Indian Railways: భారతీయ రైల్వే సంస్థ రోజు రోజుకు అత్యాధుని రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఇప్పటికే వందే భారత్, నమో భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకురాగా, మరోవైపు బుల్లెట్ రైళ్లు, హైడ్రోజన్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది. అటు వారసత్వ ప్రాంతాల నడుమ వెళ్లే రైళ్లకు అత్యాధునిక హంగులను అద్దుతున్నది. పర్యాటకులు ప్రకృతి అందాలను మరింత సులభంగా వీక్షించేలా విస్టాడోమ్ రైళ్లను ప్రవేశపెడుతున్నది.
కల్కా- సిమ్లా రూట్ లో విస్టాడోమ్ రైలు
కల్కా- సిమ్లా నడున అత్యాధునిక విస్టాడోమ్ రైలును అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రస్తుతం ఈ మార్గంలో ట్రయల్ రన్ నిర్వహిస్తున్న విస్టాడోమ్ రైలుకు సంబంధించిన వీడియోను ఆయన షేర్ చేశారు. ఎరుపు రంగులో ఉన్న ఈ రైలు అందంగా ఆకట్టుకుంటున్నది. సుమారు అర నిమిషం పాటు ఉన్న ఈ రైలు వీడియో ఆహా అనిపిస్తున్నది. సుందరమైన ప్రకృతి అందాలను వీక్షించేలా దీనిని రూపొందించారు. ఈ రైల్లోని సౌకర్యాలను కూడా ఈ వీడియోలో హైలెట్ చేశారు. అద్భుతమైన వసతులతో కూడిన ఈ రైలు అద్భుతంగా కనిపిస్తున్నది. ఈ రైల్లో కూర్చుని పరిసరాలను చక్కగా వీక్షించేలా గాజు అద్దాలను ఏర్పాటు చేశారు. ఈ రైలుకు సుమారు రూ. 4 కోట్లు ఖర్చు అయినట్లు రైల్వే సంస్థ వెల్లడించింది.
New train for Kalkaji Shimla
Ready for giving a new experience in the scenic Himachal. pic.twitter.com/1nC1oNVH39
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 12, 2025
ఇప్పటికే పలు రూట్లలో విస్టాడోమ్ రైళ్లు
భారతీయ రైల్వే సంస్థ ఇప్పటికే పలు రూట్లలో విస్టాడోమ్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ముంబై-మడ్గావ్ ఎక్స్ ప్రెస్, డెక్కన్ క్వీన్ ఎక్స్ ప్రెస్, యశ్వంత్ పూర్-మంగళూరు ఎక్స్ ప్రెస్, కల్కా- సిమ్లా హిమ్ దర్శన్ లాంటి మార్గాల్లో విస్టాడోమ్ రైళ్లను నడుపుతున్నది. కల్కా-సిమ్లా రైల్వే లైన్ లో మొత్తం 18 స్టేషన్లు ఉన్నాయి. ఈ రైలు కల్కా, తక్సల్, గుమ్మన్, కోటి, సోన్వారా, ధర్మపూర్ HMCHL, కుమార్ హట్టి, బరోగ్, సోలన్, సలోగ్రా, కందఘాట్, కనోహ్, కాథ్లీఘాట్, షోఘి, తారాదేవి, జుతోగ్, సమ్మర్ హిల్, సిమ్లా ప్రాంతాల్లో ఈ రైలు ఆగుతుంది.
96 కిలో మీటర్లు.. 800 బ్రిడ్జిలు..
ఇక నార్త్ రైల్వేలోని అంబాలా డివిజన్ పర్యవేక్షణలో ఈ కల్కా- సిమ్లా రైల్వే రూట్ ఉన్నది. మొత్తం 96 కిలో మీటర్ల పరిధిలో అందమైన ప్రకృతి దృశ్యాలు నెలకొని ఉన్నాయి. ఈ మార్గంలో ఏకంగా 800 పైగా బ్రిడ్జిలు ఉన్నాయి. ఈ రైల్వే లైన్ 19వ శతాబ్దం మధ్యలో నిర్మించారు. ఈ అద్భుమైన రైల్వే లైన్ కు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద హోదాను అందించింది.
ఈ రైలును ఎక్కడ తయారు చేశారంటే?
ప్రస్తుతం కల్కా-సిమ్లా మార్గంలో ట్రయల్ రన్ జరుపుకుంటున్ననారో-గేజ్ విస్టాడోమ్ రైలు పర్యాటక రంగానికి మరింత ఊతం అందించనుంది. ఈ చారిత్రక మార్గంలో పర్యాటకుల ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఈ రైలును అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు రైల్వే సంస్థ తెలిపింది. ఈ లేటెస్ట్ విస్టాడోమ్ రైలు కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేయబడింది. ఈ కోచ్ లు ఈ ప్రాంత సహజ సౌందర్యాన్ని చూసేందుకు ఉపయోగపడనున్నాయి.
Read Also: దేశంలో అత్యంత చౌకైన ఏసీ రైలు ప్రయాణం ఇదే.. వేగంలో వందే భారత్ కు ఏమాత్రం తీసిపోదు!