Indian Railways: భారతీయ రైల్వేలో అత్యాధునిక రైలుగా అడుగు పెట్టింది వందేభారత్ ఎక్స్ ప్రెస్. అద్భుతమైన సౌకర్యాలు, అత్యంత వేగంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. భారత్ లో ఇప్పటి వరకు ఉన్న రైళ్లను తలదన్నేలా ప్రపంచ స్థాయి ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. దేశ వ్యాప్తంగా ఆయా మార్గాల్లో 130 నుంచి 160 కిలో మీటర్ల వేగంతో ఈ రైలు ప్రయాణం చేస్తూ, ప్రయాణీకుల ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తోంది. అయితే, సాధారణంగా రైళ్లకు చివరి బోగీకి ‘X’ గుర్తు ఉంటుంది. కానీ, వందేభారత్ రైలుకు ఈ గుర్తు ఉండదు. ఎందుకు? అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు ‘X’ గుర్తు ఎందుకు ఉండదంటే?
ఇప్పటి వరకు వందే భారత్ చైర్ కార్ రైళ్లు మాత్రమే ఉండగా, త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. అయితే, అన్ని రైళ్ల మాదిరిగానే ఈ రైలు వెనుక ‘X’ గుర్తు అనేది ఉండదు. సాధారణంగా రైలు భద్రత కోసం ఈ గుర్తును ఉపయోగిస్తారు. రైలు చివరి బోగీకి ఈ గుర్తు వేస్తారు. దానికి ప్రధాన కారణంగా భద్రత. చివరి బోగీకి ‘X’ గుర్తు కనిపించలేదంటే, రైలుకు సంబంధించిన బోగీలు ఎక్కడో విడిపోయాయని గుర్తిస్తారు. వందే భారత్ రైళ్లకు ఈ రకమైన భద్రత అవసరం లేదు. ఈ రైలు పూర్తిగా జోడించి ఉంటుంది. ఈ రైలు రెండు వైపుల ఇంజిన్ ను కలిగి ఉంటుంది. ఇది రెండు దిశలలో నడుస్తుంది. సో, ఈ రైలుకు ‘X’ గుర్తు అవసరం లేదు.
త్వరలో వందేభారత్ స్లీపర్ రైళ్లు ప్రారంభం
ఇక ఇప్పటి వరకు 160 కిలో మీటర్ల వేగంతో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ప్రయాణిస్తుండగా, త్వరలో వందేభారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఒకేసారి దేశ వ్యాప్తంగా 9 నుంచి 10 వందేభారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని ఇండియన్ రైల్వే భావిస్తోంది. ఇప్పటికే ఈ రైళ్లు నడవాల్సిన రూట్లు కూడా దాదాపు ఖరారు అయ్యాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలకు మూడు రైళ్లు వస్తాయని భావించినా, ఇప్పటి వరకు 2 రైళ్ల విషయంలో క్లారిటీ ఇచ్చింది. వాటిలో ఒకటి సికింద్రాబాద్-పూణే కాగా, మరొకటి సికింద్రాబాద్- తిరుపతి. ఈ రెండు మార్గాల్లో ఈ ఏడాది చివరి వరకు లేదంటే వచ్చే ఏడాది ప్రారంభంలో అందుబాటులోకి రానున్నాయి. అటు సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్ లోనూ ఓ వందేభారత్ స్లీపర్ రైలును అందుబాటులోకి తీసుకురావాలనే డిమాండ్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ మార్గంలో రెండు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు నడుస్తాయి. వాటికి మంచి డిమాండ్ ఉంది. ఈ మార్గంలో కచ్చితంగా వందేభారత్ స్లీపర్ రైలు మొదటి విడుతలోనే అందుబాటులోకి వస్తుందని అందరూ భావించారు. కానీ, ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ రాలేదు. తొలి విడుతలో వందేభారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి రాకుండా, రెండో విడుతలోనైనా అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది.
Read Also: బుల్లెట్ ట్రైన్ కు ముహూర్తం ఫిక్స్.. పరుగులు పెట్టేది ఆ రోజు నుంచే!