తక్కువ ఖర్చు, ఎక్కువ మైలేజ్, చిన్న ఫ్యామిలీ ఈజీగా వెళ్లేలా రూపొందించిన కార్బైక్స్. ఇది కారు కాదు. అలాగని సైకిల్ కాదు. గేల్ రిచర్డ్, లూకాస్ వాన్కాన్ లతో కలిసి క్రిస్టోఫర్ సాంటెర్రే ఈ వాహనాన్ని రూపొందించారు. కర్బన ఉద్గారాలు లేని ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా దీనిని తయారు చేశారు. కార్గో సైకిల్, ఎలక్ట్రిక్ మైక్రో సిటీ కారుకు మధ్యస్థంగా ఉండే ఈ హైబ్రిడ్ వాహనం, పట్టణ, పెరి-అర్బన్, గ్రామీణ ప్రాంతాలలో రవాణా అవసరాలను తీర్చేలా దీనిని రూపొందించారు. వినియోగదారులు మరింత సౌకర్యంగా వెళ్లేలా, ఈజీగా వస్తువులను రవాణా చేసేలా ఈ వాహనాన్ని తయారు చేశారు. ఇది సైకిల్, కారును పోలి ఉంటుంది. బలమైన స్టీల్ ఫ్రేమ్, అల్ట్రా-లైట్ అల్యూమినియం షెల్‌తో నాలుగు-చక్రాల డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇది గాలి, వాన నుంచి రక్షణ కలిగిస్తుంది. దీని లోపల, ఇద్దరు పెద్దలు లేదంటే ఇద్దరు పిల్లలతో పాటు మరో వ్యక్తి వెళ్లేలా రూపొందించారు.
సౌకర్యవంతమైన రైడ్ అందించేలా..
ఈ కార్బైక్స్ వాహనం గంటకు 25 కిలో మీటర్ల వేగంతో ప్రయణిస్తుంది. ఆటోమేటిక్ గేర్లు, 750Wh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఎలక్ట్రికల్ అసిస్టెడ్ పెడలింగ్ వ్యవస్థతో రూపొందించారు. ఎవరైనా ఈజీగా ప్రయాణించేలా ఉంటుంది. విశాలమైన ట్రంక్ 400 లీటర్లు లేదంటే 150 కేజీల వరకు లోడింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఫ్రెంచ్ నగరమైన స్ట్రాస్ బోర్గ్ లో ఉన్న కార్బైక్స్, ఈ సంవత్సరం చివరి నాటికి స్థానికంగా పది యూనిట్లతో మొదటి బ్యాచ్‌ను ఉత్పత్తి చేయాలని యోచిస్తోంది, క్రమంగా ఉత్పత్తిని పెంచాలని కంపెనీ నిర్ణయించింది.
Read Also: చిన్న కారు, పెద్ద హిట్.. అమ్మకాల్లో దుమ్మురేపుతున్న ఎలక్ట్రిక్ కారు!
ఛార్జింగ్ అయిపోతే తొక్కుకుంటూ వెళ్లొచ్చు!
ఒకవేళ కార్బైక్స్ వాహనంలో ఛార్జింగ్ అయిపోతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. హాయిగా సైకిల్ మాదిరిగా తొక్కుకుంటూ వెళ్లొచ్చు. సో, ఛార్జింగ్ ఉన్నంత వరకు హాయిగా వెళ్లొచ్చు. ఒకవేళ ఛార్జింగ్ లేకపోయినా, ఈజీగా తొక్కుకుంటూ వెళ్లే అవకాశం కల్పించారు. ఈ వాహనాన్ని ఈ విధానం పెద్ద అడ్వాంటేజ్ కాబోతోంది. చాలా మంది వయో వృద్ధులు కూడా ఈ వాహానాన్ని కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. గ్రామీణ ప్రజలు తమ వస్తువులను రవాణా చేసేందుకు కూడా అనుకూలంగా ఉండటంతో వీటిని కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. అయితే, తొలుత విడుదల చేసే 10 యూనిట్లకు సంబంధించి పని తీరును గమనించిన తర్వాత కొనుగోలు చేయాలని మరికొంత మంది ఆలోచిస్తున్నారు. అయితే, ఛార్జింగ్ లేకపోయినా నడిపే అవకాశం ఉన్న నేపథ్యంలో వినియోగదారుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని కంపెనీ భావిస్తోంది. చాలా మంది ఆటో మోబైల్ నిపుణులు మాత్రం కార్బైక్స్ వాహనానికి మంచి ఫ్యూచర్ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఈవీ రంగంలో ఈ వాహనం ఓ ట్రెండ్ సెట్టర్ కాబోతుందని భావిస్తున్నారు.
Read Also: బుల్లెట్ ట్రైన్ బిగ్ అప్ డేట్, 12 స్టేషన్లతో రూట్ మ్యాప్ వచ్చేసింది!