Kerala Twin Wedding Goes Viral: పెళ్లి అనగానే హంగూ ఆర్భాటాలతో అట్టహాసంగా జరుగుతుంటాయి. ఆకట్టుకునే అలంకరణలు, నోరూరించే విందు భోజనాలు, బంధుమిత్రుల సందడి.. ఆహా అనిపిస్తుంది. కానీ, రీసెంట్ గా కేరళలో జరిగిన ఓ పెళ్లిమాత్రం అందరినీ ఆశ్చర్యపరిచేలా చేసింది. పెళ్లికి వచ్చిన వాళ్లే కాదు, ఆ పెళ్లి గురించి తెలిసిన వాళ్లు కూడా క్రేజీగా ఫీలయ్యారు. ఎందుకంటే, ఈ పెళ్లిలో పెళ్లికొడుకులు కవలలు, పెళ్లికూతుళ్లు కవలలు. అంతేకాదు, పెళ్లి జరిపించిన పాస్టర్లు కూడా కవలలే. చివరకు తోటి పెళ్లి కొడుకులు కూడా కవలలే కావడం విశేషం.
కేరళలోని చంగనస్సేరిలో ఈ అరుదైన వివాహ వేడుక జరిగింది. చంగనస్సేరికి చెందిన కంజుమోన్ థామస్, జోమోల్ దంపతుల కవల కుమారులు అఖిల్, నిఖిల్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరు పతనం తిట్ట జిల్లాకు చెందిన తోమిచన్, మేరీకుట్టి దంపతుల కవల కుమార్తెలు మేగి, మరియాలను వివాహం చేసుకున్నారు. ఈ డబుల్ వెడ్డింగ్‌లో అఖిల్, మేగిని వివాహం చేసుకోగా, నిఖిల్, మరియాతో ఒక్కటయ్యాడు. ఒకే వేదికపై కవల అన్నదమ్ములు, కవల అక్కాచెల్లెళ్లు పెళ్లి చేసుకోవడం చూసి అక్కడికి వచ్చిన అతిథులు ఆశ్చర్యపోయారు. పెళ్లి వేదిక మొత్తం కవలల సందడితో నిండిపోయింది.
ఈ వివాహానికి అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. కాంజిరపల్లి డయాసిస్‌కు చెందిన ఫాదర్ ఆంటో, ఫాదర్ జో అనే కవల పాస్టర్లు ఈ వివాహాన్ని జరిపించారు. కవల వరులు, కవల వధువులకు కవల పాస్టర్లు పెళ్లి చేయడం అరుదైన ఘటనగా నిలిచింది. అంతేకాదు, పెళ్లి వేడుక దగ్గర సహాయకులుగా ఉన్న జెరోన్, జోహన్ అనే చిన్నారులు కూడా కవల సోదరులే. ఇలా పెళ్లిలో ప్రధాన పాత్ర పోషించిన వారిలో ఎక్కువ మంది కవలలే ఉండటంతో ఈ వేడుకను చూసినవారు ఆశ్చర్యపోయారు.
కవల పాస్టర్లతోనే తమ పెళ్లి జరగాలనే కోరికతో వధువులు ప్రత్యేకంగా ప్రయత్నించారు. కొథనల్లూరులోని ఒక చర్చి సహాయంతో కవల పాస్టర్ల వివరాలు తెలుసుకుని వారిని పెళ్లికి ఆహ్వానించారు. ఈ ఆహ్వానం తమకూ ఎంతో ప్రత్యేకంగా అనిపించిందని ఫాదర్ ఆంటో, ఫాదర్ జో తెలిపారు. తాము కూడా ఒకేసారి పూజారులుగా మారిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ, ఈ పెళ్లి వేడుక తమ జీవితంలో మరచిపోలేని మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుందని చెప్పారు.
అఖిల్, నిఖిల్ ఇద్దరూ మర్చంట్ నేవీలో ఉద్యోగాలు చేస్తున్నారు. మరోవైపు మేగి, మరియా ఇద్దరూ ఐటీ రంగంలో పనిచేస్తున్నారు. వృత్తులు వేర్వేరు అయినప్పటికీ, చిన్నప్పటి నుంచి జీవితంలోని ప్రతి దశను కలిసి పంచుకున్న ఈ కవలలు ఇప్పుడు కొత్త జీవిత ప్రయాణాన్ని కూడా దాదాపు ఒకే సమయంలో ప్రారంభించారు. చిన్నప్పటి నుంచే తమ వివాహం ప్రత్యేకంగా ఉండాలని మేగి, మరియా అనుకునేవారట. ఇప్పుడు వారి కోరిక నిజమైంది. కవల సోదరులను వివాహం చేసుకోవడమే కాకుండా, పెళ్లి వేడుక కూడా కవలల సమక్షంలో జరగడం వారిని ఎంతో ఆనందానికి గురిచేసింది.
Read Also: కారు నిండా ముద్దులు.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్, పాపం ప్రియుడు!