుకు తీసుకెళ్లడం కూడా పెద్ద విషయం అన్నారు.
ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టుకు మొదట 2022 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యం ఉండేది. అయితే, భూసేకరణలో ఎదురైన సమస్యలు, నిర్మాణానికి సంబంధించిన ఇతర అనుమతులు, కరోనా మహమ్మారి వంటి అనూహ్య పరిస్థితులు ప్రాజెక్టు వేగాన్ని ప్రభావితం చేశాయి. ప్రత్యేకంగా కోవిడ్ సమయంలో నిర్మాణ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడటంతో తిరిగి పనులను మొదలుపెట్టడానికి సమయం పట్టిందని శుకూరి తెలిపారు. అయినప్పటికీ ప్రాజెక్టు ప్రస్తుతం చాలా వేగంగా ముందుకు సాగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు మొత్తం పొడవు సుమారు 508 కిలోమీటర్లు. ఇందులో తొలి ప్రాధాన్యతా విభాగంగా గుజరాత్‌లోని సూరత్ నుంచి వాపి వరకు ఉన్న మార్గాన్ని ముందుగా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విభాగంలో 2027 చివరి నాటికి రైలు సేవలు ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. మొత్తం ప్రాజెక్టును 2029 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు కొనసాగుతున్నాయి.
ఈ ప్రాజెక్టులో మరో ఆసక్తికరమైన అంశం భారతదేశంలో తయారయ్యే బుల్లెట్ రైలు. భారత్ ప్రస్తుతం B28 పేరుతో సొంత హైస్పీడ్ రైలు సెట్‌ను అభివృద్ధి చేస్తోంది. బెంగళూరుకు చెందిన BEML రెండు రైలు సెట్లను తయారు చేస్తోంది. ఈ రైలు డిజైన్ వేగం గంటకు 280 కిలోమీటర్లుగా ఉండగా.. గరిష్టంగా గంటకు 250 కిలోమీటర్ల వేగంతో నడిచేలా రూపొందిస్తున్నారు. 2027 ఏప్రిల్ నాటికి తయారీ పూర్తి చేసి, మే నుంచి జూలై మధ్య పరీక్షలు నిర్వహించే ప్రణాళిక ఉంది. కమర్షియల్ సేవలను 2027 డిసెంబర్ నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Read Also: ప్రపంచంలోని టాప్ లగ్జరీ ట్రైన్స్.. ఒక్కో జర్నీ ఖర్చు తెలిస్తే షాక్!