Khonoma Village: ఆ ఊరి ప్రజలకు దొంగతనాలు తెలియదు. మోసం మాట విని ఉండరు. కొట్లాటల జోలికి వెళ్లరు. దుకాణాల్లో వస్తువులు ఉంటాయి. వాటి మీద ధర ఉంటాయి. మనుషులు ఉండరు. కావాల్సిన వాళ్లు డబ్బు దుకాణంలోని బాక్స్ లో వేయాలి. అవసరమైన వస్తువులను తీసుకెళ్లాలి. ప్రతి ఒక్కరు ఆర్గానిక్ వ్యవసాయం చేస్తారు. రసాయన ఎరువులు తెలియదు. పురుగు మందులు ఎరగరు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈ రోజుల్లో ఇలాంటి మనుషులు ఉన్నారా? అని ఆశ్చర్యం కలగకగ మానదు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది? దాని ప్రత్యేకత ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
దేశంలోనే తొలి గ్రీన్ విలేజ్
ఆ ఊరు మరేదో కాదు ఖోనోమా. దేశంలోనే తొలి గ్రీన్ విలేజ్ గా గుర్తింపు పొందింది. 2005లో భారత ప్రభుత్వం ఈ గ్రామానికి అధికారికంగా గ్రీన్ విలేజ్ అనే గుర్తింపు ఇచ్చింది. ఈ గ్రామం అత్యంత నాణ్యమైన జీవితాన్ని గడుపుతున్నట్లు గుర్తించింది. ఇండో-మయన్మార్ సరిహద్దుకు సమీపంలో ఉన్న నాగాలాండ్ లో ఖొనోమా ఉంటుంది. ఈ గ్రామ పరిసరాల్లో ఖ్వునో అనే మొక్కలు సమృద్ధిగా ఉంటాయి. ఆ మొక్కల పేరు మీదిగా దీనికి ఖోనోమా అనే పేరు వచ్చింది. ఈ గ్రామంలో అంగామి తెగకు చెందిన ప్రజలు ఉంటారు. వాళ్లు శౌర్యానికి, పోరాట పరాక్రమానికి ప్రసిద్ధి చెందారు. ఈ గ్రామం వెరుదుతో తయారు చేసే హస్త కళలలకు ప్రసిద్ధి చెందింది.
వేటపై నిషేధం విధించిన గ్రామస్తులు
ఖోనోమా గ్రామస్తుల జీవన విధానంలో వేట ఒక భాగంగా ఉండేది. కానీ, 1998 నుంచి ఈ ప్రాంతంలో వేటను నిషేధించాలని గ్రామస్తులు నిర్ణయించారు. జీవనోపాధి పొందేలావ్యవసాయం చేయడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని తీర్మానం చేశారు. అందులో భాగంగానే వ్యవసాయం, పశువుల పెంపకం, అటవీ వనరులను అభివృద్ధి చేస్తున్నారు. తాజాగా ఈ గ్రామానికి సంబంధించిన గొప్పదనానికి సంబంధించి ‘wanderlust_himani’ అనే ఇన్ స్టాలో ఒక వీడియో షేర్ చేశారు. ఇందులో ఖొనోమా గొప్పదనాన్ని వివరించారు.
దేశంలోనే సురక్షిత ప్రాంతాల్లో ఒకటి
ఖోనోమా దేశంలోనే అత్యంత సురక్షితమైన గ్రామాలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. ధైర్యవంతులైన స్థానికులు పరస్పర గౌరవం, సామూహిక క్రమశిక్షణతో ఒకరికొకరు స్నేహభావంతో కొనసాగుతారు. ఇక్కడ గొడవలు, కొట్లాటలు, దొంగతనాలు అనేవి ఉండవు. ఇక్కడి ప్రజలు తమ ఇళ్లకు, వ్యాపార సముదాయాలకు తాళం వేయరు. ఎవరూ దొంగతనాలు చేయరు. ఈ గ్రామంలో సుమారు 500 కుటుంబాలకు పైగా ఉన్నాయి. ఖోనోమాను చూసేందుక నిత్యం ఇక్కడికి పర్యాటకులు తరలి వస్తుంటారు. ఇక్కడి పర్యాటలక అందాలతో పాటు గ్రామస్తుల జీవన శైలి ఎంతగానో ఆకట్టుకుంటుంది.
సమాజం పట్ల, పర్యావరణ మేలు పట్ల ఈ గ్రామ ప్రజలు అనుసరిస్తున్న విధానాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఏమాత్రం పర్యావరణానికి హాని కల్పించని ఈ గ్రామస్తుల పద్దతులు, నిజంగా ఆచరణీయం అంటున్నారు. ఖోనోమా లాంటి పరిస్థితులు దేశంలోని అన్ని గ్రామాల్లో ఉంటే ఎంత బాగుంటుందో? అని ఆలోచిస్తున్నారు.
Read Also: టెన్త్ పాసైన వారికి రైల్వేలో ఉచిత శిక్షణ, నిరుద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్!