Train Testing Zone: భారతీయ రైల్వేలో కొత్త రైళ్లు, అత్యాధునిక టెక్నాలజీ వేగంగా అందుబాటులోకి వస్తున్నాయి. అయితే, వీటిని అమల్లోకి తీసుకొచ్చే ముందుకు అత్యంత పకడ్భందీగా పరీక్షించాల్సి ఉంటుంది. ఇందుకోసం దేశంలోనే తొలి హైస్పీడ్ టెస్ట్ ట్రాక్ రెడీ అవుతోంది. రాజస్థాన్ లో 59 కిలోమీటర్ల పొడవైన ఈ భారీ ప్రాజెక్ట్ పనులు చివరి దశకు చేరుకున్నాయి.
రాజస్థాన్‌లోని నవా ప్రాంతంలో గూఢా, తాతానా మిథ్రి మధ్య ఈ టెస్ట్ ట్రాక్‌ను నిర్మిస్తున్నారు. జైపూర్ కు సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం నార్త్ వెస్టర్న్ రైల్వే పరిధిలోకి ఉంటుంది. రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేష ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా రూ.967.07 కోట్లు ఖర్చు చేస్తున్నారు. రైళ్లను మాత్రమే కాకుండా భవిష్యత్తులో ఉపయోగించే రైల్వే పరికరాలు, ట్రాక్‌లు, సిగ్నలింగ్ వ్యవస్థలను కూడా ఇక్కడే పరీక్షించనున్నారు.
ఈ టెస్ట్ ట్రాక్‌ను సాధారణ రైల్వే లైన్ లా కాకుండా వివిధ రకాల పరీక్షలకు అనుగుణంగా రూపొందిస్తున్నారు. ఇందులో 23 కిలోమీటర్ల ప్రధాన లైన్, గూఢా దగ్గర 13 కిలోమీటర్ల హైస్పీడ్ లూప్ ఉన్నాయి. నవా దగ్గర 3 కిలోమీటర్ల యాక్సిలరేటెడ్ టెస్టింగ్ లూప్, మిథ్రి దగ్గర 20 కిలోమీటర్ల కర్వ్ టెస్టింగ్ లూప్ ఏర్పాటు చేస్తున్నారు. స్టాటిక్ రోలింగ్ స్టాక్ పరీక్షల కోసం 4.5 కిలోమీటర్ల ట్విస్టెడ్ ట్రాక్ ను కూడా నిర్మించారు. ఈ ట్విస్టెడ్ ట్రాక్ ఇప్పటికే పూర్తై అందుబాటులోకి వచ్చింది.
31.5 కిలోమీటర్ల హైస్పీడ్ స్ట్రెచ్, 3 కిలోమీటర్ల యాక్సిలరేటెడ్ లూప్ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ విభాగాలను 2026 సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. మిథ్రి దగ్గర నిర్మిస్తున్న 20 కిలోమీటర్ల కర్వ్ టెస్టింగ్ లూప్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇది 2026 చివరి నాటికి అందుబాటులోకి రానుంది.
ఈ టెస్ట్ ట్రాక్ పూర్తయిన తర్వాత ఇక్కడ పలు రకాల రోలింగ్ స్టాక్ లను కూడా పరీక్షించనున్నారు. ముఖ్యంగా సెమీ హైస్పీడ్ వందే భారత్ రైలు సెట్లకు సంబంధించిన ట్రయల్స్ కూడా ఇక్కడే నిర్వహించే అవకాశం ఉంది. 2027-28 నుంచి ఈ టెస్టింగ్ జోన్ లో రైళ్ల పరీక్షలు, ట్రయల్స్ ప్రారంభమవుతాయని తెలుస్తోంది. ప్రయాణికులకు కొత్త రైళ్లను తీసుకురావడానికి ముందు వాటి వేగం, స్థిరత్వం, భద్రత లాంటి అంశాలను ఇక్కడ పరీక్షించనున్నారు.
ఈ ప్రత్యేక టెస్ట్ ట్రాక్‌లో రైళ్లతో పాటు రైల్వే మౌలిక సదుపాయాలకు సంబంధించిన అనేక అంశాలను కూడా పరీక్షించనున్నారు. ట్రాక్ మెటీరియల్స్, వంతెనలు, ట్రాక్షన్ డిస్ట్రిబ్యూషన్ పరికరాలు, సిగ్నలింగ్ వ్యవస్థలు, జియోటెక్నికల్ అంశాలను పరిశీలించే అవకాశం ఉంటుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో రూపొందుతున్న ఈ కేంద్రం పూర్తయితే కొత్త రైళ్ల అభివృద్ధి, పరీక్షలు మరింత వేగంగా జరిగే అవకాశం ఉంది.
Read Also: కాశ్మీర్ ఆపిల్స్ కోసం ప్రత్యేక రైళ్లు, ఇక ఫ్రెష్ ఫ్రూట్స్ తినేయండి బాస్!