Indian Railways: దేశ ప్రజలకు చౌకైన ప్రయాణాన్ని అందించడంలో భారతీయ రైల్వే కీలక పాత్ర పోషిస్తుంది. నిత్యం లక్షలాది మంది ప్రయాణీకులు తమ గమ్య స్థానానికి చేర్చుతున్నది. సుదూర ప్రాంతాలకు ఆహ్లాదకరమైన ప్రయాణాన్ని అందించడంలో రైళ్లు సాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది రైలు ప్రయాణానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇంత మంది ప్రజలకు సర్వీసులు అందించే రైలు తయారీ గురించి, తయారీకి అయ్యే ఖర్చు గురించి ఏ రోజైనా ఊహించారా? ఇంతకీ అసలు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? తెలియకపోతే.. ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
దేశంలో ప్రస్తుతం రెండు రకాల ఇంజిన్ల వినియోగం
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 13 వేలకు పైగా రైళ్లు నిత్యం తమ సర్వీసులను అందిస్తున్నాయి. ప్రతి రైలులో పలు రకాల బోగీలు అందుబాటులో ఉన్నాయి. ఆయా కోచ్ ను బట్టి టికెట్ ధర ఉంటుంది. జనరల్, స్లీపర్, ఫస్ట్ ఏసీ, సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీ అంటూ కోచ్ లు ఉంటాయి. జనరల్ బోగీ టికెట్ ధర తక్కువగా ఉంటే, థర్డ్ ఏసీ కోచ్ ధర ఎక్కువగా ఉంటుంది. అయితే, వీటన్నింటినీ ముందుకు తీసుకెళ్లాలంటే ఇంజిన్ అత్యంత కీలకమైనది. బోగీలతో పోల్చితే ఇంజిన్ తయారీకి చాలా ఖర్చు అవుతుంది. ప్రస్తుతం దేశంలో రెండు రకాల ఇంజిన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి ఎలక్ట్రిక్ ఇంజిన్ కాగా, మరొకటి డీజిల్ ఇంజిన్. ఒక్కో ఇంజిన్ తయారీకి వాటి హార్స్ పవర్ స్థాయిని బట్టి ధర ఉంటుంది. ప్రస్తుత రైలు ఇంజిన్ల తయారీ ధర రూ. 13 కోట్ల నుంచి రూ. 20 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. ఒక రైల్వే కోచ్ ను తయారు చేయడానికి రూ. 2 కోట్లు ఖర్చు అవుతుంది. ఆయా కోచ్ లలో ఏర్పాటు చేసే సౌకర్యాలను బట్టి ధర పెరిగే అవకాశం ఉంటుంది.
Read Also: దేశంలో అత్యంత చౌకైన ఏసీ రైలు ప్రయాణం ఇదే.. వేగంలో వందే భారత్ కు ఏమాత్రం తీసిపోదు!
ఒక్కో రైలుకు సుమారు రూ. 66 కోట్లు ఖర్చు
సాధారణంగా ఒక్కో రైలులో 24 బోగీలు ఉండాలనేది లెక్క. కొన్ని రైళ్లలో కోచ్ ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఒక్కో కోచ్ తయారీకి సుమారు రూ. 2 కోట్లు ఖర్చు అవుతుంది. ప్యాసింజర్ రైలులో 24 కోచ్ లు ఉంటే వీటి ధర రూ. 48 కోట్ల వరకు అవుతుంది. అటు ఇంజిన్ తయారీకి సుమారు రూ. 18 కోట్లు ఖర్చు అవుతుంది. మొత్తంగా 24 కోచ్ ల రైలు తయారీకి రూ. 66 కోట్లు ఖర్చు అవుతుంది. అయితే, ప్రస్తుతం దేశంలో అందుబాటులోకి వస్తున్న వందేభారత్ రైళ్లు మరింత ధరను కలిగి ఉంటున్నాయి. ఒక్కో రైలు తయారీకి సగటున రూ. 115 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు వెల్లడించారు. వందేభారత్ స్లీపర్ రైలు ఇంజిన్ తో పాటు కోచ్ ల ధర కూడా ఎక్కువగా ఉంటుందన్నారు.
Read Also: టూరిస్టులకు గుడ్ న్యూస్, ఇక ఆ రూట్ లో విస్టాడోమ్ రైలు వచ్చేస్తోంది!