Kochi Water Metro: ఇప్పటి వరకు మెట్రో రైలు అనగానే పట్టాల మీద వెళ్లడం చూశాం. దాదాపు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో మెట్రో రైల్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు మెట్రో సర్వీసులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అందుబాటులోకి తీసుకొచ్చాయి. దేశంలో తొలిసారి కొత్త రకం మెట్రో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది కేరళ ప్రభుత్వం. కొచ్చి వాటర్ మెట్రో పేరుతో నీటి మీద నడిచే మెట్రో సర్వీసులను ప్రారంభించింది. ఇంతకీ ఈ మెట్రో ఎలా పని చేస్తుంది? దీని ప్రత్యేతలు ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
దేశంలోనే తొలి వాటర్ మెట్రో!
భారత్ తో పాటు సౌత్ ఏసియాలోనే తొలి వాటర్ మెట్రో ఇదే కావడం విశేషం. కేరళ ప్రభుత్వ కలల ప్రాజెక్ట్ వాటర్ మెట్రో అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన బాధ్యతలను కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ నిర్వహిస్తుంది. ఈ వాటర్ మెట్రో సర్వీస్ లో మొత్తంగా 78 హైబ్రిడ్ బోట్లు ఉంటాయి. ఇవన్నీ ఎలక్ట్రిక్ బోట్లు కావడం విశేషం. ఈ వాటర్ మెట్రో సర్వీసుల కోసం 38 టెర్మినల్స్ ఏర్పాటు చేశారు. కొచ్చి చుట్టుపక్కలుండే 10 ఐలాండ్స్ ను కలుపుతూ ఈ వాటర్ మెట్రో సర్వీసులు కొనసాగుతున్నాయి.
రూ.1,136 కోట్ల వ్యయంతో వాటర్ మెట్రో నిర్మాణం
కేరళ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి రూ.1,136 కోట్లు ఖర్చు అయ్యింది. కేరళ ప్రభుత్వంతో పాటు జర్మనీకి చెందిన KFW అనే ఫండింగ్ సంస్థ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మించాయి. ఈ ప్రాజెక్టు పూర్తిగా విద్యుత్ తో నడుస్తున్నందున ఎలాంటి పర్యావరణ కాలుష్యం ఉండదు. ఇందులో సాధారణ జనాలతో పాటు దివ్యాంగులు కూడా కంఫర్ట్ గా జర్నీ చేసేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
పర్యాటక రంగానికి మరింత బూస్టింగ్
కేరళ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన వాటర్ మెట్రోతో కొచ్చి పరిసర ప్రాంతాలు పర్యాటకంగా మరింత డెవలప్ కానున్నాయి. స్థానికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందే అవకాశం ఉంటుంది. కేరళ ప్రభుత్వం దశల వారీగా ఈ సర్వీసుల సంఖ్య పెంచాలని భావిస్తోంది. ప్రస్తుతం ఈ మెట్రో సర్వీసులు 12 గంటల పాటు అందుబాటులో ఉంటున్నాయి. ఇక ఈ మెట్రో సర్వీసులు పూర్తిగా ఏసీతో పాటు వైఫై సౌకర్యాన్ని కలిగి ఉన్నాయి. ఒక్కో బోటులో ఒకేసారి 100 మంది ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఈ మెట్రో సర్వీసు గరిష్టంగా 22 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
?igsh=dTk1NzUzcnc4amF1
టికెట్ ధర కూడా తక్కువే!
ఇక కొచ్చి వాటర్ మెట్రో సర్వీస్ కు సంబంధించి టికెట్ ధరలు కూడా తక్కువగానే ఉన్నాయి. ప్రారంభ ధర రూ. 20 కాగా, గరిష్ఠ ధర రూ. 40గా నిర్ణయించింది. వారం రోజులు, నెల రోజుల, మూడు నెలల వ్యవధితో పాసులను అందుబాటులోకి తీసుకొచ్చింది కేరళ ప్రభుత్వం.
Read Also: దేశంలో అత్యంత అందమైన రైల్వే స్టేషన్, జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే!