Bharat-Bhutan Mystic Mountain Tour: భారతీయ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఐఆర్సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీలు అందుబాటులోకి తీసుకొస్తోంది. భారత్ తో పాటు పొరుగు దేశాల్లోనే పర్యాటించే అవకాశాన్ని కల్పిస్తోంది. తాజాగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) భారత్-భూటాన్ మిస్టిక్ మౌంటైన్ టూర్‌ను పరిచయం చేసింది. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
జూన్ 28న ఈ టూర్ ప్రారంభం
భారత్- నేపాల్ టూర్ ఇప్పటికే సక్సెస్ కావడంతో ఇప్పుడు మరో టూర్ ప్లాన్ చేసింది. ‘భారత్-భూటాన్ మిస్టిక్ మౌంటైన్ టూర్’ పేరుతో కొత్త టూర్ ను తీసుకొచ్చింది. జూన్ 28న ప్రారంభమయ్యే ఈ టూర్ భారత్ తో పాటు పొరుగు దేశం భూటాన్ లోని మౌంటెయిన్ అందాలను చూసే అవకాశం కల్పిస్తోంది. న్యూఢిల్లీ నుంచి ప్రారంభమయ్యే 14 రోజుల పర్యటన గౌహతి, షిల్లాంగ్, చిరపుంజీలను కవర్ చేసి బెంగాల్ లోని హసిమారా రైల్వే స్టేషన్‌కు వెళుతుంది. అక్కడి నుంచి పర్యాటకులను పుయంట్ షోలింగ్ పట్టణం ద్వారా భూటాన్‌లోకి తీసుకెళ్తుంది. ఆ తర్వాత ఆరు రోజులు థింఫు, పునాఖాతో పాటు సహజ సౌందర్యం, పవిత్ర ప్రదేశాలకు నెలవైన పారోను పర్యాటకులు సందర్శించనున్నారు.
సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్ నుండి రైలు ప్రయాణం షురూ
ఇండియా- భూటాన్ యాత్రకు సంబంధించిన రైలు ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభం అవుతుంది. అస్సాంలోని గౌహతిలో మొదట ఆగుతుంది. అక్కడ పర్యాటకులను నీలాచల్ కొండల మధ్యలో ఉన్న కామాఖ్య ఆలయానికి తీసుకెళ్తారు. ఆ తర్వాత షిల్లాంగ్ కు వెళ్తారు. తూర్పు స్కాట్లాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ప్రాంతంలో పర్యాటకులకు ప్రకృతి అందాలను చూసే అవకాశం కల్పిస్తారు. ఉమియం సరస్సు వ్యూ పాయింట్ దగ్గర సూర్యాస్తమయాన్ని చూసిన తర్వాత మేఘాలయకు చేరుకుంటారు. మరుసటి రోజు చిరపుంజికి తీసుకెళ్తారు. హిమాలయాల అంచున ఉన్న అద్భుతమైన సెవెన్ సిస్టర్స్ జలపాతాలు, ప్రసిద్ధ నోహ్ఖలికాయ్, ఎలిఫెంట్ జలపాతాలను సందర్శిస్తారు. భూటాన్ సరిహద్దుకు సమీపంలోని హసిమారా రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కే ముందు బ్రహ్మపుత్ర నదిలో సూర్యాస్తమయ సమంలో క్రూయిజ్ టూర్ ఎంజాయ్ చేస్తారు. మరుసటి రోజు ఉదయం, రైలు హసిమారా స్టేషన్‌కు చేరుకుంటుంది. అక్కడ 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫుయంట్‌షోలింగ్ ఇమ్మిగ్రేషన్ చెక్ పాయింట్ కు వెళతారు. ఇమ్మిగ్రేషన్ తర్వాత భూటాన్ లోకి అడుగు పెడతారు.
థింపులోకి అడుగు పెట్టనున్న పర్యాటకులు
భారతీయ పర్యాటకులు ముందుగా భూటాన్ రాజధాని థింఫులోకి ఎంట్రీ ఇస్తారు. మరుసటి రోజు మోతితాంగ్ జూ, పెయింటింగ్ స్కూల్, నేషనల్ లైబ్రరీ, థింఫు హస్తకళలను చూస్తారు. ఆ రోజు తాషి చో డ్జోంగ్ కోట దగ్గర ముగుస్తుంది. ఆ తర్వాత భూటాన్ పాత రాజధాని పునాఖాకు వెళతారు. మార్గ మధ్యలో డోచులా పాస్ దగ్గర ఆగుతారు. పునాఖా చేరుకున్న తర్వాత, భూటాన్ లోని అతిపెద్ద జొంగ్ లలో ఒకటైన పునాఖా జొంగ్ ను చూస్తారు. ఇది ఫో చు, మో చు అనే మగ, ఆడ నదుల సమీపంలో ఉంటుంది. నెక్ట్స్ రోజు పారోకు వెళతారు. లోయలో అద్భుతమైన వరి పొలాలు, ఫామ్ హౌస్ లను చూస్తారు. లాంపేరి రాయల్ బొటానికల్ పార్క్, టామ్ చోగ్ లఖాంగ్ ఐరన్ బ్రిడ్జిని చూస్తారు. ఐకానిక్ పారో డ్జోంగ్ పారో డ్జోంగ్‌ఖాగ్ సన్యాసుల సంస్థను తిలకిస్తారు. అక్కడి ఇతర ప్రదేశాలను సందర్శించి వెనుదిరుగుతారు.
ప్యాకేజీ ధర ఎంత అంటే?
భారత్-భూటాన్ మిస్టిక్ మౌంటైన్ టూర్ ప్యాకేజీ ఛార్జీని AC-I కోచ్ లో వ్యక్తికి రూ. 1,58,850, AC-II క్యాబిన్ లో వ్యక్తికి రూ. 1,44,892, AC-II టైర్‌కు వ్యక్తికి రూ. 1,29,495, AC-III టైర్‌కు వ్యక్తికి రూ. 1,18,965గా నిర్ణయించారు. అన్ని కేటగిరీల పర్యాటకులకు 3-స్టార్ హోటళ్లలో నైట్ స్టే, శాకాహార భోజనం, బస్సులో పర్యాటక ప్రదేశాలకు తిప్పుతారు. టూర్ ఇన్సూరెన్స్, టూర్ ఎస్కార్ట్ సేవలు ఉంటాయి. ఈ రైలు జూన్ 28న బయలుదేరుతుంది. 13 రాత్రులు 14 రోజుల పర్యటనకు 150 మందిని తీసుకెళ్లనున్నారు.
Read Also: డోరేమాన్ థీమ్ తో రైల్వే స్టేషన్, ఆహా ఎంత బాగుందో!