తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై గతంలో నమోదైన ఓ కేసుని హైకోర్టు కొట్టివేసింది. ఎఫ్ఐఆర్ ని క్వాష్ చేయాలంటూ ఆయన వేసిన పిటిషన్ ని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం కేసుని కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రేవంత్ రెడ్డికి ఊరట లభించినట్టయింది.
అసలేం జరిగింది..?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి జన్వాడలో ఫామ్ హౌస్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఫామ్ హౌస్ వ్యవహారం ఇటీవల కూడా రాజకీయ దుమారానికి కారణం అయింది. అయితే 2020లో ఈ ఫామ్ హౌస్ వ్యవహారంలో జరిగిన ఓ ఘటనలో రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
రాజకీయ కక్షసాధింపేనా..?
2020 మార్చిలో రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది. జన్వాడ ఫామ్ హౌస్ పై డ్రోన్ ఎగరవేయడాన్ని తప్పుగా చిత్రీకరించారు. డ్రోన్ ఎగరవేసినందుకు గాను నార్సింగి పోలీసులు రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు అప్పట్లో ఆయన్ను అరెస్ట్ చేశారు కూడా. అంతే కాదు కోర్టు రిమాండ్ విధించడంతో రేవంత్ రెడ్డి 18 రోజులు జైలులో గడపాల్సిన పరిస్తితి వచ్చింది. అప్పట్లో దీన్ని రాజకీయ కక్షసాధింపుగా ప్రతిపక్షాలు దుయ్యబట్టాయి. అన్యాయంగా రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారంటూ కాంగ్రెస్ ఆందోళనకు దిగింది.
కేవలం ఫామ్ హౌస్ పరిసర ప్రాంతాల్లో డ్రోన్ ని ఎగరేసినందుకు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం అన్యాయం అని కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. అప్పట్లో అధికారాన్ని అడ్డు పెట్టుకుని బీఆర్ఎస్ అరాచక పాలన జరిపించిందని అన్నారు. దీనిపై తీవ్ర విమర్శలు చెలరేగడంతో బీఆర్ఎస్ కూడా భయపడింది. ఆ తర్వాత బీఆర్ఎస్ భయమే నిజమైంది. ఆ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. చివరకు అధికార మార్పిడి వరకు అది దారితీసింది.
ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. జన్వాడ ఫామా హౌస్ లెక్కలు తేల్చడానికి ఆయన సిద్ధమయ్యారు. అయితే అప్పటికే కేటీఆర్ ప్లేట్ ఫిరాయించారు. అది తన ఫామ్ హౌస్ కాదని, స్నేహితుడిదని, కావాలంటే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంపై రాజకీయ దుమారం కొనసాగుతున్న వేళ.. రేవంత్ రెడ్డిపై కేసుని తెలంగాణ హైకోర్టు కొట్టివేయడం విశేషం. అది రాజకీయ కక్షసాధింపుకోసం పెట్టిన కేసని, జన్వాడ ఫామ్ హౌస్ నిషిద్ధ ప్రాంతమేమీ కాదని, అక్కడ డ్రోన్ ఎగురవేసినందుకు కేసు పెట్టి వేధించడం సరికాదని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టులో తన వాదనలు వినిపించారు. దీంతో తెలంగాణ హైకోర్ట్.. నార్సింగి పీఎస్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ని కొట్టివేస్తూ ఉత్తర్వులిచ్చింది. దీంతో రేవంత్ రెడ్డికి ఈ కేసులో ఊరట లభించినట్టయింది. అటు కాంగ్రెస్ నేతలు కూడా హర్షం వ్యక్తం చేశారు. అప్పట్లో బీఆర్ఎస్ రాజకీయ కక్షసాధింపులకు పాల్పడిందనే విషయం మరోసారి రుజువైందని అంటున్నారు.