Budget 2025: భారతీయ రైల్వే సంస్థ సాధిస్తున్న విజయాల పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయాలలో భాగస్వాములు అయిన ప్రతి ఒక్కరి ఆమె అభినందించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ఎన్నో ఏండ్లుగా కలలుకంటున్న కాశ్మీర్ నుంచి కన్యాకుమారి రైల్వే లైన్ పూర్తయ్యిందన్నారు. నార్త్, సౌత్ రైల్వే కనెక్టివిటీ మరింత పెరగబోతుందన్నారు.
త్వరలో ఉత్తర-దక్షిణ భారతాల రైల్వే కనెక్టివిటీ
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉధంపూర్- బారాముల్లా- శ్రీనగర్ రైలు ప్రాజెక్టు పూర్తయ్యిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడించారు. కాశ్మీర్, కన్యాకుమారికి రైల్వే లైన్ ద్వారా అనుసంధానించబడుతుందన్నారు. “ఉధంపూర్ -శ్రీనగర్- బారాముల్లా రైలు లింక్ ప్రాజెక్టు పూర్తయింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి రైల్వే లైన్ ద్వారా కలిపే అవకాశం రాబోతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో చీనాబ్ రైల్వే వంతెన నిర్మించబడింది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనగా గుర్తింపు తెచ్చుకుంది. భారతదేశంలో మొట్టమొదటి రైల్వే కేబుల్ బ్రిడ్జి అయిన అంజిఖాడ్ వంతెన సైతం పూర్తయ్యింది. ఈ రెండు ప్రతిష్టాత్మక వంతెలన మీద ట్రయల్ రన్ కూడా పూర్తయ్యింది. త్వరలో కాశ్మీర్-కన్యాకుమారి రైల్వే కనెక్టివిటీ కల సాకారం కాబోతున్నది” అని రాష్ట్రపతి వెల్లడించారు.
వందేభారత్ సేవలు మరింత విస్తృతం
ఇక దేశ వ్యాప్తంగా వందేభారత్, అమృత్ భారత్, నమో భారత్ రైళ్లు నడుస్తున్నాయని రాష్ట్రపతి ముర్ము వివరించారు. దేశ వ్యాప్తంగా 136 వందేభారత్ రైళ్లు ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉన్నాయన్నారు. అత్యధివేగం, అత్యాధునిక సదుపాయాలతో ప్రయాణీకులు ఆహ్లాదకర జర్నీని ఆస్వాదిస్తున్నట్లు చెప్పారు. నమోభారత్ రైళ్లు నగర ప్రజలకు మరింత సులభతరమైన రవాణా సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. గత ఆరు నెలల్లో 17 కొత్త వందే భారత్ రైళ్లు, ఒక నమో భారత్ రైలు అందుబాటులోకి వచ్చిందన్నారు. కొత్త రైళ్ల రాక నిరంతర ప్రక్రియగా ఆమె అభివర్ణించారు.
Read Also: తెలంగాణకు ఇప్పుడైనా కొత్త రైళ్లు వస్తాయా? కేంద్ర బడ్జెట్ పై రేవంత్ సర్కారు ఎన్నో ఆశలు!
హైడ్రోజన్ రైలు, స్వదేశీ బుల్లెట్ రైళ్లను ప్రస్తావించిన రాష్ట్రపతి
ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యంకాని రీతిలో భారత్ హైడ్రోజన్ లోకోమోటివ్ ను రూపొందించిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. ఈ రైలు ఇంజిన్ తయారు చేసిన ఇంజినీర్లను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఇక వందేభారత్ స్లీపర్ రైలు గంటలకు 180 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. కనీసం గ్లాసులో నీటి చుక్క ఒలికిపోనంత సౌకర్యవంతంగా వందేభాతర్ స్లీపర్ రైలు ప్రయాణిస్తోందన్నారు. ప్యాసింజర్లు అద్భుతమైన ప్రయాణా అనుభవాన్ని పొందే అవకాశం ఉందన్నారు. త్వరలో వందేభార్ స్లీపర్ రైళ్ల సేవలు ప్రారంభం కాబోతున్నట్లు చెప్పారు. ఇక జపాన్ నుంచి రావాల్సిన బుల్లెట్ రైళ్ల ఆలస్యం అయినప్పటికీ, స్వదేశీ బుల్లెట్ రైళ్ల తయారీపై భారత్ ఫోకస్ పెట్టిందన్నారు. ఈ ప్రాజెక్టులోనూ అద్భుతమైన విజయం సాధిస్తుందని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు.