చాలా సంస్థలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఆ ప్రకటనల వెనుక కచ్చితంగా మోసపూరిత ఉద్దేశం ఉంటుందంటున్నారు నిపుణులు. తాజాగా రైలు టికెట్ కన్ఫర్మ్ కాకపోతే మూడు రెట్లు డబ్బులు వెనక్కి ఇస్తామని ఇక్సిగో ప్రకటించినా, సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్ ఇస్తామని పీవీఆర్ సంస్థ ఆఫర్ ఇచ్చినా, అవన్నీ వినియోగదారులను ప్రలోభపెట్టే ఆఫర్లేనని తేల్చి చెప్తున్నారు.
ఏడాదిలో సగం సంపాదన..
ఆయా కంపెనీలు తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు, వినియోగదారులను ఆకట్టుకునేందుకు రకరకాల ఆఫర్లు అనౌన్స్ చేస్తుంటాయి. వినూత్న పద్దతిలో ఆఫర్లు ఇవ్వడం వల్ల మంచి డీల్స్ కొనసాగుతాయి. ముఖ్యంగా దసరా, దీపావళి సమయంలో ఆయా కంపెనీలు బోలెడు ఆరఫర్లను ప్రకటిస్తాయి. ఆ తర్వాత క్రిస్మస్, న్యూ ఇయర్ సీజన్ లో ఆఫర్లు అనౌన్స్ చేస్తాయి. కేవలం మూడు నెలల వ్యవధిలో తమ వార్షిక లక్ష్యాలలో సగం కంటే ఎక్కువగా సాధిస్తాయని మార్కెట్ నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఆఫర్ల వెనుక ఉద్దేశం ఇదే!
తాజాగా ప్రముఖ ట్రావెల్ టికెట్ బుకింగ్ యాప్ ఇక్సిగో కూడా ప్రయాణీకులను ఆకట్టుకునేలా ‘ట్రావెల్ గ్యారెంటీ’ ఆఫర్ ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్ ను ఉపయోగించుకోవాలంటే ట్రైన్ టికెట్ ఛార్జీకి అదనంగా రూ. 49 చెల్లించాల్సి ఉంటుంది. వెయిటింగ్ లిస్టులో ఉన్న టికెట్లు కూడా కచ్చితంగా కన్ఫర్మ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ టికెట్ కన్ఫర్మ కాకపోతే మూడు రెట్లు డబ్బులు వెనక్కి ఇస్తామని వెల్లడించింది. ఇక్కడే ఓ మెలిక ఉంది. టికెట్ కోసం చెల్లించిన డబ్బులను రీఫండ్ ఇచ్చినప్పటికీ మిగతా మూడు రెట్ల డబ్బును ‘ట్రావెల్ గ్యారెంటీ’ కూపన్ గా అందిస్తుంది. ఈ డబ్బులను అదే యాప్ లో విమానం, రైలు లేదంటే బస్సు టికెట్ల బుకింగ్ కోసం వాడుకోవచ్చు. అంటే, ఇక్కడ ఇక్సిగో ఇస్తానని చెప్పిన డబ్బులు నేరుగా ప్రయాణీకుడికి రావు. మళ్లీ అదే యాప్ లో ఉపయోగించుకునేలా కూపన్ ఇస్తారు. చివరకు ఎలాగైనా ఆ డబ్బులు తిరిగి వారికే చేరేలా ఈ ఆఫర్ ను డిజైన్ చేశారు.
ఇక తాజాగా ప్రముఖ ఫిల్మ్ ఎగ్జిబిటర్ పీవీఆర్-ఐనాక్స్ ‘పే ఫర్ వాట్ యు వాచ్’ అనే ఆఫర్ ను తీసుకొచ్చింది. దీని ద్వారా మీరు ఎంతసేపు సినిమా చూస్తే అంత వరకు మాత్రమే డబ్బులు చెల్లించాలి. మీరు సినిమాను సగం వరకు చూసి బయటకు వస్తే, అంత వరకే డబ్బులు తీసుకుఉంటుంది. థియేటర్ లో ఉన్నవాళ్లు ఎంతసేపు చూశారు? ఎప్పుడు బయటకు వెళ్లారు? అని పర్యవేక్షించేందుకు AI- పవర్డ్ వీడియో అనలిటిక్స్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఇక్కడ కూడా అసలు విషయం ఏంటంటే.. ఈ ఆఫర్ ను ఉపయోగించుకునే ప్రేక్షకులు టికెట్ ధరపై 10 శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. సో మొత్తంగా వినియోగదారులను నుంచి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టించే ఉద్దేశంతోనే ఈ ఆఫర్లు డిజైన్ చేయబడుతాయి తప్ప, ఏమాత్రం లాభం కలిగించేలా ఉండవని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read Also: జనరల్ జోలికి వెళ్లొద్దు.. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కీలక సిఫార్సులు!