Indian Railways: రైల్వే సంస్థ నిర్లక్ష్యం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న పలువురు ప్రయాణీకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి పరిహారం పొందిన ఘటనల గురించి తరచుగా వింటూనే ఉంటాం. తాజాగా అలాంటి తీర్పు మరొకటి వచ్చింది. తత్కాల్ టికెట్ ఉన్నప్పటికీ ప్రయాణీకుడికి బెర్త్ కేటాయించకపోవడంపై వినియోగదారుల ఫోరమ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సదరు ప్రయాణీకుడికి కలిగిన అసౌకర్యానికి గాను భారతీయ రైల్వే సంస్థ రూ. 30 వేలు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పుపై సదరు ప్రయాణీకుడు సంతోషం వ్యక్తం చేశాడు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
గత ఏడాది ఏప్రిల్ 25న యశ్వంత్ పూర్ -కన్నూర్ ఎక్స్ ప్రెస్‌లో కొట్టక్కల్ సమీపంలోని తిరూర్‌కు ప్రయాణించడానికి జెమ్ షీద్ తైక్కత్ అనే వ్యక్తి తత్కాల్ టికెట్ బుక్ చేసుకున్నాడు.అతడు యశ్వంత్ పూర్ లో రైలు ఎక్కాడు. అతడి బెర్త్ లో ఐదుగురు రిజర్వేషన్ లేని వ్యక్తులు కూర్చున్నారు. వారిని బెర్త్ ఖాళీ చేయమని అడిగినా చేయలేదు. వెంటనే జెమ్ షీద్ రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు టీటీఈకి చెప్పాలన్నారు. అతడు టికెట్ బుక్ చేసుకున్నది S1 బోగీలో. జనరల్ కంపార్ట్ మెంట్ పక్కన ఉన్నందున TTE రాలేదు. వెంటనే ఆయన రైల్వే హెల్ప్ లైన్ 139కి కాల్ చేశాడు. దానివల్ల కూడా ఏం ఉపయోగం లేకుండా పోయింది. రైల్ మదద్ యాప్ లోనూ కంప్లైంట్ చేశాడు. అక్కడా సరైన సమాధానం రాలేదు. చేసేదేం లేక సుమారు 10 గంటల పాటు రైల్లో నిలబడి ప్రయాణం చేశాడు. ఏప్రిల్ 26న తిరూర్ కు చేరుకోగానే స్టేషన్ మాస్టర్‌కు ఫిర్యాదు చేశాడు. అక్కడ కూడా పెద్దగా పాజిటివ్ స్పందన రాలేదు. IRCTC, పాలక్కాడ్ రైల్వే డివిజన్, బెంగళూరు రైల్వే డివిజన్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయినా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో అతడు ఆగస్టు 8న రూ. 4 లక్షల పరిహారం కోరుతూ మలప్పురం జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ను ఆశ్రయించాడు.
Read Also: వైజాగ్ వెళ్లే ప్రయాణీకులకు గుడ్ న్యూస్, రెండు రోజుల పాటు ప్రత్యేక రైళ్లు!
30 వేల పరిహారం అందించాలని తీర్పు
ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు సుమారు 5 విచారణలు జరిగాయి. జెమ్ షీద్ తైక్కత్ అన్ని విచారణలకు హాజరయ్యాడు. తనకు జరిగిన అన్యాయాన్ని వివరించాడు. అధ్యక్షుడు మోహన్‌దాసన్ కె, సభ్యులు ప్రీతి శివరామన్ సి, మహమ్మద్ ఇస్మాయిల్ నేతృత్వంలోని కమిషన్.. రైల్వే అధికారుల నుంచి వచ్చిన సమాధానాల పట్ల కమిషన్ సంతృప్తి చెందలేదు. ఫిర్యాదు లోపభూయిష్టంగా ఉందనే రైల్వేల వాదనను తిరస్కరించింది. రిజర్వేషన్ టికెట్ ఉన్న ప్రయాణీకుడికి బెర్త్ ను అందించడం భారతీయ రైల్వే బాధ్యత అని తీర్పు ఇచ్చింది. సర్వీస్ అందించడంలో లోపం కారణంగా ప్రయాణీకుడికి అసౌకర్యం కలగడంతో పాటు న్యాయపోరాటం చేయాల్సి వచ్చిందని అభిప్రాయపడింది. ఇందుకు గాను, జెమ్‌షీద్ తైక్కత్ కు పరిహారంగా రూ. 25,000, చట్టపరమైన ఖర్చుల కోసం రూ. 5,000 చెల్లించాలని మలప్పురం జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ రైల్వే సంస్థను ఆదేశించింది.
Read Also: వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఇలా కన్ఫర్మ్ అవుతాయా? పెద్ద కథే!