Indian Railways: భారతీయ రైల్వే సంస్థ త్వరలో వందేభారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే దేశ వ్యాప్తంగా 10 రైళ్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే రైల్వే అధికారులు కేరళలోని తిరువనంతపురం నుంచి ఒక వందే భారత్ స్లీపర్ రైలును నడపాలని నిర్ణయించారు.
కేరళలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు
ప్రస్తుతం రైల్వే సంస్థ తిరువనంతపురం నుంచి నాలుగు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు సేవలను అందిస్తోంది. ఇవన్నీ చైర్ కార్ కోచ్ లతో నడుస్తున్నాయి. వీటిలో.. రైలు నంబర్ 20632 త్రివేండ్రం సెంట్రల్ నుంచి మంగళూరు సెంట్రల్ వరకు రాకపోకలు కొనసాగిస్తోంది. రైలు నంబర్ 20634 త్రివేండ్రం సెంట్రల్ నుంచి కాసరగోడ్ మధ్యలో నడుస్తోంది. రైలు నంబర్ 20631 మంగళూరు సెంట్రల్ నుంచి త్రివేండ్రం సెంట్రల్ వరకు నడుస్తున్నది. రైలు నంబర్ 20633 కాసరగోడ్ నుంచి త్రివేండ్రం సెంట్రల్ వరకు ప్రయాణీకులను తీసుకెళ్తోంది.
తిరువనంతపురం వందే భారత్ స్లీపర్ రైలు
దక్షిణ రైల్వే తిరువనంతపురం రైల్వే స్టేషన్ నుంచి వందే భారత్ స్లీపర్ రైలును నడిపేందుకు రెడీ అవుతోంది. ఈ కొత్త అత్యాధునిక సౌకర్యాలు, అత్యంత వేగాన్ని కలిగి ఉంటుంది. యూరోపియన్ ప్రమాణాలతో సమానంగా ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. తిరువనంతపురం నుంచి నడిచే కొత్త వందే భారత్ స్లీపర్ రైలును ఏ రూట్ లో నడిపించాలనే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. “తిరువనంతపురం నుంచి వందే భారత్ స్లీపర్ రైలును నడపాలనే ప్రతిపాదన ఉంది. అయితే, ఈ కొత్త సెమీ హై స్పీడ్ రైలు మార్గాన్ని ఇంకా నిర్ణయించలేదు. త్వరలోనే రైల్వే బోర్డు రూట్ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటుంది” అని రైల్వే అధికారులు వెల్లడించారు.
కేరళ వందే భారత్ స్లీపర్ రైలు వేగం ఎంత?
కేరళలో అందుబాటులోకి రానున్న వందేభారత్ స్లీపర్ రైలు గరిష్టంగా గంటకు 160 కి.మీ వేగంతో నడుస్తుంది. ఈ రైలు 823 మంది ప్రయాణికులను తీసుకెళ్లేలా రూపొందించబడింది. వీటిలో 611 మంది ప్రయాణికులను AC 3 టైర్ బెర్త్ లలో, 188 మంది ప్రయాణికులను AC 2 టైర్ బెర్త్ లలో, 24 మంది ప్రయాణికులను ఫస్ట్ క్లాస్ AC బెర్త్ లో ప్రయాణించనున్నారు.
Read Also: రైలు నడిపే లోకో పైలట్లకు టాయిలెట్స్ ఉండవా? మరెలా?
కేరళ వందే భారత్ స్లీపర్ రైలు టాప్ ఫీచర్లు
కేరళలో అందుబాటులోకి వచ్చే వందే భారత్ స్లీపర్ రైలులో USB ఛార్జింగ్ సదుపాయంతో కూడిన ఇంటిగ్రేటెడ్ రీడింగ్ లైట్, పబ్లిక్ అనౌన్స్‌మెంట్, విజువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, లోపల డిస్‌ప్లే ప్యానెల్స్, సీసీ కెమెరాలు, మాడ్యులర్ ప్యాంట్రీలు, దివ్యాంగ ప్రయాణీకుల కోసం ప్రత్యేక బెర్త్‌లు, టాయిలెట్లు, రైలు భద్రత కోసం కవచ్ వ్యవస్థ లాంటి ప్రపంచ స్థాయి లక్షణాలు ఉన్నాయి. ఫస్ట్ AC కారులో వేడి నీటి షవర్లు అందుబాటులో ఉంటాయి.
Read Also: రైల్వే స్టేషన్ లో బస్తాల కొద్దీ కప్పలు.. ఓపెన్ చేసి చూసి రైల్వే పోలీసుల షాక్!