Yellow Buoy Meaning: పడవలో ప్రయాణించేటప్పుడు నీటిపై కనిపించే బోయ్‌లను చూసి చాలామందికి అసలు అవి ఎందుకు పెట్టారో అర్థం కాకపోవచ్చు. రెడ్, గ్రీన్, ఆరెంజ్, యెల్లో లాంటి పలు రంగుల్లో ఇవి కనిపిస్తాయి. ఒక్కో రంగు గుర్తు ఒక్కో విషయాన్ని చెప్తుంది. ముఖ్యంగా యెల్లో కలర్ బోయ్ కనిపిస్తే దాని అర్థం ఏమిటో తెలుసుకోవడం పడవ నడిపేవారికి చాలా ముఖ్యం.
ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మెరైన్ ఎయిడ్స్ టు నావిగేషన్ అండ్ లైట్‌హౌస్ అథారిటీస్ వివరాల ప్రకారం, యెల్లో బోయ్ లు సాధారణంగా ప్రత్యేక ప్రాంతాలు, కొన్ని ప్రత్యేక పరిస్థితులను సూచిస్తాయి. అయితే, ప్రతి యెల్లో బోయ్ ఒకే విషయాన్ని చెప్పదు. అది ఉన్న ప్రదేశం, దానిపై ఉన్న గుర్తు, రంగుల కలయికను బట్టి అర్థం మారుతుంది. కొన్ని ప్రాంతాల్లో ప్రమాదాల గురించి హెచ్చరించడానికి, మరికొన్ని చోట్ల ప్రత్యేకంగా నిర్ణయించిన జల ప్రాంతాలను గుర్తించడానికి వీటిని ఉపయోగిస్తారు.
పసుపు రంగులో ఉండి దానిపై నల్లటి యాంకర్ గుర్తు కనిపిస్తే దాన్ని యాంకరేజ్ బోయ్ గా పిలుస్తారు. ఇలాంటి బోయ్‌లు పడవలను ఎక్కడ లంగరు వేయవచ్చో సూచిస్తాయి. సముద్రం, ఇతర జలాల్లో మనకు నచ్చిన చోట పడవను నిలిపి లంగరు వేయడం సాధ్యం కాదు. అందుకే లంగరు వేయడానికి అనుమతించిన ప్రాంతాల దగ్గర ఇలాంటి బోయ్‌లను ఏర్పాటు చేస్తారు. కొన్ని యాంకరేజ్ బోయ్ లపై పసుపు రంగు లైట్ కూడా ఉంటుంది. అది నిర్దిష్ట వ్యవధిలో మెరుస్తూ కనిపిస్తుంది.
పసుపు, నలుపు రంగుల కలయికతో కనిపించే బోయ్ లను కార్డినల్ బోయ్‌లు అంటారు. ఇవి నీటిలో ఉన్న ప్రమాదకర ప్రాంతం నుంచి సురక్షితంగా వెళ్లేందుకు ఏ దిశలో ప్రయాణించాలో సూచిస్తాయి. కార్డినల్ బోయ్ లో రంగుల అమరికను బట్టి ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర దిశను గుర్తించే అవకాశం ఉంటుంది. అందుకే, రంగులను సరిగ్గా గుర్తించడం చాలా ముఖ్యం.
నార్త్ కార్డినల్ బోయ్ పైభాగం నలుపు, కింది భాగం పసుపు రంగులో ఉంటుంది. ఇది ప్రమాద ప్రాంతానికి ఉత్తరం వైపు సురక్షితమైన నీరు ఉందని సూచిస్తుంది. బోయ్‌పై ఉన్న గుర్తులను కూడా గమనించడం అవసరం. సౌత్ కార్డినల్ బోయ్‌లో పైభాగం పసుపు, కింది భాగం నలుపు రంగులో ఉంటుంది. అంటే ప్రమాద ప్రాంతం నుంచి దక్షిణ దిశగా వెళ్లే సురక్షితమైన మార్గాన్ని సూచిస్తుంది. తూర్పు కార్డినల్ బోయ్ నలుపు రంగులో ఉండి మధ్యలో పసుపు రంగు పట్టీ ఉంటుంది. ఇది ప్రమాద ప్రాంతానికి తూర్పు వైపు సురక్షితమైన జలాలు ఉన్నాయని చెబుతుంది. పడమర కార్డినల్ బోయ్ పసుపు రంగులో ఉండి మధ్యలో నలుపు పట్టీ ఉంటుంది. ఇది ప్రమాద ప్రాంతానికి పడమర వైపు వెళ్లడం సురక్షితమని సూచిస్తుంది.
నీటిపై కనిపించే యెల్లో బోయ్‌ను సాధారణ గుర్తుగా తీసుకోకూడదు. దాని రంగుతో పాటు ఆకారం, గుర్తులు, లైట్లు కూడా గమనించాలి. పడవ నడిపే సమయంలో బోయ్‌లను సరిగ్గా గుర్తించడం కేవలం నావిగేషన్ కోసం మాత్రమే కాదు.. ప్రమాదాలను తప్పించుకోవడానికి కూడా ఎంతో అవసరం.
Read Also: విండ్‌షీల్డ్ సైడ్ లో నల్ల చుక్కలు.. వామ్మో.. వీటితో ఇన్ని లాభాలున్నాయా?