Indian Railways New Rules: భారతీయ రైల్వే సంస్థ ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. ఇప్పటి వరకు ఒక వ్యక్తి నెలకు గరిష్టంగా 12 టికెట్ల వరకు బుక్ చేసుకునే అవకాశం ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్యను డబుల్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ రూల్ ను ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇప్పటి వరకు 12, ఇకపై 24..
ఇప్పటి వరకు ఉన్న టికెట్ బుకింగ్ రూల్స్ ను మార్పినట్లు ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెల్లడించింది. ప్రయాణీకులకు రైల్వే సేవలను మరింత సులభరతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. “రైల్వే ప్రయాణీకులకు మెరుగైన రైలు ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా భారతీయ రైల్వే సంస్థ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. ఇప్పటి వరకు ఆధార్ లింక్ చేయని వ్యక్తుల ఐడి ద్వారా నెలలో గరిష్టంగా 6 టిక్కెట్లను బుక్ చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ పరిమితిని 12 టిక్కెట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఒక నెలలో గరిష్టంగా 12 టిక్కెట్లను బుక్ చేసుకునే పరిమితిని 24 టిక్కెట్లకు పెంచాలని నిర్ణయించింది. ఇకపై టికెట్లు బుక్ చేసుకునే వారిలో ఎవరో ఒకరి ఆధార్ ను లింక్ చేయాల్సి ఉంటుంది” అని రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే, 6 కంటే ఎక్కువ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ప్రయాణీకుడు ఆధార్ ను లింక్ చేయాలి. ఆ తర్వాత మాత్రమే ఒక వ్యక్తి ఒకేసారి 6 కంటే ఎక్కువ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి అనుమతించబడతారు.
Read Also: పెళ్లి కొడుకు ఎక్కిన రైలు లేటు.. వెంటనే రైల్వే అధికారులు ఏం చేశారో తెలుసా? మీరు ఊహించలేరు!
ఒకే PNR మీద నాలుగు టికెట్లు బుక్ చేసుకునే అవకాశం
ఇక తత్కాల్ టికెట్లకు సంబంధించి రైల్వే సంస్థ కీలక మార్పులు చేసింది. భారతీయ రైల్వే కొత్త గైడ్ లైన్స్ ప్రకారం ఒక PNR నెంబర్ మీద గరిష్టంగా నలుగురు ప్రయాణీకులు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఒక ప్రయాణీకుడు ఒక PNRలో 4 తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి అనుమతించబడతారు. తత్కాల్ ఏసీ టికెట్ బుకింగ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. నాన్ ఏసీ టికెట్ బుకింగ్ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. తాజాగా తత్కాల్ టికెట్ బుకింగ్ చేసుకునే సమయాన్ని కేవలం 40 సెకెన్లలోగా పూర్తి కావాలని రైల్వే సంస్థ వెల్లడించింది.
రైలు టికెట్ కన్ఫర్మ్ కాకపోతే లేదంటే అత్యవసర సమయంలో తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. సాధారణంగా, తత్కాల్ టికెట్ ధర సాధారణ టికెట్ల కంటే ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు, రైలు షెడ్యూల్ టైమ్ కు ఒక రోజు ముందు మాత్రమే వాటిని బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. కన్ఫర్మ్ చేయబడిన తత్కాల్ టికెట్లను రద్దు చేసుకుంటే ఎలాంటి రీఫండ్ ఇవ్వరు. ఒక వేళ అనుకోని పరిస్థితులలో అంటే, రైలు రద్దు అయినా, ఆలస్యం అయినా పూర్తి స్థాయిలో రీఫండ్ పొందే అవకాశం ఉంటుంది.
Read Also: ట్రైన్ టికెట్ తో ఇన్ని ఫ్రీ సదుపాయాలా? కచ్చితంగా మీకు ఈ విషయాలు తెలియాల్సిందే!