Maha Kumbh Trains Damage: ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ వేదికగా జరిగిన మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంబురంలో ఏకంగా 60 కోట్ల మంది భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు చేశారు. మూడు నదులు కలిసే త్రివేణి సంగమంలో స్నానాలు చేసేందుకు కనీవినీ ఎరుగని రీతిలో భక్తులు తరలి వచ్చారు. సంక్రాంతి రోజు మొదలైన ఈ వేడుక మహాశివరాత్రి వరకు కొనసాగింది. మహా కుంభమేళా అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు నెలకొల్పింది.
మహా కుంభమేళా సందర్భంగా 22 రైళ్లు ధ్వంసం
ఇక మహా కుంభమేళా సందర్భంగా 22 రైళ్లు దాడులకు గురయ్యాయని కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పార్లమెంట్ లో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా సమాధానం చెప్పారు. ఈ దాడులకు పాల్పడిన పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఫిబ్రవరి 15న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ (NDLS)లో జరిగిన తొక్కిసలాటను ఆయన దురదృష్టకర సంఘటనగా అభివర్ణించారు. ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా, 15 మంది గాయపడినట్లు వెల్లడించారు. ఈ సంఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట ఘటన జరిగిన రోజున జనరల్ టికెట్ల అమ్మకాలపై తృణమూల్ కాంగ్రెస్ (TMC) సభ్యుడు రాయ్ ప్రశ్న అడిగారు. దీనికి వైష్ణవ్ స్పందించారు.. “ఫిబ్రవరి 15న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో సుమారు 49,000 జనరల్ టికెట్లు జారీ చేశారు. ఇది గత ఆరు నెలల్లో రోజువారీ సగటు టికెట్ల సంఖ్య కంటే 13,000 ఎక్కువ. అదనపు ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా 5 ప్రత్యేక రైళ్లను నడిపాం” అన్నారు.
పరిహారం గురించి కీలక ప్రకటన..
న్యూఢిల్లీలో జరిగిన తొక్కిసలాటలో మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు అందించే పరిహారం గురించి అశ్విని వైష్ణవ్ కీలక విషయాలు వెల్లడించారు. “రైల్వే చట్టం, 1989 ప్రకారం రైల్వే ప్రమాదంలో చనిపోయిన వారికి, గాయపడిన వారికి పరిహారం చెల్లిస్తాం. బాధితులు, వారి మీద ఆధారపడినవారు RCT ముందు దాఖలు చేసిన క్లెయిమ్ దరఖాస్తు ఆధారంగా రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ (RCT) ఈ మొత్తాన్ని నిర్ణయిస్తుంది. తగిన న్యాయ ప్రక్రియను అనుసరించిన తర్వాత ట్రిబ్యునల్ కేసులను పరిష్కరిస్తుంది” అన్నారు. “న్యూఢిల్లీ రైల్వే స్టేషన్త తొక్కిసలాట ఘటనలో మరణించిన ప్రతి వారి బంధువులకు ₹10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి ₹2.50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి ₹1 లక్ష చొప్పున ఎక్స్-గ్రేషియా చెల్లించాం. 33 మంది బాధిత కుటుంబ సభ్యులకు మొత్తం ₹2.01 కోట్లు చెల్లించాం” అని అశ్విని వైష్ణవ్ తెలిపారు.
Read Also: ప్లాట్‌ఫామ్ టికెట్ల అమ్మకాలు రద్దు, హోలీ నేపథ్యంలో ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం!
మహా కుంభమేళా సందర్భంగా 13 వేల రైళ్లు
మహా కుంభమేళా సందర్భంగా రైల్వే శాఖ 13,667 రైళ్లను నడిపింది. వీటి ద్వారా సుమారు 12 నుంచి 15 కోట్ల మంది కుంభమేళాకు వెళ్లారు. ఈ వేడుకలకు వెళ్లే రైళ్లపై బీహార్, ఉత్తరప్రదేశ్ లోని రైల్వే స్టేషన్లలో పలువురు దుండగులు రాళ్లు రువ్వారు. ప్రయాగరాజ్ వైపు వెళ్లే రైళ్లను ధ్వంసం చేశారు. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Read Also: రైలు ప్రయాణంలో మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ కోటా, రైల్వే మంత్రి కీలక ప్రకటన!